Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..

Taliban Orders Female TV Anchors to Cover Their Faces
x

Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..

Highlights

Afghanistan: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అచరాకాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు కఠిన ఆంక్షలను విధిస్తున్నారు.

Afghanistan: అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అచరాకాలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. మహిళల హక్కులను హరించి వేస్తున్నారు. ముఖ్యంగా బాలికల విద్య, మహిళలు స్వేచ్ఛగా బయటకు రావడంపై తాలిబన్ల ఆంక్షలు అధికమయ్యాయి. ఇటీవల బుర్కా లేకుండా బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేసిన తాలిబన్లు తాజాగా టీవీ యాంకర్లు, మహిళా రిపోర్టర్లపై కొత్త ఆంక్షలు విధించారు. ముఖాన్ని కూడా కప్పేసుకుని వార్తలను చదవాలని కొత్త నిబంధన తీసుకొచ్చారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే అరబ్‌ దేశాల్లోనూ మహిళా యాంకర్లు తలబాగాన్ని మాత్రమే కప్పేసుకుని ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే తాలిబన్లు ఒకడుగు ముందుకు వేసి మరింత కఠింగా వ్యవహరిస్తున్నారు.

గతేడాది ఆగస్టు 15న కాబుల్‌ను హస్తగతం చేసుకుని ఆఫ్ఘాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో అరాచకాలతో కష్టాలను ఎదుర్కొన్న మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులే పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరి కొందరు దారుణ పరిస్థితుల్లో దేశం విడిచి పారిపోయారు. అయితే గతంలోలాగా చేయమని తాము మారామని ఎవరూ దేశం వదిలివెళ్లిపోవాల్సిన అవసరం లేదని తాలిబన్లు చెప్పారు. అయితే వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటని తాజాగా కఠిన నిర్ణయాలను చూస్తే అర్థమవుతోంది. ఇటీవల బుర్కా ధరించే బహిరంగ ప్రదేశాలకు రావాలని తాలిబన్లు ఆదేశించారు. పురుషులు తప్పనిసరి గడ్డం పెంచుకోవాల్సిందేనని ఖరాకండీగా చెప్పారు.

వారం క్రితం మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వొద్దంటూ తాలిబన్లు రవాణా విభాగాన్నిఆదేశించారు. ఇప్పుడు టీవీ యాంకర్లపైనా పడ్డారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశించారు. మీడియా ఛానెల్స్‌తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్‌ మంత్రి అఖిఫ్‌ మహజార్‌ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఇస్తున్నారు.

తాలిబన్ల అరాచకపాలనపై అమెరికా, ఐక్యకరాజ్య సమితి మానవ హక్కుల విభాగం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలపై విధిస్తున్న ఆంక్షలను సడలించాల్సింది సూచిస్తున్నాయి. కానీ తాలిబన్లు మాత్రం మతవిశ్వాసాల పేరుతో రెచ్చిపోతున్నారు. మరోవైపు దేశంలో ఉగ్రదాడులు భారీగా పెరుగుతున్నాయి. ఉగ్ర చర్యలను అరికట్టడంలో తాలిబన్లు విఫలమవుతున్నారు. దేశంలో పెరుగుతున్న పేదరికం నిరుద్యోగానికి అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దేశంలో విస్తారమైన ఖనిజ నిల్వలు ఉన్నప్పటికీ అఫ్ఘాన్‌ను మాత్రం దుర్బిక్షం వెంటాడుతోంది. ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. అయినప్పటికే తాలిబన్లు మతవిశ్వాలకే ప్రాధన్యమిస్తున్నారు. పాలనను గాలికొదిలేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories