అఫ్ఘానిస్థాన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!

Jaish-e-Mohammad Chief Masood Azhar in Pakistan
x

అఫ్ఘానిస్థాన్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!

Highlights

జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌, కరుడుగట్టిన ఉగ్రవాది.. మసూద్‌ అజహార్‌ ఎక్కడున్నాడో తెలియదన్న పాక్‌

Masood Azhar: ఉగ్రవాదానికి కేరాఫ్‌ అడ్రస్‌ పాకిస్థాన్‌... ఆ దేశ ఆర్మీ, గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆధ్వర్యంలోనే ఉగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహణ, ఉగ్ర మూకలకు రక్షణ కల్పిస్తున్న ఆధారాలు కోకొల్లలు. కానీ ఇప్పుడు ఉగ్రవాదం పేరెత్తితే.. పాకిస్థాన్‌ సింపుల్‌గా అఫ్ఘానిస్థాన్ వైపు చూపుతోంది. ఏ ఉగ్రవాది గురించి సమాచారం అడిగినా.. అఫ్ఘాన్‌లో ఉన్నట్టు చెబుతోంది. తాజాగా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజహార్‌ విషయంలో పాకిస్థాన్‌ కొత్త నాటకానికి తెర తీసింది. మసూద్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ తాలిబన్లకు లేక రాసింది. అంతేకాదు అఫ్ఘాన్‌లోని నంగ్రహార్‌-కునార్‌ ప్రావిన్స్‌లో మసూద్‌ ఉన్నాడన్న సమాచారం కూడా ఇచ్చింది. పాకిస్థాన్‌ తీరుపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రవాదం ఈ మాట ప్రపంచంలోని ఏ మూలన విన్నా దాని మూలాలు మాత్రం పాకిస్థాన్‌లోనే ఉంటాయి. ఆ దేశానికి చెందిన ఆర్మీ, గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో ఉగ్ర శిక్షణ నిర్వహిస్తున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఉగ్ర నేతలను కాపాడుతున్న ఇస్లామాబాద్‌ ఇప్పుడు వింత నాటకానికి తెరలేపింది. ఏ ఉగ్రవాది గురించి సమాచారం అడిగినా అఫ్ఘానిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతోంది. తమకేమీ తెలియదని అమాయకంగా చెబుతోంది. కరుడుగట్టిన ఉగ్రవాది, జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజహార్‌ ఎక్కడున్నాడో తమకు తెలియదని బుకాయిస్తోంది. అంతేకాదు మసూద్‌ అప్ఘాన్‌లో ఉన్నాడని సమాచారం కూడా ఇచ్చింది. నంగ్రహార్‌- కునార్‌ ప్రావిన్స్‌లో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఆమేరకు మసూద్‌ను అరెస్టు చేయాలంటూ తాలిబన్లకు పాకిస్థాన్‌ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. పాకిస్థాన్‌ తీరుపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అఫ్ఘానిస్థాన్‌లో మసూద్‌ లేనే లేడని చెబుతోంది. తమను ఉగ్రవాదులుగా చిత్రీకరించే కుటిల ప్రయత్నాలను పాక్‌ మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు.

నిజానికి తాలిబన్లను పెంచి పోషించింది కూడా పాకిస్థానే అఫ్ఘానిస్థాన్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి మళ్లీ తాలిబన్లు కాబుల్‌ను వశం చేసుకోవడంలో పాకిస్థాన్‌ కీలక పాత్ర పోషించింది. ఉగ్రవాదుల అండదండలతోనే తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టు 15న కాబుల్‌ను తాలిబన్లు వశం చేసుకున్న వెంటనే పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ చీఫ్‌ కాబుల్‌కు వెళ్లి వారితో చర్చలు పరిపారు. అప్పటివరకు పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ఉన్నారు. ఏడాదిలోపలే పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత పాకిస్థాన్‌కు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధాని అయ్యారు. తాలిబన్ల విషయంలో పాక్‌ నిర్ణయం మారింది. ఉగ్రవాదమంటే అఫ్ఘానిస్థానే అన్నట్టుగా చెబుతోంది. తాలిబన్లేమీ తక్కువ తినలేదు. తమకు మళ్లీ అధికారం కట్టబెట్టిన ఉగ్రవాదులకు అఫ్ఘానిస్థాన్‌లో ఆశ్రయమిస్తున్నారు. తాజాగా కాబుల్‌లో ఆశ్రయం పొందుతున్న అల్‌ఖైదా ఉగ్రనేత అల్‌ జవహరీని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అత్యంత సీక్రెట్‌గా అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్‌కు కూడా పాకిస్థానే సాయం అందించినట్టు తాలిబన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా మసూద్‌ అజహార్‌ కూడా అఫ్ఘాన్‌లో ఉన్నాడని పాకిస్థాన్‌ చెబుతోంది. అయితే మసూద్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడంటూ తాలిబన్లు ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి మసూద్‌ అజహార్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్‌ఐ కాపాడుతున్నాయి. కరాచీలో నిర్వహించిన పలు ర్యాలీలు, సభల్లో మసూద్‌ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అక్కడి నుంచే భారత్‌లో పలు ఉగ్రదాడులకు కుట్రలు పన్నాడు. 2001లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీపై, అదే ఏడాది పార్లమెంట్‌పై, 2016లో పటాన్‌కోట్‌, నగ్రోటా, యురీలో, 2019లో పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడులన్నింటికి కర్త, కర్మ, క్రియ మసూద్‌ హాజరే అన్నది బహిరంగ సత్యం. ఈ దాడులకు పాకిస్థాన్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ సహకారం అందించాయి. ఇప్పుడు అదే ఆర్మీ, ఐఎస్‌ఐ వింత వ్యాఖ్యలు చేస్తున్నాయి. మసూద్‌ అజహార్‌ ఎక్కడున్నాడో తమకు తెలియదని అమాయకంగా చెబుతున్నాయి. అఫ్ఘాన్‌లో ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నామయి. పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ నోట కూడా అదే మాట వచ్చింది. మసూద్‌ అజహార్‌ను అరెస్టు చేయాలంటూ లేఖ కూడా రాసింది. అయితే పాకిస్థాన్ ఇలా లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జనవరిలోనూ మసూద్‌ అజహార్‌ను తమకు అప్పగించాలని పాకిస్థాన్‌ లేఖ రాసింది.

అసలు మసూద్‌ అజహార్ అంశాన్ని పాకిస్థాన్‌ తెరపైకి తేవడం వెనుక పెద్ద కథే ఉంది. పాకిస్థాన్‌ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ నుంచి భారీగా రుణాలను కోరుతోంది. అయితే ఫ్రెంచ్‌ రాజధాని పారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న ఫైనాన్షియల్‌ యాక్షన్ టాస్క్‌ఫోర్స్‌-ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్థాన్‌లో ఐదు రోజుల పాటు పర్యటించింది. మసూద్‌ అజహార్‌ ఆధ్వర్యంలో నడిచే ఉగ్రవాద, మత సంస్థలకు పెద్ద ఎత్తున నిదులు అందుతున్నట్టు ఎఫ్‌ఏటీఎఫ్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకు పాక్‌ ఈ కొత్త నాటకానికి తెర లేపింది. అందులో భాగంగానే మసూద్‌ తమ దేశంలో లేడంటూ బుకాయిస్తోంది. ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. పాకిస్థాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో చేర్చే అవకాశం ఉంది. అదే జరిగితే.. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని.. మనీలాండరింగ్‌కు పాల్పడుతుందని నిర్ధారణ అయినట్టే.. గ్రే లిస్టు దేశాల జాబితాలోకి చేరితే.. విదేశీ సాయం కూడా నిలిచిపోతోంది. ఐఎంఎఫ్‌ నుంచి కూడా నిధులు అందవని పాక్‌ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో మసూద్‌ అజహార్‌ను అరెస్టు చేయాలని, తమకు అప్పగించాలని అఫ్ఘానిస్థాన్‌ను కోరుతోంది.

తాజాగా మసూద్‌ ఉన్నాడన్న నంగ్రహార్‌-కునార్‌ ప్రావిన్స్‌ కూడా పాకిస్థాన్‌ సరిహద్దులోనే ఉంటుంది. కానీ.. పాక్‌ వాదిస్తున్నట్టుగా.. అఫ్ఘానిస్థాన్‌లో మసూద్‌ ఉన్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. కేవలం అనుమానం మాత్రమేనని పాకిస్థాన్‌ స్వయంగా వెల్లడించింది. వచ్చే నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశం జరగనున్నది. అందులో తమ దేశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేదుకే అజహార్‌ను వాడుకుంటోంది. ఇక ఎఫ్‌ఏటీఎఫ్‌ 34 పాయింట్ల జాబితాను గతంలోనే పాకిస్థాన్‌కు అందించింది. అందులో ఒకటే మసూద్‌ అజార్ అరెస్టు. ఈ క్రమంలోనే తాలిబన్లు మసూద్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇలా ఎఫ్‌ఏటీఎఫ్‌ను బురిడీ కొట్టించడం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ లష్కర్ ఎ తొయిబా కమాండర్ సాజిద్ మిర్‌ను అరెస్టు చేసిన శిక్షించామని తేల్చి చెప్పింది. ముంబైపై నవంబర్ 26న జరిగిన దాడుల్లో సాజిద్ మిర్‌ను పాక్ దోషిగా తేల్చింది. అయితే పాక్ చర్యలు నమ్మశక్యమైనవి కావని భారత్ వాదిస్తోంది. అసలు సాజిద్‌ను అరెస్టే చేయలేదని, అతడు స్వేచ్ఛగా విహరిస్తున్నాడని భారత్‌ ఆరోపిస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌ కఠిన చర్యలకు దిగకుండా ఉండేందుకు పాక్ నటిస్తోందని భారత్ విమర్శిస్తోంది.

పాకిస్థాన్‌లోని పంజాబ్ బహవల్‌పూర్‌లో పుట్టిన మసూద్ అజహర్ 8వ తరగతిలోనే చదువు ఆపేశాడు. 1994లో ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ అన్సార్‌తో సంబంధాలు పెట్టుకుని మౌలానాగా మారి ఉగ్రవాద శిక్షణ కేంద్రాల్లో పనిచేశాడు. 1994లో పేక్ ఐడెంటిటీ కార్డుతో ప్రయాణిస్తూ శ్రీనగర్‌లో అరెస్ట్ అయ్యాడు. 1999లో నేపాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఖాట్మాండులో హైజాక్ చేసిన ఉగ్రవాదులు అఫ్ఘానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు. అనంతరం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి మసూద్‌ను, మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకున్నారు. నేరుగా పాకిస్థాన్ వెళ్లిన మసూద్ అజహర్ కరాచీలో పదివేల మందితో బహిరంగ సభ పెట్టాడు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం సంపాదించే వరకు ముస్లింలు నిద్రపోరాదంటూ పిలుపునిచ్చాడు. 2000 జైష్ ఎ మహ్మద్ ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఉగ్ర కార్యకలాపాలకు దిగుతున్నాడు. ప్రత్యేకంగా భారత్‌నే టార్గెట్‌ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు మసూద్‌ ఆధ్వర్యలోని జైష్‌ ఎ మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు.. ఆరుసార్లు భారత్‌పై దాడులకు దిగారు.

2002లో పాకిస్థాన్‌లో జరిగిన పాత్రికేయుడు డేనియల్ పెర్ల్ హత్యలోనూ మసూద్‌కు సంబంధం ఉంది. దీనిపై పాకిస్థాన్‌పై అమెరికా సీరియస్‌ అయ్యింది. అప్పట్లోనే మసూద్‌ అజహార్‌ను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అతడిని తమకు అప్పగించాలని భారత్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. కానీ పాక్‌ మాత్రం మసూద్‌ అలేడని బుకాయిస్తూనే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories