ఆ ఇద్దరు కింగ్‌ల వైల్డ్‌ డేరింగ్‌ టూర్‌ ఎలా సాగింది?

ఆ ఇద్దరు కింగ్‌ల వైల్డ్‌ డేరింగ్‌ టూర్‌ ఎలా సాగింది?
x
Highlights

ప్రపంచమంతా ఇప్పుడు ఒక షో కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు, ఆ కార్యక్రమం వీక్షణ కోసం ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో టీజర్లు,...

ప్రపంచమంతా ఇప్పుడు ఒక షో కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు, ఆ కార్యక్రమం వీక్షణ కోసం ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో టీజర్లు, మీడియాలో యాడ్స్‌తో, ఆ క్యూరియాసిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఇంతకీ ఏంటా షో....వైల్డ్‌ కింగ్‌ విత్‌ పీపుల్స్‌ కింగ్...

అవును. వైల్డ్‌ కింగ్ వర్సెస్ పీపుల్స్ కింగ్. ఈ ఇద్దరు కింగ్‌ల సాహస యాత్రను చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. వైల్డ్‌ లైఫ్‌లో డేరింగ్‌ టూర్‌ ఎలా సాగిందో వీక్షించడానికి ఉత్కంఠతో ఉంది. చుట్టూ కమెండోలు, పటిష్టమైన భద్రత, డేగ కళ్ల పహారా మధ్య జనారణ్యంలో ఉండే ప్రధాని మోడీ, అవేమీ లేకుండా కీకారణ్యంలో చేసిన సాహస యాత్ర ఎలా సాగింది?

నరేంద్ర మోడీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినాయకుడు. రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండాను రెపరెపలాడించిన రాజకీయ బాహుబలి. మొన్ననే జమ్మూకాశ్మీర్‌ను రెండుగా విభజించి, దశాబ్దాల వివాదాస్పద ఆర్టికల్ 370ని, ఒక్క కలం పోటుతో రద్దు చేసి, స్వదేశంతో పాటు ప్రపంచదేశాలను షేక్‌ చేసిన మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్. ఈ శతకోటి భారతావని పాలకుడు, ఇప్పుడు జనారణ్యం వదిలి, కీకారణ్యంలోకి అడుగుపెట్టాడు.

ఇక బేర్‌ గ్రిల్స్‌...చిట్టడువులు, కొండలూ, గుట్టలు, క్రూర జంతువులు, విష సర్పాలు, ఒళ్గు గగుర్పొడిచే కీటకాల మధ్య, తిరుగుతూ ధైర్యం విసిరిన రాకెట్‌లా దూసుకుపోతున్నాడు బేర్‌ గ్రిల్స్. మ్యాన్‌ వర్సెస్ వైల్డ్ పేరుతో అత్యంత జనాదరణ పొందిన ప్రోగ్రామ్‌తో కోట్లాదిమంది ప్రేక్షకులను కనికట్టు చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ ఇద్దరు సాహసవీరులు కలిశారు. ప్రపంచ దేశాల అడవులను జల్లెడపడుతూ పడుతూ, చివరికి భారతదేశ కీకారణ్యాల్లో డేరింగ్‌ టూర్ చేసేందుకు వచ్చిన బేర్‌ గ్రిల్స్‌‌కు, ప్రధానమంత్రి హోదాలో స్వాగతం పలికి, అదే హోదాలో అతడితో సాహస యాత్ర చేశారు మోడీ. భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రీ సాహసించని యాత్రగా ఇది చరిత్రకెక్కుతోంది. ఏ పీఎం కూడా ఇలా కొండలు, గుట్టలు, క్రూర జంతువుల మధ్య నడవలేదు. ఇప్పుడు ఈ రికార్డును సైతం, సొంతం చేసుకున్నాడు మోడీ.

ఆగస్టు 12న డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రైమ్ మినిస్టర్‌ నరేంద్ర మోడీతో కలిసి, బేర్‌ సాగించిన అరణ్యకాండ ప్రోమోలు, ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. యూట్యూబ్‌లో లక్షలు, కోట్లమంది ఈ టీజర్లను చూస్తున్నారంటే, ఈ ఎపిసోడ్‌ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.

మోడీ. భారతదేశ రాజకీయాల్లో నిజంగా వేటగాడు. ఓట్ల వేటగాడు. సంస్కరణల వేటగాడు. సాహసోపేత నిర్ణయాల సాహసి. అయితే అమ్మ దగ్గర చంటిపిల్లాడు అవుతాడు. పిల్లల దగ్గర స్నేహితుడవుతాడు. ఇప్పుడు అడవిలో అడుగుపెట్టింది వేటగాడిగా అనుకుంటే పొరపాటే. వన్యప్రాణి ప్రేమికుడిగా అరణ్యమంతా కలియతిరిగాడు. డేరింగ్ డాషింగ్‌ వైల్డ్‌ కింగ్‌ బేర్‌ గ్రిల్స్‌ అడుగుల్లో అడుగులేస్తూ, తన జీవితానికి సంబంధించి చాలా లోతైన విషయాలు పంచుకున్నారు మోడీ. అడవితో, పర్వతాలతో, జంతువులతో, ప్రకృతితో తనకున్న బంధాన్ని బేర్‌తో షేర్‌ చేసుకున్నారు. ఇంతకీ ఏంటా విషయాలు?

మోడీ: భారతదేశానికి స్వాగతం.

బేర్: ప్రైమ్‌ మినిస్టర్‌, ఇది వన్యప్రాణి సంరక్షణా ప్రాంతం, నేషనల్ పార్క్ అని మీకు తెలుసు. ఇది చాలా ప్రమాదకరమైన స్థలమని కూడా మీకు తెలుసు. ఎన్నో వన్యప్రాణులున్నాయి ఇక్కడ. ఇందులో వాహనాలతో వచ్చే సందర్శకులు ఎవరూ కూడా, వాహనం దిగడానికి సాహసించలేని ప్రమాదకర స్థలం.

మోడీ: అయితే, వన్యప్రాణి ప్రాంతాన్ని మనం డేంజర్‌ అని భావించకూడదు. ప్రకృతితో మనం సంఘర్షిస్తే, ప్రతీదీ ప్రమాదంగానే పరిణమిస్తుంది. పోట్లాడితే మనుషులు కూడా డేంజరే.

బేర్‌ గ్రిల్స్‌కు ఉత్తరాఖండ్‌లోని నేషనల్‌ పార్క్‌లో స్వాగతం పలికిన మోడీ, అతడితో కలిసి అడవిబాట పట్టారు. అడవిలో క్రూర జంతువలు ఉంటాయి కాబట్టి, ఆయుధాలు అవసరమని మోడీకి చెప్పాడు బేర్. ఆత్మరక్షణ కోసం అప్పటికప్పుడు, అక్కడే దొరికే కర్రలు, పనిముట్లతో బలమైన ఆయుధం ఎలా తయారు చేసుకోవచ్చో మోడీకి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి, వెపన్‌ను తయారు చేశారు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

మోడీ: ఓహో. ఇదేనా నీ వెపన్.

బేర్: కర్ర, కత్తిని కేర్‌ఫుల్‌గా పట్టుకోండి. తాడు అలానే తిప్పుతూ ఉండండి. మీరు యువకునిగా ఉన్నప్పుడు, పర్వతాల్లో ఎక్కువగా గడిపారట.

మోడీ: అవును. హిమాలయాల్లో కొన్నాళ్లు ఉన్నాను.

బేర్: ఆ అనుభవాలు ఒకసారి చెప్పండి.

మోడీ: నా వయస్సు 17, 18 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేశాను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని ఆలోచించాను. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం. హిమాలయాల్లో చాలామందిని కలిశాను. వారి మధ్యనే గడిపాను. అదొక విశేషమైన అనుభవం. చాలా సమయం అక్కడ గడిపాను.

బేర్: అది మీ జీవితంలో చాలా గొప్ప అనుభవం అనుకుంటా. మీ వ్యక్తిత్వాన్ని మలిచిన ఎక్స్‌పీరియన్స్.

మోడీ: అవును. ఇప్పటికీ నా జీవితానికి ఆ అనుభవాలు బలాన్నిస్తాయి.

బేర్: మీరు భారతదేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తి. మిమ్మల్ని కాపాడ్డమే నా పని.

బేర్: పులి మీదికి వస్తే, దీనితో ఇలా పొడిచి మనల్ని రక్షించుకోవాలి.

మోడీ: అయితే, చంపడం నా సంస్కారం కాదు. మీ కోసం ఈ ఆయుధాన్ని నా దగ్గర పెట్టుకుంటాను.

జంతువులను చంపడానికి వస్తే ఎలా రక్షించుకోవాలో మోడీకే పాఠాలు నేర్పాలని బేర్‌ ట్రై చేస్తే, చంపడం నా తల్లిదండ్రులు తనకు నేర్పలేదని, తిరిగే బేర్‌కు పాఠం చెప్పారు మోడీ. ఆ మాటకు బేర్‌ను కూడా ఆలోచనలో పడేసింది. ఇలా చెట్లు, పుట్టలు దాటుకుంటూ, బేర్‌ను అనుసరిస్తూ ముందుకు సాగిపోయారు మోడీ. నది దగ్గరకు చేరుకున్నారు. మరోసారి ఇద్దరి మధ్య సంభాషణ.

బేర్: మీరు గొప్ప దేశంలో నివసిస్తున్నారు. మనముందు నది ఉంది. ఎక్కడో ఒక చోట ఈ నదిని దాటి అవతలికి పోవాలి.

బేర్: ఇండియా మరింత పరిశుభ్రంగా మారడానికి మేమేం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు.

మోడీ: ఇండియా పరిశుభ్రంగా ఉండటానికి, బయటి దేశాల సాయం అవసరం లేదు. భారతదేశ ప్రజల స్వభావంతో ఇండియా క్లీన్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత ఇక్కడ ప్రతి ఒక్కరి సంస్కారంలోనూ ఉంది. సమాజంలో స్వచ్చతపై అందరిలోనూ అవగాహన ఉంది. మహాత్మా గాంధీ ఇందుకోసం చాలా కృషి చేశారు. స్వచ్చ భారత్‌‌ సఫలమవుతోంది.

ఇలా మోడీ, బేర్‌ మధ్య సంభాషణలు జరిగాయి. ఎప్పుడూ చెప్పని వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు మోడీ. ఈ వైల్డ్‌ లైఫ్‌ జర్నీలో ఎప్పుడూ చూడని మోడీని చూస్తున్నాం. మోడీలోని సరదా మనిషిని వీక్షిస్తున్నాం. ప్రధానిన్న విషయం మర్చిపోయి, ధైర్యంగా అడవిలో సాధారణ మనిషిలా ముందుకు సాగిపోయాడు మోడీ. ట్రైలర్‌లోనే ఇంత డేరింగ్‌ విషయాలుంటే, ఇక ఫుల్‌ ఎపిసోడ్‌ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ పెరుగుతోంది.

మోడీతోనే కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా అడవుల బాట పట్టించాడు బేర్‌ గ్రిల్స్. టైటానిక్‌ హీరోయిన్‌ కేట్‌ విన్స్‌లెట్‌తో అరణ్యంలో కీటకాలు కూడా తినిపించాడు. మరెందరో ప్రపంప ప్రఖ్యాత ప్రముఖులతో డేరింగ్ స్టంట్స్ చేయించి దడ పుట్టించాడు.

వైల్డ్‌ కింగ్ బేర్‌ గ్రిల్స్‌, తాను సాహసం చేయడమే కాదు, అందులోకి ప్రపంచ ప్రముఖులనూ లాగుతుంటాడు. ప్రస్తుతం బేర్‌ గ్రిల్స్ ప్రోగ్రామ్, మ్యాన్ వర్సెస్ వైల్డ్‌గా పిలుస్తున్నా, గతంలో బోర్న్ సర్వైవర్ విత్ బ్రేర్‌ గ్రిల్స్, అలాగే రన్నింగ్ వైల్డ్ విత్ బేర్‌ గ్రిల్స్‌గానే ప్రసారమయ్యేది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానూ కొండులు, గుట్టలూ ఎక్కించారు బేర్. టైటానిక్ హీరోయిన్ కేట్‌ విన్స్‌లెట్‌‌ కూడా బేర్‌ గ్రిల్స్‌ డేరింగ్ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసింది. మొదట్లో కాస్త తడబడినా, తర్వాతర్వాత ధైర్యం తెచ్చుకుని, అత్యంత సాహసంగా అడుగులు వేసింది. కేట్‌ విన్స్‌లెట్‌ చేత వానపాములను వండి, తినిపించారు బేర్.

నటుడు, రచయిత స్టీఫెన్‌ ఫ్రై చేత హెలికాప్టర్‌ కింద ఉండే స్టాండ్‌ మీద వేలాడుతూ గగనవిహారం చేయించారు. 150 మీటర్ల ఎత్తయిన జలపాతం నుంచి కిందకి దిగేలా చేశారు.

వీరేకాదు, జక్‌ ఎఫ్రాన్‌, బెన్‌ స్టిలర్‌, కేట్‌ హడ్సన్‌, మైఖేల్‌ జోర్డన్‌, మిషెల్‌ రోడ్రిగెజ్‌, జేమ్స్‌ మార్డ్‌సన్‌, జూలియా రాబర్ట్స్‌, రోజర్‌ ఫెదరర్‌ ఎందరో సెలబ్రిటీలతో సాహసాలు చేయించాడు బేర్‌ గ్రిల్స్. ఒక్కో సందర్భంలో వీరంతా ఏడ్చేశారు. డేరింగ్ స్టంట్స్ చేయలేక వణికిపోయారు. డేంజర్‌‌ జోన్‌లోకి నెట్టేస్తున్నావంటూ బేర్‌పై అరిచేశారు కూడా. కానీ చాలా జాగ్రత్తగా వారిని గైడ్ చేసి, చివరికి వారికే తెలియని వారిలోని శక్తిని, ధైర్యాన్ని వారికే పరిచయం చేశాడు బేర్. అందుకే ఆ ప్రోగ్రాం తర్వాత, బేర్‌తో సాహస యాత్ర డేంజర్‌గా అనిపించినా, థ్రిల్లింగ్‌గా సాగిందని చెప్పుకుంటారు ప్రముఖులు. ఇలా ప్రపంచ ప్రముఖులను అడవులు, లోయల్లోకి తీసుకెళ్తున్న బేర్, వారి జీవితంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఇప్పుడు భారత ప్రధానమంత్రినీ అరణ్యంలోకి తీసుకెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories