Top
logo

ఇటలీలో కరోనా కరాళ నృత్యం .. నిన్న ఒక్కరోజే మృతిచెందిన వారి సంఖ్య చూస్తే..

ఇటలీలో కరోనా కరాళ  నృత్యం .. నిన్న ఒక్కరోజే మృతిచెందిన వారి సంఖ్య చూస్తే..
X
another caronavirus case in ap (representational image)
Highlights

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇటలీలో బీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ భారిన పడి ...

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇటలీలో బీభత్సం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ భారిన పడి 793 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. దీంతో ఇటలీలో ఇప్పటివరకూ 4 వేల 824 మంది మృత్యువాత పడ్డారు. అలాగే కొత్తగా మరో 6 వేల 500 కేసులు నమోదవడంతో జనం హడలి పోతున్నారు. ఇటలీలో అంటువ్యాధుల కేసులు 47,021 నుండి 53,578 కు పెరిగాయని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. ఇక ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న 2,857 సంఖ్య 2,655 మందికి చేరింది. అయితే వీరంతా చనిపోయారా లేక కోలుకున్నారా అనేది స్పష్టంగా తెలియరాలేదు.

మరోవైపు దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న మిలన్ సమీపంలోని ఉత్తర లోంబర్డీలోనే దాదాపు 3 వేల మంది చనిపోవడం, వేల మంది రోగులు ఉండడంతో అక్కడ అత్యవసర వైద్య సేవలు అందించడం కూడా చాలా కష్టమవుతోంది. దీంతో వైద్య సిబ్బందిని మరింతగా పెంచారు. కరోనా వైరస్ ద్వారా రోజురోజుకు వందలాది మంది మృతి చెందుతుండటంతో ప్రజల్లో ఆందోళన ఉదృతమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లో నిపుణుల ఆధ్వర్యంలో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూకు ఆదేశించింది.

దాదాపు 4 వారాలుగా ఇటలీ పూర్తిగా నిర్భందంలోనే ఉంది. ఐతే.. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మొదట్లో సరైన జాగ్రత్తలు తీసుకోని ఫలితం ఇప్పుడు అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఆదేశాలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఇదిలావుంటే అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 13,000 మంది ప్రజలు ఈ వ్యాధితో మరణించారు. 304,500 మందికి పైగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ కాగా, ఇందులో దాదాపు 92,000 మంది కోలుకున్నారు. ఇక కరోనా వైరస్ కు నిలయమైన చైనాలో మాత్రం తాజాగా ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు.

Web Titleitaly death tolls to 793 due to coronavirus
Next Story