ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం.. షట్ డౌన్ తప్పదా ?

ప్రపంచవ్యాప్తంగా కరోనా విశ్వరూపం.. షట్ డౌన్ తప్పదా ?
x
Highlights

షట్ డౌన్....ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. అన్ని దేశాలదీ ఇదే బాట. కంపెనీలదీ అదే పాట. ప్రజలను ఇంతగా వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు షట్ డౌన్ తప్ప మరో...

షట్ డౌన్....ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. అన్ని దేశాలదీ ఇదే బాట. కంపెనీలదీ అదే పాట. ప్రజలను ఇంతగా వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు షట్ డౌన్ తప్ప మరో మార్గం లేదనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ షట్ డౌన్ ఎలా ఉందో చూద్దాం.

వేల ఏళ్ళ చరిత్రలో మానవజాతి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. క్షయ, ఎయిడ్స్ లాంటి మహమ్మారిలను సైతం సమర్థంగా నియంత్రించగలిగింది. అలాంటిది కనివిని ఎరుగని రీతిలో కరోనా మాత్రం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశదేశాల్లో మనుష్యులను ఇంటికే పరిమితం చేస్తో్ంది. కరోనా ను ఎదుర్కోవడంలో వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలేంటో చూద్దాం.

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పలు దేశాలు చేసిన మొట్టమొదటి పని సరిహద్దులు మూసేయడం. చైనా తో సహా కొన్ని దేశాలు సంపూర్ణంగా దీన్ని అమలు చేస్తే, భారత్ వంటి దేశాలు పాక్షికంగా అమలు చేశాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియాలోని కొన్ని దేశాలు మినహాయిస్తే అన్ని దేశాలు కూడా సంపూర్ణంగానో, పాక్షికంగానో సరిహద్దులను మూసేశాయి. ఆస్ట్రేలియా మార్చి 19 నుంచి దేశ సరిహద్దులను మూసివేసింది. దేశ పౌరులను మాత్రమే విదేశాల నుంచి తిరిగివచ్చేందుకు అనుమతించింది. విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిందిగా పౌరులకు సూచించింది. ఆస్ట్రేలియా చరిత్రలో ఈ విధమైన ట్రావెల్ బ్యాన్ ఇదే మొదటిసారి.

భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ మార్చి 16నే ఫ్లైట్ బ్యాన్ అమలు చేసింది. యూకే మినహా అన్ని యురోపియన్ దేశాలకు విమాన ప్రయాణాలను నిలిపివేసింది. పాకిస్థాన్ విషయానికి వస్తే భూ సరిహద్దులను మూసేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ కు ఇప్పటికే విమాన రాకపోకలను నిషేధించింది. కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్ ల నుంచి మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలను అనుమతిస్తున్నారు. శ్రీలంక మార్చి 17 నుంచి విదేశీ విమానాల రాకపోకలను నిలిపివేసింది. మరెన్నో దేశాలు ఇదే బాటలో పయనించాయి.

తాజాగా వివిధ దేశాలు ఇప్పడు తమ భూభాగాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించడంపై దృష్టి పెడుతున్నాయి. పలు దేశాల్లో కంపెనీలు తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు తమ కార్యాలయాలను షట్ డౌన్ చేశాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు.

అమెరికా, యూరప్ లలో ఇప్పుడు షట్ డౌన్ తారస్థాయికి చేరుకుంది. అనేక కంపెనీలు షట్ డౌన్ ప్రకటించాయి. హోండా, బీఎండబ్ల్యూ లాంటి కార్ల తయారీ కంపెనీలు తమ ప్లాంట్లను మూసేశాయి. లండన్ లో రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లను మూసివేశారు. నేషనల్ షట్ డౌన్ లాంటి వార్తలతో పలు దేశాల్లో సూపర్ మార్కెట్లు ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. కొన్ని సంస్థలు వృద్ధుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాయి. వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ ఉపకరణాలు తగినంతగా లభించక అమెరికాలో పలు ఆసుపత్రులు మూతపడే స్థితికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాతో సహా పలు దేశాల్లో వివిధరంగాల్లో షట్ డౌన్ అమలు కావడంతో ఒక్కసారిగా లక్షలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. అంతే కాదు ఆరోగ్య బీమాపై కూడా అది ప్రభావం కనబరుస్తోంది. ఆరోగ్య సేవలకూ వారు దూరమైపోతున్నారు. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం కనబరిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిప్రెషన్, భయం, ఆందోళన, నిద్రలేమి లాంటి సమస్యలు అధికమైపోతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఒక్క అమెరికా లోనే 8 కోట్ల మందిపై ప్రభావం పడింది. వీరంతా ప్రధానంగా రిటైల్, ఫుడ్, ఆతిథ్యం, సేవారంగం, వినోద పరిశ్రమల్లో పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో సాధారణ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారిని పరీక్షించేందుకు, ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడం కొత్త సమస్యలను సృష్టిస్తోంది. మొత్తం మీద కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై 18 నెలల పాటు ప్రభావం చూపగలదని అమెరికా భావిస్తోంది.

బిల్ గేట్స్ లాంటి ప్రముఖులు దేశవ్యాప్త షట్ డౌన్ ను సూచిస్తున్నారు. కనీసం 6-10 వారాల పాటు షట్ డౌన్ కొనసాగించాలని అంటున్నారు. అమెరికా లాంటి సంపన్నదేశాలకు ఇది సాధ్యం కావచ్చు. కాకపోతే భారత్ లాంటి దేశాలు షట్ డౌన్ ను ఎలా అమలు చేయగలవన్నదే ప్రధానప్రశ్నగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని రంగాల ఉద్యోగులకే సాధ్యం. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి అన్నదే ఆందోళన కలిగించే అంశంగా మారింది.

భారత్ లో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాక్షిక షట్ డౌన్ మొదలైంది. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, జిమ్ లు, పెద్ద పెద్ద మాల్స్ లాంటివి మూసేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 168 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మరెన్నో రైళ్లు రద్దయ్యే అవకాశం ఉంది. పలు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సర్వీసులను ఇప్పటికే నిలిపివేశాయి. పలు అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు కూడా వివిధ నగరాలకు రాకపోకలను నిలిపివేశాయి. పోటీ పరీక్షలతో సహా వివిధ పరీక్షలను ఇప్పటికే వాయిదా వేశారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న కశ్మీర్ లో రోడ్లపై సాధారణ ప్రజల రాకపోకలను సైతం నిలిపివేస్తున్నారు. ఢిల్లీ, రాజస్థాన్ తో సహా కొన్ని రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పంజాబ్ లో ప్రజారవాణ వ్యవస్థను నిలిపివేశారు. ఢిల్లీలో సుందర్ నగర్ మార్కెట్ ను మూసివేశారు.

రకరకాల ప్రతికూల పరిస్థితుల్లోనూ ముంబైలో డబ్బావాలాలు తమ సేవలందిస్తుంటారు. కరోనా నేపథ్యంలో వారు సైతం తమ సేవలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది అద్దం పడుతుంది. వివిధ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలు వెల్లడించేందుకు మరో 45 రోజుల గడువును సెబీ ప్రకటించింది. ఇది ఆయా కంపెనీలకు కొంత ఊరటనిచ్చే అంశమే. కొన్ని కంపెనీలు షట్ డౌన్ ను అమలు చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. ఇక ఈ వారంతం నాటికి దేశవ్యాప్తంగా 49 అదనపు టెస్టింగ్ సెంటర్స్ అందుబాటులోకి రానున్నాయి. కరోనా బాధితులను గుర్తించడంలో ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి. ఒక్కో రాపిడ్ టెస్టింగ్ లేబొరేటరీ ఒక్క రోజులో 1400 శాంపిల్స్ పరీక్షిస్తుంది.

కరోనా పై విదేశాల్లో జనం భయపడుతున్నంతగా భారత్ లో ప్రజలు భయపడడం లేదు. కొన్ని రోజుల పాటు ప్రజలంతా ఇళ్ళకే పరిమితమైతే తప్ప కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ కఠిన చర్యలతోనైనా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories