పక్షులపై యుద్ధం ప్రకటించిన కెన్యా.. 60 లక్షల క్యులియా పక్షుల అంతానికి ప్రణాళికలు

Kenya Declares war Against Millions of Quelea Birds
x

పక్షులపై యుద్ధం ప్రకటించిన కెన్యా.. 60 లక్షల క్యులియా పక్షుల అంతానికి ప్రణాళికలు

Highlights

Kenya: క్యులియా.. ఈ పక్షి పేరు వింటేనే ఆఫ్రికా దేశాలు ఉలిక్కి పడుతున్నాయి.

Kenya: క్యులియా.. ఈ పక్షి పేరు వింటేనే ఆఫ్రికా దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఎర్రటి ముక్కుతో చిన్నగా కనిపించే క్యులియా అక్కడి నేతలను గడగడలాడిస్తోంది. ఆ చిన్న పక్షి ఆఫ్రికా దేశాల ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. ఏకంగా క్యులియా పక్షులకు అంతం చేసేందుకు ఇప్పుడు ఏకంగా కెన్యా యుద్ధమే ప్రకటించింది. వాటిపై నిఘా కోసం టాంజానియా ప్రభుత్వం ఏకంగా 5 లక్షల డాలర్లను వెచ్చిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే.. 4 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. ఈ రెండు దేశాలే కాకుండా.. క్యులియా పక్షి దెబ్బకు సుడాన్‌, సోమాలియా, ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌటి వంటి ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. అసలు క్యులియా పక్షి అంటే.. ఆ దేశాలకు ఎందుకు భయం? వాటిని ఎందుకు ఆఫ్రికన్‌ దేశాలు అంతం చేయాలనుకుంటున్నాయి? ఆ పక్షుల విషయంలో నిపుణులు ఏమంటున్నారు.

క్యులియా.. ఎర్రటి ముక్కు ఉన్న చిన్న పక్షి. క్యులియా అంటే.. లాటిన్ భాషలో పక్షి అని అర్థం. దీన్ని ఆఫ్రికన్‌ నైటింగేల్‌ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికన్‌ దేశాల్లో స్థానికంగా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అంతర్జాతీయ పక్షిశాస్త్ర కమిటీ-IOC మాత్రం అధికారికంగా ఈ పక్షిని రెడ్‌-బిల్డ్‌ క్యూలియా అనే పేరును పెట్టింది. ఇది భారత్‌లో కనిపించే పిచ్చుకలాగా ఉంటుంది. దీని పొడవు 12 సెంటీమీటర్లు ఉంటుంది. బరువు 15 నుంచి 26 గ్రాముల వరకు ఉంటుంది. ఈ జాతి పక్షులు సాధారణంగా అడవులు, ఎడారులు, ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తాయి. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో క్యులియా పక్షులు అత్యధికంగా కనిపిస్తాయి. ఇవి ముళ్ల కొమ్మలు, చెరకు లేదంటే.. రెల్లు గడ్డితో గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ పక్షులు గడ్డి విత్తనాలు, లేదంటే తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాయి. క్యులియాలు భారీగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. పక్షి జాతుల్లో అత్యధికంగా ఇవే ఉన్నట్టు చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల క్యులియా పక్షులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇవి ఆఫ్రికా దేశాల్లో తరచూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆహారం కోసం వలస వెళ్తుంటాయి. క్యులియా పక్షుల వలసలే ఆఫ్రికన్‌ దేశాలను హడలెత్తిస్తున్నాయి. ఆయా దేశాల నేతలను క్యులియాలు గడగడలాడిస్తున్నాయి. క్యులియా పేరు వింటేనే.. అక్కడి ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. క్యులియాలు వస్తున్నాయంటే.. పొలాల వైపు ఆఫ్రికన్లు పరుగులు పెడుతున్నారు. ఇంతకు క్యులియా పక్షి అంటే.. ఆఫ్రికన్లకు ఎందుకు భయం? ఆ పక్షులు ఏం చేస్తాయి? అక్కడి ప్రభుత్వాలు వాటిపై ఎందుకు యుద్దం ప్రకటించాయి?

నిజానికి ఆఫ్రికా ఖండంలోని తూర్పు దేశాలైన సోమాలియా, టాంజానియా, ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌటి, కెన్యా, దక్షిణ సుడాన్‌ దేశాలు.. 10 ఏళ్లుగా తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. ఆయా దేశాల్లో కరువు కారణంగా లక్షలాది మంది ప్రజలు ఆకలి చావులను ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న ఎండల కారణంగా పచ్చిక బయళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఆయా దేశాల్లో మైదానాలు ఎడారుల్లా మారాయి. ప్రధానంగా పచ్చిక బయళ్లపైనే ఆధారపడిన క్యులియా పక్షులకు గడ్డి విత్తనాలు లభించక ఆహారం కోసం వేట ప్రారంభించాయి. ఈ క్రమంలో పంట పొలాలపై దృష్టి సారించాయి. ఆఫ్రికా మీడియా కథనాల మేరకు క్యులియా పక్షులు కెన్యాలో ఇప్పటివరకు 300 ఎకరాల వరి పంటలను మింగేశాయట. 2 లక్షల క్యులియా పక్షులు ఒక రోజులో 50 టన్నుల ధాన్యాన్ని తినగలవని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ-FAO చెబుతోంది. ఒక్క క్యులియా పక్షి... రోజుకు పది గ్రాముల ధాన్యాన్ని తింటుందట. ఈ పక్షుల కారణంగా కెన్యాలోని రైతులు ఏకంగా ఏటా 60 టన్నుల ధాన్యాన్ని కోల్పోతున్నట్టు అక్కడి ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అసలే తీవ్ర ఎండల నుంచి పంటల రక్షించుకోవడానికి ఆరుగాలం ఆఫ్రికన్‌ రైతులు శ్రమిస్తున్నారు. తీరా.. పంట చేతికొచ్చే సమయంలో క్యులియాలు దాడి చేస్తున్నాయి. 2021లో పశ్చిమ కెన్యాలో 5 కోట్ల డాలర్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు FAO గణాంకాలు చెబుతున్నాయి. మన కరెన్సీలో చెప్పాలంటే.. ఏకంగా 450 కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లింది.

పశ్చిమ కెన్యాలోని 2వేల ఎకరాల్లోని పంటలకు ఇప్పుడు ముప్పు నెలకొందంటూ అక్కడి మీడియా చెబుతోంది. అసలే కరువుతో విలవిలలాడుతున్న కెన్యాను.. క్యులియా పక్షులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క కెన్యాలోనే కాదు.. సోమాలియా, టాంజానియా, ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌటి, దక్షిణ సుడాన్‌ దేశాల్లోని రైతులు కూడా ఈ క్యులియా సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఇవి ప్రధానంగా గోధుమలు, బార్లీ, వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటలపై గుంపులు గుంపులుగా వచ్చి వాలిపోతాయి. గొల్లభామాలాగా... ఆహార ధాన్యాలను తినేస్తున్న ఈ పక్షులను రెక్కల గొల్లభామ అని ఆఫ్రిక్లను పిలుస్తారు. పంటను కళ్లముందే తినేస్తున్న క్యులియా పక్షులను వేటాడేందుకు కెన్యా రైతులు సిద్ధమవుతున్నారు. ఫెంథియాన్‌, ఆర్గానో ఫాస్పేట్‌ వంటి పురుగు మందులను పంటలపై పలువురు రైతులు పిచికారి చేస్తున్నారు. అయినా.. వాటిని నివారించడంలో మాత్రం రైతులు విఫలమవుతున్నాయి. పచ్చని పంటలపై క్యులియా పక్షులు దాడి చేస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే తాము నిండా మునగడంతో పాటు ప్రజలకు ఆహార కొరత నెలకొనే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పురుగు మందు పిచికారి చేయడం అత్యంత ప్రమాదకరమని పక్షి ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. క్యులియాలను చంపేందుకు వాడే పురుగు మందుతో ఇతర పక్షులు కూడా మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పురుగు మందుల పిచికారితో పర్యావరణం దెబ్బ తింటుందని మనుషులకు కూడా డేంజర్‌ అని వివరిస్తున్నారు.

మరోవైపు క్యులియా పక్షులను చంపేందుకు కెన్యా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఏకంగా 60 లక్షల పక్షులను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ప్రభుత్వం కూడా ఫెంథియాన్‌ పురుగు మందును వినియోగించాలని నిర్ణయించింది. జనవరి 15 నుండి వరి పొలాలపై ఫెంథియాన్ పురుగుల మందును డ్రోన్లతో పిచికారీ చేయడం ప్రారంభించింది. మిగిలిన ఉన్న వరి పైరులను కాపాడుకోవడానికి వేరే మార్గం లేదని కెన్యా వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిజానికి ఒక బస్తా వడ్లను పొందడానికి కెన్యా రైతులు పడుతున్న పాట్లు అత్యంత దయనీయంగా ఉన్నాయి. క్యులియా పక్షుల గుంపు దాడితో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పక్షులు ఆఫ్రికన్‌ దేశాలపై తరచూ దండయాత్ర చేస్తున్నాయి. అధిక వేగంతో వెళ్లే ఈ క్యులియా పక్షుల నివారణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మరోవైపు టాంజానియా, సూడాన్‌ దేశాలు కూడా ఈ పక్షుల నివారణకు ఇలాంటి చర్యలనే చేపడుతున్నాయి. రెడ్‌-బిల్డ్‌ క్యులియాను చంపేందుకు పురుగు మందులు పిచికారి చేయడంతో పాటు.. నిఘా పెంచేందుకు టాంజానియా ప్రభుత్వం 5 లక్షల డాలర్ల నిధులను కేటాయించింది.

ఇదిలా ఉంటే 1958లో అప్పటి చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్‌ను కూడా పిచ్చుకలు భయపెట్టాయి. మనుషులకు మాత్రమే చెందాల్సిన ఆహార ధాన్యాలను పిచ్చుకలు తినడంపై ఆయన సహించలేకపోయారట. దీంతో మావో అప్పట్లో పిచ్చుకలపై యుద్ధం ప్రకటించారు. ఎక్కడ పిచ్చుకలు కనిపిస్తే అక్కడ వాటిని కాల్చి చంపేయించారు. మావో పిలుపు మేరకు పిచ్చుకల గూళ్లను, గుడ్లను ప్రజలు ధ్వంసం చేశారు. నిజానికి పిచ్చుకలు ఎక్కవ దూరం ఎగరలేవు. అవి త్వరగా అలసిపోతాయి. దీన్నే అవకాశంగా తీసుకుని.. వాటిని వెంటబడి తరిమారు. అవి చనిపోయేంత వరకు భారీగా శబ్దాలు చేశారు. దీంతో రెండేళ్ల కాలంలో అత్యంత విస్తృతమై జాతుల్లో ఒకటైన పిచ్చుకలు చైనాలో దాదాపు అంతర్థానమయ్యాయట. పిచ్చుకలను చంపేయడంతో డ్రాగన్‌ కంట్రీ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఆ తరువాత మిడతలు విజృంభించాయి. మిడతలను తినేసే పిచ్చుకలు లేకపోవడంతో చైనాలో కరువు నెలకొన్నది. తత్వం బోధపడిన తరువాత.. మావో ప్రభుత్వం.. పిచ్చుకలను రెడ్‌ లిస్ట్ నుంచి తొలగించింది. ఆ తరువాత.. ఇతర దేశాల నుంచి పిచ్చుకలను దిగుమతి చేసుకుంది. ప్రధానంగా క్యులియా పక్షులు తూర్పు ఆఫ్రికా దేశాలను వణికిస్తున్నాయి. ఆయా దేశాలు వాటిని చంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అయితే అవి ఎంత వరకు విజయం సాధిస్తాయో తెలియాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories