రగులుతున్న రష్యా..మాస్కో తీర్పుకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన వేలాది మంది

రగులుతున్న రష్యా..మాస్కో తీర్పుకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన వేలాది మంది
x

రష్యా నిరసనలు 

Highlights

*ఆగ్రహజ్వాలలతో అట్టుడుకుతున్న రష్యా *నావల్నీ అరెస్టుతో రగులుతున్న పుతిన్ సామ్రాజ్యం *మాస్కో తీర్పుకువ్యతిరేకంగా రోడ్డెక్కిన వేలాది మంది

ఆందోళనలు, నిరసనలతో రష్యా అట్టుడికిపోతోంది. రష్యాప్రతిపక్ష నేత అలెక్సి నావెల్నీ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో రష్యాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఒక్కడి కోసం రోడ్డెక్కిన వేలాది మంది.. నావల్నీ అరెస్టుతో రగులుతున్న పుతిన్ సామ్రాజ్యం.. ఆగ్రహజ్వాలలతో అట్టుడుకుతున్న రష్యా.. ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2014లో నావెల్నీకి మూడున్నరేళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం పెరోల్‌పై విడుదలైన ఆయన విదేశాలకు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆయనపై విషప్రయోగం జరిగింది. తిరిగి వచ్చిన నావల్నీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పెరోల్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై గతంలో నిలిచిపోయిన జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును బ్రిటన్‌, ప్రాన్స్‌, జర్మనీ, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు తీవ్రంగా ఖండించాయి. నావెల్నీని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్ధులు ఆందోళనలు చేపడుతున్నారు.

మరోవైపు.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను లోదుస్తుల్లో విషం పెట్టే వ్యక్తిగా అభివర్ణించారు. తనపై విషప్రయోగం పుతిన్ కుట్రేనని ఆరోపించారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీలు చేస్తామని నావల్నీ తరపు న్యాయవాది తెలిపారు. నావల్నీకి మద్దతుగా రాజధాని మాస్కో సహా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు భద్రతా బలగాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఎముకలు కొరికే చలిలోనూ నావల్నీకు మద్దతుగా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. దీంతో ఆందోళనలను అదుపు చేసేందుకు రంగంలోకి దిిన పోలీసులు.. 5 వేలకు పైగా ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క రష్యారాజధాని మాస్కోలోనే 16 వందల మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అటు.. అరెస్టయిన వారిలో నావల్నీ భార్య యులియా కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలను చూడలేదని రష్యా అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయంటే ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక.. మాస్కో కోర్టు తీర్పుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నావ‌ల్నీకి శిక్ష విధించిన నేప‌థ్యంలో మ‌రోసారి ర‌ష్యా ప్రభుత్వ తీరుపై ప్రపంచం దేశాల నేత‌లు విమ‌ర్శలు గుప్పించారు. కోర్టు తీర్పుతో విశ్వసనీయత అన్నది పరాజయం పాలైందని మానవ హక్కుల సంస్థ కౌన్సిల్ ఆఫ్ యూరప్ వ్యాఖ్యానించింది. ఈ తీర్పు దారుణ‌మ‌ని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ అన్నారు. జ‌ర్మనీ, అమెరికా వంటి దేశాలూ కోర్టు తీర్పుని ఖండించాయి. అటు.. నిరసన కారులు కూడా కోర్టు తీర్పుపై ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories