Pakistan: అధ్వానంగా పాక్‌లో పరిస్థితులు.. శ్రీలంకను మించిన పాక్‌ కష్టాలు

PM Shehbaz Sharif says ‘even friendly countries started looking at Pakistan as beggars’
x

Pakistan: అధ్వానంగా పాక్‌లో పరిస్థితులు.. శ్రీలంకను మించిన పాక్‌ కష్టాలు 

Highlights

*మిత్ర దేశాలు కూడా పాకిస్థాన్‌‌ను బిక్షగాడి కంటే హీనంగా చూస్తున్నట్టు షెహబాజ్‌ ఆవేద

Pakistan: దాయాది దేశం పరిస్థితి శ్రీలంక కన్నా అధ్వానంగా మారింది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌ను భారీ వరదలు పీకల్లోతు కష్టాల్లో పడేశాయి. ఏ దేశమైనా ఆదుకుంటుందేమోనని ఆపన్న హస్తం కోసం ఇస్లామాబాద్‌ ఎదురుచూస్తోంది. పాక్‌ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చినా స్పందన మాత్రం కరువయ్యింది. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రధానమంత్రి సెహబాజ్‌ షరీఫ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మిత్ర దేశాలు కూడా పాకిస్థాన్‌ను బిచ్చగాడి కన్నా హీనంగా చూస్తున్నట్టు వాపోయారు. ఈ పరిస్థితికి పాకిస్థాన్‌కు ఎందుకు దాపురించింది? తాజా పరిణామాలకు అక్కడి పాలకులు, ఆర్మీ పాపం ఎంత?

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంకను మించిపోతోంది పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక కష్టాలతో విలవిలలాడుతోంది. మిత్ర దేశాల నుంచి రుణాల కోసం ప్రయత్నించినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నిత్యావసరాలు, చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అసలే తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు వరదలు ఆర్థిక సంక్షోభానికి ఆజ్యం పోసినట్టయ్యింది. ఇప్పుడు ప్రపంచ దేశాల అపన్న హస్తం కోసం పాకిస్థాన్‌ ఎదురుచూస్తోంది. పాక్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు 15 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. కానీ ఏ దేశమూ సాయానికి మాత్రం ముందుకు రావడం లేదు అందుకు పాక్‌ పాలకుల తీరే కారణం.. ఆ దేశంలో ప్రజల పరిస్థితిని చూసి ఏ దేశమైనా ముందకొచ్చి సాయం చేసినా ఆ నిధులు ఎక్కడ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తాయేమో అన్న ఆందోళన పలు దేశాలను వెంటాడుతోంది. భారత్‌ వంటి దేశాలు కేవలం కూరగాయలు, ఆహారం, పండ్లు వంటివాటిని మాత్రమే సాయం కింద అందిస్తున్నారు. పాక్ బుద్ది తెలిసిన ప్రపంచ దేశాలు.. వరదతో ఆ దేశం అతలాకుతలమైనా సాయానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు.

వరదల నేపథ్యంలో ఇప్పటివరకు భారత్‌, అమెరికా, కెనడా, బ్రిటన్‌, డెన్మార్క్‌ దేశాలు మాత్రం సాయానికి ముందుకొచ్చాయి. మిత్ర దేశాల నుంచి సాయం మాట అటుంచితే.. కనీసం వదలపై విచారం కూడా వ్యక్తం చేయలేదు. తాజా పాకిస్థాన్‌ దుర్భర పరిస్థితిపై ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ విచారం వ్యక్తం చేశారు. చివరికి యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్‌, చైనా వంటి మిత్ర దేశాలు కూడా పాకిస్థాన్‌ను బిక్షగాడి కంటే హీనంగా చూస్తున్నట్టు షెహబాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన లాయర్ల సదస్సులో షెహబాజ్‌ మాట్లాడారు. ఈ రోజు ఏ మిత్ర దేశానికి వెళ్లినా.. లేదంటే ఫోన్‌ చేసినా.. డబ్బు యాచించేందుకే వచ్చినట్టు అనుకుంటున్నారని వాపోయారు. ఇప్పుడు చిన్న దేశఆలు కూడా ఆర్థికంగా మన కంటే ముందుకు దూసుకెళ్తున్నాయని తెలిపారు. అసలే ఆర్థికంగా అనేక సవాళ్లను పాక్‌ ఎదుర్కొంటున్న పీఎం షెహబాజ్‌ స్పష్టం చేశారు. వరదల పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో తమ పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోయిందని ప్రధాని షెహబాజ్‌ వెల్లడించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను ఇటీవల వరదలు ముంచెత్తాయి. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ వరదలు పాకిస్థాన్‌ను అతలాకుతలం చేశాయి. వరదల్లో మొత్తం 14 వందల 86 మంది చనిపోయారు. వారిలో 530 మంది చిన్నారులే ఉన్నట్టు పాకిస్థాన్‌ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. వరదల కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదలతో 3 కోట్ల 30 లక్షల మంది అవస్థలు పడ్డారు. ఇళ్లు, వాహనాలు, పశువులు, పంటలు కొట్టుకుపోయాయి. మొత్తం 3వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్టు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వరద బాధితులను ఆదుకోవడం దేవుడెరుగు.. కనీసం వారికి ఆహారాన్ని కూడా అందించలేని పరిస్థితి పాకిస్థాన్‌ది. ఈ పరిస్థితికి అక్కడి పాలకులు, ఆర్మీనే కారణం.. నిత్యం మతమౌఢ్యంతో.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకే నిధులన్నీ ఖర్చు చేశారు. పాకిస్థాన్‌ అభివృద్ధి కన్నా.. పొరుగునున్న భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పడానికే పాలకులు ప్రాధాన్యమిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనకు విదేశాల నుంచి వచ్చిన సాయాన్ని కూడా ఉగ్రవాదులకే కేటాయించడం పాక్‌కే చెల్లింది.

అధికారం చేజిక్కించుకోవడం, భారత్‌పై విషం కక్కే తీరును అక్కడి పాలకులు, ఆర్మీ వంటబట్టించుకున్నారు. ఈ కారణంగానే దేశంలో అభివృద్ధి మందగించింది. అవినీతి భారీగా పెరిగింది. ప్రజాప్రతినిధులు అధికారం తప్ప.. ఏనాడూ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధానిగా ఎవరు ఎన్నికైనా.. వారి లక్ష్యం మాత్రం కశ్మీర్‌ అంశమే. ఇదే ఆర్మీ విధానం కూడా.. దీనికి వ్యతిరేకంగా పని చేసే నేతలను అధికారంలో నుంచి ఆర్మీ దించేస్తోంది. అవసరమైతే పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి పాలకులు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఉగ్రవాదులకు కేటాయించే నిధులను ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి, విపత్తుల నిర్వహణకు కేటాయించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్‌ పాలకుల స్వయం కృతాపరాధంతో ఆ దేశం అధ్వాన స్థితికి చేరిందంటున్నారు. సంక్షోభం విషయంలో శ్రీలంకను పాకిస్థాన్‌ మించిపోతోందని వివరిస్తున్నారు. శ్రీలంకను కేవలం దిగుమతుల కొరతే వేధిస్తోందని.. పాక్‌కు మాత్రం అదనంగా వరదలు కూడా తోడయ్యాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

పాక్‌ అప్పులు తీవ్రమయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధం తరువాత లంకలో పూర్తిగా సంక్షోభం తలెత్తింది. లంకలో ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడి పాలకులను దించేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాయింది. కానీ.. పాకిస్థాన్‌లో కేవలం ప్రజలు మాత్రం తిరగబడలేదు. కానీ లంక కంటే ఘోరమైన పరిస్థితులు పాక్‌లో నెలకొన్నాయి. పాకిస్థాన్‌ 2022 జూన్‌ చివరి నాటికి పాకిస్థాన్‌ మొత్తం అప్పు.. 21వేల కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో చైనా నుంచి తీసుకున్న అప్పులే 7వేల 730 కోట్ల డాలర్లను ఉన్నాయి. అందులో ఈ ఏడాది 12 వందల 50 కోట్ల డాలర్లు ఏడాది చివరిలోగా చెల్లించాల్సి ఉంది. పాకిస్థాన్‌ను కష్టాల నుంచి ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ ముందుకొచ్చింది. తాజాగా 11వందల కోట్ల డాలర్లను ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఈ నిధులు ఏమాత్రం పాకిస్థాన్‌కు సరిపోవు. ఆకలితో నకనకలాడే వ్యక్తికి.. ముద్ద అన్నమే అందించినట్టుగా ఉంది. నిజానికి 520 కోట్ల డాలర్లను ఇవ్వాలంటూ ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్‌ కోరింది. కానీ ఐఎంఎఫ్‌ మాత్రం ప్రస్తుతానికి అత్యవసరంగా 11 వందల కోట్ల డాలర్లను మాత్రమే అప్రూవ్‌ చేసింది.

సంక్షోభంలో మునిగిన తరువాత.. పాకిస్థాన్‌లో పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. వరదల కారణంగా నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయి. పాకిస్థాన్‌ రూపాయల్లో కేజీ టమాటా 500, ఉల్లిగడ్డ 300 కేజీలకు చేరుకుంది. సామాన్యులు కొనలేని తిండి తినలేని పరిస్థితి ప్రస్తుతం పాక్‌లో నెలకొన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories