Sri Lanka Crisis: ఆహారం కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న మహిళలు..

Sri Lanka Crisis Women Shift to Prostitution for Food, Medicines
x

Sri Lanka Crisis: ఆహారం కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న మహిళలు..

Highlights

Sri Lanka Crisis: శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు ఎన్నికైనా ఆ దేశంలో ప్రజల బతుకులు మాత్రం మరింత దారుణంగా మారుతున్నాయి.

Sri Lanka Crisis: శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు ఎన్నికైనా ఆ దేశంలో ప్రజల బతుకులు మాత్రం మరింత దారుణంగా మారుతున్నాయి. దేశంలో నెలకొన్న సంక్షోభంతో తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు. గత్యంతరంలేక దుర్భుర పరిస్థితుల్లో మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. అవకాశం ఉన్నవారు దేశం విడిచి వెళ్లిపోయేందుకు విమానాశ్రయాల వద్ద క్యూకడుతున్నారు. అది కూడా ఇదివరకే పాస్‌పోర్టు ఉన్నవారికి మాత్రమే విదేశాలకు అనుమతినిస్తున్నారు. పేపరు కొరతతో కొత్త పాస్‌పోర్టులు ఇవ్వడంలేదు. దీంతో పలువురు సమీపంలోనే ఉన్న భారత్‌ తీర ప్రాంతంలోని తమిళనాడుకు వలస వస్తున్నారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. 2 కోట్ల 20 లక్షల జనాభా ఉన్న లంకలో 25 శాతం మంది అంటే 55 లక్షల మంది ప్రజలు ఆహారం అందక ఆకలితో అల్లాడుతున్నాడు. ప్రతి 10 కుటుంబాల్లో 8 కుటుంబాలు కేవలం రోజుకు ఒకసారే తింటున్నారు. దేశంలో నెలకొన్న సంక్షోభంతో లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధిని కోల్పోయారు. తినడానికి తిండి లేక కొనడానికి చేతిలో చిల్లిగవ్వలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవేళ డబ్బు ఉన్నా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబాన్ని నడుపుతున్న మహిళలు మనస్సును చంపుకుని పిల్లల కడుపు నింపేందుకు సెక్స్ వర్క్‌ర్లుగా మారుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సెక్స్‌ వర్కర్ల సంఖ్య 30 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజధాని కొలంలోని ఇండస్ట్రియల్‌ జోన్‌కు సమీపంలో సెక్స్‌ వర్కర్లు భారీగా పెరిగారు.

శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి ప్రస్తుతం తెరపడింది. దేశ అధ్యక్షుడిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న రణిల్‌ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. ఆయనకు పార్లమెంట్‌లో మద్దతు లేకపోయినా దేశంలో నెలకొన్న సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి అనుభవమున్న నేత రణిల్‌ను శ్రీలంకలోని పార్టీలు ఎన్నుకున్నాయి. అయితే ఎవరు అధ్యక్షుడు అయినా శ్రీలంకలో పరిస్థితులు ఇప్పటికిప్పుడు మారవన్న కథనాలు అక్కడి మీడియాలో జోరుగా వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశం గట్టెక్కాలంటే కనీసం 50 ఏళ్లు పడుతుందన్న నిపుణుల విశ్లేసిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్బర పరిస్థితుల్లో బతకడం కంటే దేశం విడిచి వెళ్లిపోవాలని లంక ప్రజలు భావిస్తున్నారు. అంతో ఇంతో డబ్బున్నవారు ఆస్ట్రేలియా, మాల్దీవ్స్‌, భారత్‌తో పాటు గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పలువురు పాస్‌పోర్టు కోసం పాస్‌పోర్టు కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు.

ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. నిత్యం 3వేల మంది పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు కూడా 24 గంటలు పని చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 2021లో ఇచ్చిన పాస్‌పోర్టుల కంటే అధికంగా జారీ చేసినట్టు ఇమ్మిగ్రేషన్‌ శాఖ తెలిపింది. సాధారణంగా నెలకు 50వేల పాస్‌‌పోర్టులు గతంలో జారీ చేసేవారమని జూన్‌లో ఆ సంఖ్య లక్షా 20వేలకు చేరుకుందని వివరించింది. అత్యధిక గల్ఫ్‌ దేశాలకు వెళలేందుకే పాస్‌పోర్టులు కోరుతున్నట్టు ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం తెలిపింది. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు తక్కువగా వెళ్తున్నట్టు వివరించింది. మరోవైపు లంక నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పేపరు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో కొత్త పాస్‌పోర్టులు ముద్రించలేని పరిస్థితి. దీంతో కొత్త పాస్‌పోర్టులు మంజూరు చేయడం ఆలస్యమవుతోంది.

శ్రీలంకలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పరిస్థితులు విషమించాయి. విదేశీ మారక నిధులు లేక దిగుమతులు నిలిచిపోయాయి. పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడిన లంక ప్రజలు దుర్బర పరిస్థితుల్లోకి నెట్టేయబడ్డారు. 5వేల 100 కోట్ల డాలర్ల రుణాలను శ్రీలంక చెల్లించాల్సి ఉంది. 2020లో కరోనా మహమ్మారితో పర్యాటక, రవాణా శాఖలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తరువాత ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధంతో చమురు, గ్యాస్‌ దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో తీవ్ర దుర్బిక్షం నెలకొన్నది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. లంకలో ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సొదరులే కారణమంటూ ఆందోళనలకు దిగారు. రాజపక్స సోదరులు పదవులను వదిలేయాలని నినదించారు. ప్రజాగ్రహంతో ఏప్రిల్‌లో చమల్‌, బాసిల్ రాజపక్సలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మే 9 మహింద రాజపక్స, జూలై 13న గొటబాయ రాజపక్సే రాజీనామా చేశారు. గొటబయ దేశం విడిచి వెళ్లిపోయారు. మిగిలిన రాజపక్స సోదరులు ఏమయ్యారనేది తెలియడం లేదు.

మరోవైపు కొత్త అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎన్నుకోవడంపై శ్రీలంక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం దివాళా తీయడానికి రాజపక్స కుటుంబంతో పాటు విక్రమసింఘే పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. విక్రమసింఘే ఎన్నికైన వెంటనే పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రాజపక్స కుటుంబంతో కుమ్మక్కయ్యారని, గొటబయతో పాటు రణిల్‌ కూడా పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories