అమెరికా పగ్గాలు చేతికి రాకముందే బైడెన్‌ కీలక నిర్ణయం

అమెరికా పగ్గాలు చేతికి రాకముందే బైడెన్‌ కీలక నిర్ణయం
x
Highlights

అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బైడెన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ 20వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ...

అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బైడెన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ 20వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ వెంటనే ప్రకటించేందుకు ఆర్థిక వ్యవస్థ కోసం భారీ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కోవిడ్ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రకటించారాయన. వచ్చే వారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రవేశపెడతామని బైడెన్ ప్రతిపాదించారు. దీని ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు 160 బిలియన్ డాలర్లు మరో 170 బిలియన్ డాలర్లు పాఠశాలలకు కేటాయించనున్నట్లు బైడెన్‌ వెల్లడించారు. తన తొలి వంద రోజుల పాలనలో 10 కోట్ల మందికి టీకా అందించాలనే లక్ష్యం నెరవేర్చుకునేందుకు అమెరికా రెస్క్యూ పేరిట మరో ప్రణాళికను కూడా ఈ సందర్భంగా బైడెన్ ప్రకటించారు.

జో బైడెన్ ఈ నెల 20న బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించడంతో ఇప్పటికే రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. తాజాగా నగరంలో కనీసం 20 వేల మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలని అధికారులు భావిస్తున్నారు. పరిస్తితులకు అనుగుణంగా వాషింగ్టన్‌లోని హోటళ్లు, విమానయాన సంస్థలు, ఇతర వ్యాపార సముదాయాలు కూడా భద్రతను పెంచాయి. దీంతో అమెరికా రాజధాని నగరం లాక్‌డౌన్ దిశగా పయనిస్తోంది. ప్రముఖ ఎయిర్ లైన్స్ డెల్టా ఎయిర్ ప్రయాణికులపై ప్రత్యేక ఆంక్షలు విధించడం కూడా దీనికి నిదర్శనమని చెబుతున్నారు.

ఈ నెల 6న కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి తర్వాత వ్యాపార సముదాయాలు భద్రతను పెంచుకునే పనిలో పడ్డాయి. ప్రమాణ స్వీకారం రోజున అల్లరిమూకలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే కేపిటల్ భవనం, సుప్రీం కోర్టు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటి చుట్టుపక్కల ఉన్నవ్యాపార సముదాయాలు, అటువైపు వెళ్లే రోడ్డు మార్గాలను అధికారులు ఇప్పటికే మూసివేశారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు మెట్రో స్టేషన్స్, బస్సు రూట్లు కూడా మూతపడనున్నాయని సమాచారం. నేషనల్ పార్క్ సర్వీసులను కూడా నిలిపివేయబోతున్నారు. ఇలా వాషింగ్టన్ నగరం కట్టుదిట్టమైన భద్రత మధ్య బైడెన్ ప్రయాణస్వీకారం రోజు నాటికి దాదాపు లాక్‌డౌన్ అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories