Russia Ukraine War: పుతిన్‌కు పదవీ గండం తప్పదా? యుద్దం ముగిసేవరకు కూడా పుతిన్...

Talks Underway to Replace Vladimir Putin as Russia President Says Ukrainian Official
x

Russia Ukraine War: పుతిన్‌కు పదవీ గండం తప్పదా? యుద్దం ముగిసేవరకు కూడా పుతిన్...

Highlights

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పదవీ గండం ఉందా?

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పదవీ గండం ఉందా? ఆయనను పదవి నుంచి తొలగించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవునని చెబుతున్నారు ఉక్రెయిన రక్షణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కిరిలో బుదనోవ్‌ యుద్ధం ముగిసేవరకు కూడా పుతిన్‌ పదవిలో ఉండడం అనుమానమేనంటూ బుదనోవ్‌ వ్యాఖ్యానించారు. పుతిన్‌ స్థానంలో ఎవరిని నియమించాలనే విషయమై రష్యా అధికారులు తీవ్రంగా చర్చించుకుంటున్నట్టు తెలిపారు. కైరైలో బుదనోవ్‌ వ్యాఖ్యలు నిజమేనా? పుతిన్‌పై సొంత నేతలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే పుతిన్‌పై గతంలోనూ ఇలాంటి ప్రచారమే అయ్యిందని కొందరు మాత్రం బుదనోవ్‌ వ్యాఖ్యలను కొట్టి పడేస్తున్నారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో జెలెన్‌స్కీ, పుతిన్‌ అనే పేర్లు వినని వారు ఉండరేమో మారుమూల ప్రాంతంలోని వారికి కూడా ఈ ఇద్దరి నేతల పేర్లు తెలుసు. పుతిన్‌ దూకుడుతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో పుతిన్‌పై ఎన్నో కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువుడుతున్నాయి. అయితే వాటిలో పుతిన్‌ వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యం, పదవిపైనే అత్యధిక విశ్లేషణలు వెలువడ్డాయి. తాజాగా పుతిన్‌ అధ్యక్ష పదవిపై ఉక్రెయిన్‌ రక్షణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కిరిలో బుదనోవ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌కు పదవీ గండం ఉన్నట్టు వెల్లడించారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసేవరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ ఉండడం అనుమానమేని బుదనోవ్‌ తెలిపారు. సొంత పార్టీలోనే కొందరు పుతిన్‌ను దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. పుతిన్‌ స్థానంలో ఎవరిని నియమించాలోనని అక్కడి నేతలు చర్చలు జరుపుతున్నట్టు బుదనోవ్‌ వెల్లడించారు. మరో నేత దొరికితే మాత్రం పుతిన్‌ను దించేయడం ఖాయమన్నట్టు స్పష్టం చేశారు. అయితే అందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? పుతిన్ తరువాత ఎవరిని ఎన్నుకుంటారు? అన్న ప్రశ్నలకు మాత్రం బుదనోవ్‌ సమాధానం చెప్పలేదు. అయితే నిజంగానే రష్యాలో పుతిన్‌పై వ్యతిరేకత మొదలైందా? పుతిన్‌ను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న చర్చ మాత్రం మొదలైంది.

అయితే మేజర్‌ జనరల్‌ కిరిలో బుదనోవ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు మేలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుని ఏడాది చివరిలో ముగిసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ ఈ యుద్ధంలో రష్యా ఓడిపోతే పుతిన్‌ పదవి పోవడం ఖాయమని ఆ దేశం కుప్పకూలుతోందని కిరిలో జోస్యం చెప్పారు. ఇప్పటికే పుతిన్‌ను గద్దె దింపే ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. రష్యాలో కొందరు పుతిన్‌పై తిరుగుబాటుకు యత్నిస్తున్నట్టు కిరిలో చెప్పుకొచ్చారు. తిరుగుబాటుదారులను ఆపడం మాస్కో అధినేతకు అసాధ్యమని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కిరిలో బుదనోవ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు పుతిన్‌ మానసిక పరిస్థితి కూడా బాగాలేదని అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడిపై తాము తప్పుడు ప్రచారం చేయడం లేదని కిరిలో బుదనోవ్ అన్నారు. పుతిన్‌ సమాచారం తెలుసుకోవడం తమ విధుల్లో భాగమన్నారు. ఇక యుద్ధంలో రష్యా తీవ్రంగా నష్టపోతుందని బుదనోవ్‌ తెలిపారు. ఐరోపా దేశాలు మాస్కో సేనలను చూసి భయపడుతున్నాయని కానీ మాస్కో బలగాలకు అంత సీన్‌ లేదన్నారు. మాస్కో సేనలను ఆయుధాలు కలిగిన జనసమూహంగా అభివర్ణించారు. ఖార్కివ్‌లో పుతిన్‌ సేనలను తరిమి కొట్టిన విషయాన్ని కిరిలో గుర్తు చేశారు. ఇప్పటికే రష్యా భారీగా సైన్యాన్ని ఆయుధాలను కోల్పోయిందన్నారు.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభం నుంచి రష్యాలో ఓ వర్గం పుతిన్‌ను వ్యతిరేకిస్తోంది. యుద్దానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులను పుతిన్‌ ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలువురు ఆందోళనకారులను పుతిన్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే ఉక్రెయిన్ యుద్దంలో ఎదురు దెబ్బలు తగులుతుండడంతో పుతిన్‌ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 3 లక్షల మంది సమీకరించి.. ఉక్రెయిన్‌పై దించుతామని సెప్టెంబరులో పుతిన్‌ ప్రకటించారు. దీంతో రష్యన్‌ యువతలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. ఉక్రెయిన్‌ యుద్ధంలో తాము పాల్గొనమంటూ.. దేశం విడిచి వెళ్లిపోవడానికి యత్నించారు. పుతిన్‌ ప్రకటన వెలువుడిన తరువాత.. లక్ష మందికి పైగా యువత దేశం విడిచి వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి వెళ్తే చావు తప్పదంటూ యువతలో భయం నెలకొన్నది. దీంతో యుద్దానికి వెళ్లి చచ్చే కంటే.. కాళ్లో, చేతులో విరగ్గొట్టుకుని ఇక్కడే ఉండాలని పలువురు ఆ ప్రయత్నాలు కూడా చేశారు. అంతేకాదు బలవంతంగా యువతను యుద్ధంలోకి తీసుకోవడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు, వ్యతిరేకత వస్తుండడంతో సైనిక సమీకరణను పుతిన్‌ ఆపేశారు. ఈ విషయమై ఇప్పటికీ రష్యాలో ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా కూడా సైనిక సమీకరణ మళ్లీ చేపట్టేది లేదని పుతిన్‌ మరోసారి స్పష్టం చేశారు.

ఒకవేళ ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఓటమి పాలైతే పుతిన్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే విలీనం చేసుకున్న నాలుగు రీజియన్లలో ఉక్రెయిన్‌ దాడులను ఉధృతం చేసింది. రష్యా సైన్యం పారిపోతున్నారు. తాజాగా ఖేర్సన్‌ను కూడా రష్యా బలగాలు ఖాళీ చేశాయి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా ఆశించినంతగా లేదు. చమురు, గ్యాస్‌తోనే ఆర్థిక గండం నుంచి ప్రస్తుతం పుతిన్‌ గట్టెక్కుతున్నారు. మరోవైపు కొన్ని వేల కోట్ల డాలర్లతో నిర్మించిన నార్డ్‌స్ట్రీమ్‌-1, ప్రారంభానికి సిద్ధమైన నార్డ్‌స్ట్రీమ్‌-2 పైపులైన్లు వృథాగా మారాయి. ఐరోపా దేశాలు గత్యంతరం లేక.. గ్యాస్‌ కోసం తన కాళ్లు పట్టుకుంటాయని పుతిన్‌ అంచనా వేశారు. ఈ విషయంలోనూ పుతిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఐరోపా దేశాలు గ్యాస్‌ను భారీగా కొనుగోలు చేశాయి. ఈ ఏడాది గ్యాస్‌ సంక్షోభం తలెత్తకుండా విజయవంతంగా నిల్వలు పెంచుకున్నాయి. ఇది పుతిన్‌కు భారీ దెబ్బేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇలా పుతిన్‌కు ఇటీవల వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కూడా తిరుగుబాటు చేసే అవకాశం లేకపోలేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పుతిన్‌ను పదవి నుంచే దింపే సాహసం ఎవరూ చేయరని మాజీ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌ అయిన ఆయన అందరిని నిఘాతో తన గ్రిప్‌లో పెట్టుకున్నారని వాదిస్తున్నారు. పుతిన్‌కు ఎదురు తిరిగితే ప్రాణాలు పోవడం ఖాయమని కూడా చెబుతున్నారు.

మొత్తంగా పుతిన్‌ను దించడం మాత్రం అంత సులువు కాదని ఎక్కువ మంది వాదిస్తున్నారు. యుద్దంలో ఓటమితో ఆర్థికంగా నష్టపోయే అవకాశమే ఉందని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో? అంచనా వేయడం కష్టమేనని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories