logo
ప్రపంచం

ఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్‌ తర్వాతి టార్గెట్‌ ఆ దేశమేనా?

Russia Next Target Poland
X

ఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్‌ తర్వాతి టార్గెట్‌ ఆ దేశమేనా?

Highlights

Russia Next Target Poland: ఉక్రెయిన్‌ కథ ముగిసిపోయినట్టే అని రష్యా భావిస్తోందా?

Russia Next Target Poland: ఉక్రెయిన్‌ కథ ముగిసిపోయినట్టే అని రష్యా భావిస్తోందా? ఉక్రెయిన్‌ తరువాత పుతిన్‌ నెక్ట్స్ టార్గెట్‌ పోలాండ్‌ దేశమా? అంటే అవునని సమాధానమిస్తున్నారు చెచెన్‌ అధినేత రంజాన్‌ కదిరోవ్‌.. తమకు అవకాశం ఇస్తే పోలాండ్‌ను ఆరు సెకండ్లలో ఏం చేయగలమో చూపుతామన్నారు. పోలాండ్‌లో తమ రాయబారికి జరిగిన అవమానం మరచిపోలేదన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, కిరాయి సైనికులను సరఫరా చేయడం పోలాండ్‌ ఆపకపోతే ఉక్రెయిన్‌కు పట్టిన గతే పడుతుందన్నట్టుగా రంజాన్‌ కదిరోవ్‌ హెచ్చరించారు. ఇవి కేవలం మెచ్చరికలేనా? లేక నిజంగా రష్యా అన్నంత పని చేస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పోలాండ్‌పై రష్యా దాడికి దిగితే మాత్రం నాటో రంగంలోకి దిగుతుందని ఇక మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ ఆపలేరని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్‌లో అనుకున్నది రష్యా సాధించిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు చెచెన్‌ నేత రంజాన్‌ కదిరోవ్‌. ఉక్రెయిన్ కథ ముగిసిపోయిందని రష్యా భావిస్తోందని కదిరోవ్‌ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. నిజానికి రష్యా దాడిలో ఉక్రెయిన్‌ పల్లెలు, పట్టణాలు, నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటి పునర్ నిర్మాణం అంత సులభమేమీ కాదు. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌, మరియూపోల్‌, ఖేర్సన్‌ ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించింది. 2014లో సొంతం చేసుకున్న క్రిమియాకు మార్గం సుగమం చేసుకుంది. ఆయా ప్రాంతాల్లోని పౌరులకు పౌరసత్వం ఇచ్చేదిశగా రష్యా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో చెచెన్‌ అధినేత రంజాన్‌ కదిరోవ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐరోపా దేశాలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఉక్రెయిన్ తరువాత తదుపరి లక్ష్యం పోలాండేనని కదిరోవ్‌ తెలిపారు. ఒకవేళ తమకు ఆదేశాలు ఇచ్చినట్టయితే ఆరు సెకన్లలో మేం ఏమేమి చేయగలమో చేసి చూపుతామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలను, కిరాయి సైనికులను పోలాండ్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విక్టరీ డే సందర్భంగా తమ రాయబారి పట్ల ప్రవర్తించిన తీరును మర్చిపోం అధికారికంగా క్షమాపణలు కోరాలన్నారు.

ఉక్రెయిన్ ఇన్నాళ్లు రాజకీయ అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి పాలకులు రష్యాకు వ్యతిరేకం అనుకూల ధోరణులతోనే ఇన్నాళ్లు గడచిపోయింది. దేశం, భద్రతపై పూర్తిగా దృష్టిపెట్టలేకపోయారు. ఫలితంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఈజీ అయింది. నిజానికి రెండ్రోజుల్లో ఉక్రెయిన్‌ తమకు సొంతమవుతుందని రష్యా అధినేత పుతిన్‌ కూడా భావించారు. కానీ పాశ్చాత్య దేశాల ఆయుధ, ఆర్థిక సహకారం చేయడంతో ఉక్రెయిన్‌ బలగాలు రష్యా సైన్యాన్ని తీవ్రగా ప్రతిఘటించాయి. అయినా పలు ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. కానీ పోలాండ్‌ అలా కాదు పోలాండ్‌పై దాడి చేయడమంటే పుతిన్‌ కొరివితో కాలు దువ్వుకోవడమే. ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో పోలాండ్‌ సభ్య దేశం ఏ దేశమైనా తమ సభ్య దేశంపై దాడి చేస్తే పూర్తిగా కూటమిపై దాడి చేసినట్టుగా నాటో భావిస్తుంది. అలాంటపుడు పోలాండ్‌పై పుతిన్‌ అంత సులభవంగా దాడి చేయగలరా? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదే పదే హెచ్చరించారు. నాటో కూటమి దేశాల్లోని ప్రతి ఇంచును కాపాడుకుంటామని చెప్పారు. నాటో కూటమి దేశంపై దాడి చేయడం అంటే అమెరికాపై దాడి చేయడమేనని హెచ్చరించారు. అంతేకాకుండా పోలాండ్‌ సరిహద్దుల్లో ఇటీవల నాటో దళాలను భారీగా మోహరించారు. ఈ తరుణంలో పోలాండ్‌పై పుతిన్ దాడి చేస్తే ప్రపంచ యద్ధానికి దారి తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు ఉక్రెయిన్‌పై దాడి చేయడాన్ని అమెరికా, ఐరోపా దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పుతిన్‌పై పీకల దాక కోపం ఉంది. మాస్కో అధినేతను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. రష్యాపై కఠిన ఆంక్షలను విధించాయి. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తూ రష్యా బలగాల ఓటమికి ప్రయత్నిస్తున్నాయి. ఇవే చర్చలే పుతిన్‌ను రెచ్చగొడుతున్నాయి. యుద్ధంపై మొండిగా వ్యవహరిస్తూ క్రెమ్లిన్‌ చీఫ్‌ మరింత దూకుడుగా యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. నాలుగు నెలలుగా యుద్దాన్ని కొనసాగిస్తోంది. తూర్పు ఉక్రెయన్‌లోని పోక్రోవ్‌స్క్‌నగరంలోని రైల్వే స్టేషన్‌పై యుద్ధ విమానాలతో రష్యా దాడి చేసింది. మైకోలైవ్‌పైనా భీకర దాడులకు పాల్పడింది. ఈ నగరంలోని ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ను మట్టుబెట్టింది. ఈ ఘటనలో 11 మంది ఉక్రెయిన్‌ సైనికులు, 15 మంది విదేశీ నిపుణులు మృతి చెందినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అయితే బ్రిటన్‌ మాత్రం ఇందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌ ప్రతిఘటన శక్తికి రష్యా తాళలేకపోయిందని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా పుతిన్‌ సేనలు మరోసారి దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఉధృతం చేయడాన్ని స్లొవేకియా ప్రధాని ఎడ్వర్డ్‌ హెగెర్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలో ఉక్రెయిన్‌ ఓటమి పాలయితే పోలాండ్‌, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియాలపై రష్యా దాడులు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. అందుకే తాము ఉక్రెయిన్‌కు మద్ధతు ఇస్తున్నామని చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు తాము సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే దౌత్య పరమైన చర్చలతోనే ఇధి సాధ్యమన్నారు. యుద్ధాన్ని ఆపేయడం రష్యా అధినేత పుతిన్‌ చేతుల్లోనే ఉందన్నారు. పుతిన్‌ నేరుగా చర్చలకు వస్తేనే యుద్ధం ఆగుతుందని స్పష్టం చేశారు.

Web TitleRussia Next Target Poland
Next Story