ఎలుకలను పట్టేవారు కావాలంటూ.. ఏడాదికి లక్షా 70 వేల డాలర్ల జీతం..

New York City Officials TO Spent Millions of Dollars to cull the Rat Population
x

ఎలుకలను పట్టేవారు కావాలంటూ.. ఏడాదికి లక్షా 70 వేల డాలర్ల జీతం..

Highlights

Rats Attack: అగ్రదేశంలో ఎంతో పేరుగాంచిన అతి పెద్ద నగరం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఫ్యాన్సీ నగరాల్లో అదొకటి.

Rats Attack: అగ్రదేశంలో ఎంతో పేరుగాంచిన అతి పెద్ద నగరం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఫ్యాన్సీ నగరాల్లో అదొకటి. ఆ నగరం భారీ సమస్యతో అతలాకుతలమవుతోంది. ఆ నగరాన్ని ఎలుకలు వణికిస్తున్నాయి. ఎలుకలను చూస్తేనే ప్రజలు భయపడిపోతున్నారు. అవి సృష్టిస్తున్న విధ్వంసంతో విసిగిసోయారు. అత్యంత ఖరీదైన నగరవాసులకు ఎలుకలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎలుకలను పట్టేవారు కావాలంటూ.. అక్కడి ప్రజలు ప్రకటనలు ఇస్తున్నారు. భారీ జీతాలను ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు. ఇంతకు ఆ నగరం ఎక్కడుంది? ఎలుకలు పట్టేవారికి జీతాలను ఎంత ఇస్తామంటున్నారు? అసలు అత్యంత ఖరీదైన నగరంలోకి ఎలుకలు ఎలా వచ్చాయి?

న్యూయార్క్‌.. అమెరికాలో అతి పెద్ద నగరాల్లో ఒకటి. నిత్యం జనాల రద్దీతో వీధులన్నీ కిటకిటలాడుతుంటాయి. వంటకాల సువాసనలు ఉర్రూతలూగించే సంగీతం.. న్యూయార్క్‌ను హోరెత్తిస్తుంటాయి. కానీ.. రాత్రైతే మాత్రం అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. న్యూయార్క్‌ నగరంలో ఎక్కడ చూసినా పరుగులు పెడుతున్న ఎలుకలే కనిపిస్తున్నాయి. కొందరువాటిని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. కానీ.. అత్యధికులు మాత్రం ఎలుకలను అసహ్యించుకుంటున్నారు. అత్యంత ఆకర్షణీయమైన నగరమని న్యూయార్క్‌ వచ్చిన వారు ఎలుకలను చూసి హడలిపోతున్నారు. ఆ నగరంలో జనాభాకంటే.. ఎలుకలే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. 1700 మధ్య కాలంలో న్యూయార్క్‌ నగరంలోకి ఎలుకలు ప్రవేశించినట్టు తెలుస్తోంది. అప్పట్లో బ్రిటీష్‌ నౌకల నుంచి అవి అమెరికాకు వచ్చాయట. కానీ.. నివేదికల ప్రకారం.. 20 లక్షల మేర ఎలుకలు న్యూయార్క్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వాటితో వివిధ రోగాలు సోకుతున్నట్టు పలువురు ఆందోళన చెందున్నారు. ఎలుకలు సృష్టిస్తున్న విధ్వంసాన్ని అక్కడి ప్రజలు భరించలేకపోతున్నారు. న్యూయార్‌ నగరంలో కొన్న దశాబ్దాలుగా ఎలుకలు ఉన్నట్టు అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఎలుకల నివారణకు ప్రభుత్వ సంస్థలు కూడా పని చేస్తున్నాయి. ఎలుకల నివారణకు ప్రత్యేకంగా ఏజెన్సీలు కూడా పని చేస్తున్నాయి. సదరు ఏజెన్సీలు ఎలుకల వేటకు శునకాలను వినియోగిస్తున్నాయి.

రోజుకు 28 గ్రాముల ఆహారం దొరికితే చాలు ఎలుకలు ఈజీగా బతికేస్తాయి. సంతానాన్ని వేగంగా ఉత్పత్తి చేస్తాయి. వాటి సగటు గర్భధారణ కాలం 21 నుంచి 23 రోజులే. అంటే నెలలోగా సుమారు 8 పిల్లలను పెడుతాయి. 5 వారాల తరువాత ఆ పిల్లలు కూడా భారీగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. న్యూయార్క్‌ రాష్ట్రంలో రెండు రకాల ఎలుకలు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. జన్యుపరంగా వాటిలో తేడాలు ఉన్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎలుకలు స్థానిక న్యూయార్క్‌ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో ఎలుకలపై ప్రత్యేక దృష్టి సారించింది. చెత్త కుండీల వద్ద ఇష్టారాజ్యంగా ప్రజలు చెత్తను పడేయడంతోనే ఎలుకలు అభివృద్ధి చెందుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మూషికాలను అరికట్టేందుకు 2017లో 3 కోట్ల 20 లక్షల డాలర్లను న్యూయార్క్ ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగా చెత్త కోసం బిగ్‌బెల్లీ పేరుతో నగరవ్యాప్తంగా 336 సోలార్ చెత్త కుండీలను ఏర్పాటు చేసింది. దీంతో వాటిలోకి ఎలుకలు చొరబడే అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా చెత్తను ఇష్టారాజ్యంగా పడేస్తే.. భారీ జరిమానాలను విధిస్తామని న్యూయార్క్‌ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఈ డస్ట్‌బిన్‌లు అంత ప్రభావం చూపించలేకపోయాయి. అయినా విషయం కలిపిన ఆహార పదార్థాలను బొరియలు, ఇళ్లలోకి చొరబడే అవకాశమున్న ప్రదేశాల్లో పెట్టారు. అయినా ఎలుకలు తెలివిగా వాటిని తినకుండా తప్పించుకున్నాయి. ఇళ్లలో వైరింగ్‌ను కొరికేస్తున్నాయి. తినుబండారాలను పొరపాటున బయటపెడితే.. అంతేగతి..

న్యూయార్క్‌లో ఎలుకల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటికి సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే 70 శాతం ఫిర్యాదులు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. 2022లో భారీగా ఫిర్యాదులు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలుకల నివారణకు న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ అన్ని రకాలుగా యత్నిస్తున్నారు. ఇటీవల ఆడమ్స్‌ చేసిన ట్వీట్‌ అందరిలోనూ ఆసక్తి రేపింది. న్యూయార్క్‌లో ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా..? మీరు ఎలుకలను పట్టుకోగలరా..? అయితే మీ ఉద్యోగం సిద్ధంగా ఉందంటూ ఆడమ్స్‌ ట్వీట్ చేశారు. ఎలుకలంటే తనకు అసహ్యమని కూడా తెలిపారు. ఈ పోస్టుకు మంచి పేరు కూడా ఉందని... ఈ ఉద్యోగాన్ని చిట్టెలుక ఉపశమన డైరక్టర్ అని పిలుస్తారని మేయర్ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు ఆ ఉద్యోగంలో చేరిన వారికి మంచి ప్యాకేజీ కూడా ప్రకటించారు. ఆ ఉద్యోగికి ఏడాదికి లక్షా 70 వేల డాలర్ల జీతాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. మన కరెన్సీలో కోటి 38 లక్షల 55 వేల రూపాయల జీతం అన్నమాట. అయితే ఈ ఉద్యోగంలో చేరడానికి కొన్ని అర్హతలు కూడా ఉండాలని సూచించారు. నాయకత్వ లక్షణాలు, సత్తువ, ఎలుకలను పట్టుకునే సామర్థ్యం ఉండాలన్నారు. 88 లక్షల మంది న్యూయార్క్‌ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలుకలపై పోరాటం కోసం తమతో కలిసి పని చేయాలని మేయర్‌ ఆడమ్స్‌ పిలుపునిచ్చారు.

ఎలుకల సమస్య ఒక్క న్యూయార్క్‌లోనే కాదు.. పలు దేశాల్లో ఉంది. అయితే ఆయా దేశాల్లో కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండడంతో పెద్దగా పట్టించుకోవు. పైగా ప్రజలు ఎవరికి వారు ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటుండడంతో సమస్య అంత పెద్దగా అనిపించడం లేదు. కానీ.. ఆస్ట్రేలియాలో మాత్రం ఎలుకలు తీవ్ర కలకలమే సృష్టిస్తున్నాయి.ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏకంగా ఎలుకలపై యుద్ధమే చేస్తోంది. న్యూసౌత్‌వేల్స్‌, క్వీన్‌ల్యాండ్‌ రాష్ట్రాల్లో ఎలుకలు భారీగా పుట్టుకొస్తున్నాయి. టన్నుల కొద్దీ పాయిజన్‌ ఉపయోగించినా మూషిక సంతానం మాత్రం అంతరించలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎలుకల నుంచి వెలువడే దుర్గంధం, కొరికేసిన ఫిర్నచర్ర‌, వైర్లు, స్విచ్‌బోర్డులు, ఏసీల ఇన్సులేషన్లు.. ఇలా ఒకటేమిటి.. కనిపించిన ప్రతిదాన్ని ఎలుకలు నాశనం చేస్తున్నాయి. ఒక నాలుగు రోజులు ఇంటికి తాళం వేసి.. వెళ్లిపోతే.. వచ్చేసరికి ఇల్లు గుల్లవుతుంది. ఎక్కడ చూసినా.. ఎలుకలు, అవి పెట్టిన రంద్రాలే కనిపిస్తాయి. ఎలుకల బాధ భరించలేక.. సమస్యను మహమ్మారి సరసన చేర్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వాటిని ఎలా నివారించాలోనని తలలు పట్టుకుంటోంది. ఎలుకలను నివారించకపోతే.. న్యూసౌత్‌వేల్స్‌లో ఆర్థిక, సామాజిక సంక్షోభం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఎలుకల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. అవి మరింతగా పుట్టుకొస్తున్నాయి. ఎలుకల బెడద ఎప్పుడు ఆగిపోతుందా? అని న్యూసౌత్‌ వేల్స్, క్వీన్‌ల్యాండ్‌ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

చిట్టెలుకలు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు.. ఇళ్లు, వ్యాపారాలు, హోటళ్ల సముదాయాల్లో భారీ నష్టాన్ని కలుగుజేస్తాయి. ఎలుకల బెదడతో మన దేశంలో అయితే.. పిల్లులను పెంచుకుంటారు. లేదంటే.. ఎలుకలను పట్టేసేందుకు బోనులను ఏర్పాటు చేస్తారు. వాటి పీడను వదిలించుకుంటారు. కానీ.. న్యూయార్క్‌వాసులను మాత్రం మూషిక ఆగడాలు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories