Sri Lanka: లంకను ముంచిన రాజపక్సల కల

Rajapaksas First Target was The LTTE | Telugu News
x

Sri Lanka: లంకను ముంచిన రాజపక్సల కల

Highlights

Sri Lanka: ఎల్‌టీటీఈని అణచివేసేందుకు మారణాయుధాలను... చైనా నుంచి భారీగా కొనుగోలు చేసిన రాజపక్సలు

Sri Lanka: శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి... రాజపక్స సోదరుల కలే కారణమని.. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ-సీఏఐ చీఫ్‌ బిల్‌ బర్న్‌ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు.. విచ్చలవిడిగా చైనా నుంచి రాజపక్సలు అప్పులు తీసుకున్నారు. తాహతుకు మించి చేసిన ఆ అప్పుల భారం లంక ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది. ద్వీప దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. రాజపక్సల ఆ కల నెరవేరలేదు సరికదా.. వారిని ప్రజలు వెంటబడి తరిమికొట్టేలా పరిస్థితులు మారాయి. తమను తాము దైవాంశ సంభూతులుగా భావించే రాజపక్సలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గొటబయ పరాయిదేశానికి పారిపోయి తలదాచుకోవాల్సి దుస్థితి తలెత్తింది.

2005 నుంచి శ్రీలంకను రాజపక్సల కుటుంబం పాలిస్తోంది. లంకలో ఎల్‌టీటీఈని అణిచివేసి.. దేశాన్ని సింగపూర్‌లా మార్చాలని.. దుబాయ్‌లా ఆర్థిక శక్తిగా ఎదగాలని కలలుగన్నారు రాజపక్సలు. లంక అభివృద్ధికి భారీ ప్రణాళికలు వేశారు. కానీ.. ఇల్లు కట్టుకుకోవాలని భావించేవారు.. తమ ఆదాయం ఎంత? ఎంత అప్పు తీసుకోవాలి? ఆ తరువాత ఆ అప్పును ఎలా తీర్చాలి? అనే మూడు విషయాలపై క్లారిటీ వచ్చిన తరువాతే.. నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. సామాన్యులు చేసే ఈ ఆలోచన.. పాలకులైన రాజపక్సలకు మాత్రం తట్టలేదు. సింగపూర్‌ కల సాగారానికి తమ వద్ద నిధులు లేవన్న విషయం మాత్రమే వారికి తెలుసు. తమ కల సాకారానికి చైనా నుంచి ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకున్నారు. చైనా నుంచి తీసుకున్న రుణాలను విచ్చలవిడిగా వెచ్చించారు. లంకను రోల్‌మోడల్‌గా మార్చాలని.. దక్షిణ, పశ్చిమ ప్రాంతాలతో పాటు రాజధాని కొలంబోను ఎంచుకున్నారు. రాజధాని కొలంబో లాగా.. దక్షిణ ప్రాంతంలోని హంబన్‌తోట జిల్లాను మార్చాలని భావించారు. అక్కడ చేపట్టే ప్రాజెక్టులు అనుకూలమా? కాదా? అనే అంశంపై అధ్యయనం చేయకుండానే.. ప్రారంభించారు. హంబన్‌తోట హార్బర్‌ను అద్భుత సౌకర్యాలతో నిర్మించేందుకు వేల కోట్ల డాలర్లను వెచ్చించారు.

ఇక ఎల్‌టీటీఈని అణిచివేసేందుకు మారణాయుధాలను కొనుగోలు చేయాలని రాజపక్సలు భావించారు. అయితే చైనా తప్ప.. ఏ దేశమూ శ్రీలంకకు మారణాయుధాలు విక్రయించడానికి ముందుకు రాలేదు. అక్కడి నుంచి చైనాతో రాజపక్సల స్నేహం ముదిరింది. మహింద రాజపక్స పాలనలో నాలుగేళ్లలోనే విదేశీ రుణాలు 72శాతానికి పెరిగింది. ఆయుధాల కొనుగోలుకు భారీగా విదేశీ రుణాలను తీసుకున్నారు. 2005లో 11వందల 30 కోట్ల డాలర్ల ఉన్న రుణం.. ఎల్‌టీటీఈని అణచివేసిన 2009 నాటికి ఆ రుణం.. 2వేల కోట్ల డాలర్లకు చేరింది. ఎల్‌టీటీఈని ఉక్కుపాదంతో అణచివేసిన తరువాత.. లంకను సింగపూర్‌గా మార్చే పనిలో పడ్డారు రాజపక్సలు. అంతర్యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఆర్థికాభివృద్ధికి యత్నించకుండా.. మళ్లీ చైనా రుణాలకే రాజపక్సలు మొగ్గుచూపారు. సింగపూర్‌ కలలో భాగంగా.. వాణిజ్యంపరంగా ఎలాంటి ఉపయోగంలేని హంబన్‌తోట జిల్లాలోని మట్టాల విమానాశ్రయం, హంబన్‌తోట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చైనా మాత్రం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కింద నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. లాభాలు వస్తాయా? రావా అన్నది డ్రాగన్‌ కంట్రీ పట్టించుకోదు.

హంబన్‌తోట జిల్లాలో చేపట్టిన ఆ రెండు ప్రాజెక్టులకు 140 కోట్ల డాలర్లను చైనా వెచ్చించింది. అయితే అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజపక్స ప్రభుత్వం.. వాటిని చెల్లించలేకపోయింది. ఎలాంటి ఉపయోగం లేని హంబన్‌తోట ఓడరేవును.. 99 ఏళ్లపాటు చైనాకు లీజుకు ఇచ్చింది. ఈ పోర్టును ఇప్పుడు చైనా మిలటరీ బేస్‌గా వాడుకుంటోంది. 21 కోట్ల డాలర్లతో మట్టాల విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ రుణాలను చెల్లించలేక.. ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న 15వేల ఎకరాలను చైనాకు రాజపక్సలు ధారాదత్తం చేశారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులను తరలించే సామర్థ్యమున్న మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రపంచంలోనే నిర్మాణుష్య ఎయిర్‌పోర్టుగా పేరుగాంచింది. ఈ ఎయిర్‌పోర్టులో వినియోగించే విద్యుత్‌ బిల్లు చెల్లింపునకు సరిపడా సంపాదన కూడా రాదంటే ఆశ్చర్యం కలగక మానదు. దశాబ్దాల క్రితం బ్రిటిషర్లు పాటించిన వలస పాలన విధానాన్ని డ్రాగన్‌ కంట్రీ దత్తత తీసుకుంది. శ్రీలంక నుంచే ఆ విధానానికి తెరలేపింది.

హంబన్‌తోట, మట్టాల ఎయిర్‌పోర్టు విఫలమైన తరువాత కూడా రాజపక్సలు వెనక్కి తగ్గలేదు. మళ్లీ చైనాతో కలిసి.. 269 హెక్టార్ల విస్తీర్ణంలో కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కొలంబో పోర్ట్‌ సిటీ ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికి చేసిన అప్పును చెల్లించలేక రాజపక్సల ప్రభుత్వం చతికిల పడింది. గత్యంతరం లేక.. ఈ ప్రాంతంలో చైనాకు సంపూర్ణ హక్కులను ఇచ్చేసింది. ఇక్కడ చైనా కరెన్సీ అమలుకు శ్రీకారం చుట్టింది. అంటే.. మరొ రకంగా చెప్పాలంటే.. అక్కడ చైనా పాలన ప్రారంభమైనట్టే. శ్రీలంక మొత్తం అప్పుల్లో సగం చైనా నుంచి తీసుకున్నవే. 1971 నుంచి 2004 వరకు అతి తక్కువగా ఉన్న అప్పులు.. 2005లో మహింద రాజపక్స అధ్యక్షుడు అయ్యాక.. అమాంతంగా పెరిగాయి. 16 ఏళ్ల రాజపక్సల పాలనా కాలంలో ఏకంగా 4వేల కోట్ల డాలర్ల రుణాలను శ్రీలంక తీసుకుంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అవసరమే. తమ కల సాకారం కోసం ఎలాంటి ప్రయోజనం లేని చోట.. పోర్టులు, ఎయిర్‌పోర్టులను రాజపక్స ప్రభుత్వం నిర్మించింది. ఇవే శ్రీలంకను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది.

శ్రీలంకను మరో సింగపూర్‌లా మార్చాలనుకున్న రాజపక్సల కల నెరవేరలేదు. పైగా ఆ కలే శ్రీలంకను అస్తవ్యస్తం చేసింది. దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా విషమించాయి. ఈ ఏడాది నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. రాజపక్సల కుటుంబంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అధ్యక్షుడు, ప్రధాని పారిపోయేలా తరిమికొట్టారు. జూలై 9తో రాజపక్సల కుటుంబం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజపక్సల సింగపూర్‌ కల నెరవేరలేదు కానీ.. గొటబయ మాత్రం ఇప్పుడు సింగపూర్‌లోనే తలదాచుకోవడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories