యుద్ధంలో రష్యాకు భారీ సైనిక నష్టం.. 45,500 మంది రష్యన్‌ సైనికులు మృతి

Russian Troops Losses Surpass 45,000
x

యుద్ధంలో రష్యాకు భారీ సైనిక నష్టం.. 45,500 మంది రష్యన్‌ సైనికులు మృతి

Highlights

Russia: యుద్ధం అంటేనే వ్యూహం.. ఓ లక్ష్యం కోసం చేసే పోరాటం.. ఆ వ్యూహం బెడిసి కొడితే.. గెలుపోటముల మాట ఎలా ఉన్నా.. ఘోరమైన నష్టాలను చవి చూడాల్సిందే.

Russia: యుద్ధం అంటేనే వ్యూహం.. ఓ లక్ష్యం కోసం చేసే పోరాటం.. ఆ వ్యూహం బెడిసి కొడితే.. గెలుపోటముల మాట ఎలా ఉన్నా.. ఘోరమైన నష్టాలను చవి చూడాల్సిందే. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం విషయంలో అదే జరుగుతోంది. ఎలాంటి వ్యూహం, లక్ష్యం లేకుండా యుద్ధాన్నికి దిగిన రష్యా భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. వేల మంది సైన్యాన్ని, ఆయుధాలను కోల్పోయింది. ఆరు నెలల యుద్ధంలో 45వేల 550 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ తెలిపింది. ఇది నిజమేనా? అంటే తాజా పరిణామాలు అవుననే నిర్ధారిస్తున్నాయి. ఇంతకీ యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతోంది? ఎవరు పైచేయి సాధించనున్నారు? యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది?

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం ఏడో నెలలోకి ఎంటర్‌ అయ్యింది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు రష్యాకు చెందిన 45వేల 500 మందిని మట్టుబెట్టినట్టు తాజాగా ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఆగస్టు 27న ఒక్కరోజే 250 మంది సైనికులను హతమార్చినట్టు సోషల్‌ మీడియాలో వివరాలను ఉక్రెయిన్ ఆర్మీ స్టాఫ్‌ వెల్లడించింది. అంతేకాదు ఇప్పటివరకు రష్యాకు చెందిన 2వేల యుద్ధ ట్యాంకులు వెయ్యి 45 ఆయుధ వ్యవస్థలు, 836 డ్రోన్లు, 3వేల 165 యుద్ధ వాహనాలను ధ్వంసం చేసినట్టు కీవ్‌ ఆర్మీ స్టాఫ్‌ తెలిపింది. ఈ వివరాలన్నీ నిజమేనా? అంటే దానికి ఎలాంటి ప్రూఫ్‌లను ఉక్రెయిన్ ఇవ్వడం లేదు. కానీ 80వేల మంది రష్యన్‌ సైనికులు మృతి చెంది ఉండొచ్చని ఇటీవల బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్ వాలేస్‌ వెల్లడించారు. వాలెస్‌ లెక్కతో పోలిస్తే ఉక్రెయిన్ చెప్పిన వివరాలు కొంచెం నమ్మేలా ఉన్నాయి. అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదికలో మాత్రం యుద్ధంలో 25వేల మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని నిపుణుల అంచనాలతో కథనాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ చెబుతున్న లెక్కలపై రష్యా ఏమంటోంది? రష్యా తాజాగా ఎలాంటి ప్రకటన చేసింది? 45వేల 500 మంది చనిపోయింది నిజమేనా?

యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడచినా ఇప్పటివరకు సైనికుల ప్రాణ నష్టంపై రష్యా అసలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. రెండ్రోజుల క్రితం సైనిక నియామకాల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఏకంగా లక్ష37 వేల మంది సైనికులను నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాస్కో సైనికులు భారీగా చనిపోయారన్న మాటకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బలాన్ని ఇస్తోంది. యుద్ధంలో 45వేల 500 మంది చనిపోవడంతో పాటు వేలాది మంది సైనికులు గాయపడినట్టు స్పష్టమవుతోంది. ఈ కారణంగానే భారీ నియామకాలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ నియామకాలకు రష్యా చెబుతున్న కారణం వేరేలా ఉంది. ఉక్రెయిన్‌పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నియామకాల్లో భాగంగా సాధారణ పౌరులతో పాటు కరుడుగట్టిన నేరస్థులను కూడా తీసుకోవాలని పుతిన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం తుపాకీతో గురి చూసి కాల్చడం నేర్పించి యుద్ధ రంగంలోకి దింపనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పుతిన్‌కు మద్ధతుగా ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కూడా సైన్యాన్ని పంపనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే జరిగితే యుద్ధం మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. క్రెమ్లిన్‌ బలగాల దాడితో భారీగా నష్టపోయిన ఉక్రెయిన్‌ రావణ కాష్టంలా మారనున్నట్టు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా సంగతి అలా ఉంచితే ఉక్రెయిన్‌ సైన్యంలో ఎంత మంది చనిపోయారు? ఉక్రెయిన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లింది?

తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్‌, డోనెట్‌స్క్‌ ప్రాంతాలకు విముక్తి కల్పించేందుకే సైనిక చర్య చేపట్టామని మొదట్లో రష్యా ప్రకటించింది. కానీ ఈ యుద్ధం దిశ, దశ లేకుండా సాగుతోంది. కనిపించిన ప్రతి ప్రాంతంపై మాస్కో సేనలు ఉధృతమైన దాడులకు దిగాయి. దీంతో ఉక్రెయిన్‌లోని బుచా, మరియూపోల్‌, లుహాన్‌స్క్‌, డోనెట్‌స్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాల్లో పలు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 5వేల 587 మంది పౌరులు చనిపోయినట్టు ఐక్యరాజ్య సమితి- యూఎన్ కచ్చితంగా చెబుతోంది. వాస్తవానికి ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చని కూడా యూఎన్‌ వివరిస్తోంది. ఇక 9వేల మంది తమ సైనికులు చనిపోయినట్టు ఉక్రెయిన్‌ వెల్లడించింది. నిజానికి ఉక్రెయిన్‌ దళాలు గెరిల్లా పోరాటానికి దిగాయి. దూసుకొస్తున్న రష్యా బలగాలను ఎక్కడికక్కడ నిలువరించాయి. ఈ క్రమంలో రష్యా సైనికులు భారీగా మృతి చెందారు.

నాటోలో చేరమని ఉక్రెయిన్‌‌ తెలిపినా యుద్ధాన్ని ఆపేది లేదని రష్యా చేసిన వ్యాఖ్యలకు కీవ్‌ కౌంటర్‌ ఇచ్చింది. నాటో ఆలోచన విరమించుకున్నా రష్యాను వెనక్కి తరిమికొట్టేవరకు యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది. ఆక్రమిత ఖేర్సన్‌, మరియూపోల్‌, లుహాన్‌స్క్‌ ప్రాంతాలతో పాటు క్రిమియాను స్వాధీనం చేసుకుని తీరుతామని ఉక్రెయిన్ బల్లాగుద్ది చెబుతోంది. అమెరికాతో సహా పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధ సాయంతో చెలరేగిపోతోంది. రష్యా ఆధీనంలో ఉన్న ఖేర్సన్‌పై ఎదురుదాడికి దిగుతోంది. మరోవైపు ఒడిసాను సొంతం చేసుకునేందుకు రష్యా అడుగులు వేస్తోంది. మరోవైపు డోనెట్‌స్క్, లుహాన్స్‌ ప్రాంతాల్లోని ప్రజలు రష్యాకు వస్తే వారికి నెలకు 170 డాలర్ల చొప్పున సాయం అందిస్తామని పుతిన్‌ తాజాగా ప్రకటించారు. ఫిబ్రవరి 18 తరువాత వచ్చిన ఖైదీలు, గర్భం దాల్చిన మహిళలు, వైకల్యమున్నవారికి ఈ సాయం వర్తిస్తుందని తెలిపారు.

తాజా పరిణామాల నేపథ్యంలో యుద్ధం మరో ఆరు నెలల పాటు సాగే అవకాశం ఉందని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు మూడు ప్రాంతాలను సొంతం చేసుకున్న రష్యా ఉక్రెయిన్‌ను పూర్తిగా సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. అయితే ఇటీవల భారీ ఆయుధాలతో ఉక్రెయిన్‌ బలగాలు దాడికి దిగుతున్నాయి. దీంతో రష్యా అనుకున్నది సాధిస్తుందా? అన్నది అనుమానమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories