logo
ప్రపంచం

Russia: పుతిన్‌పై రష్యన్లకు పెరిగిన విశ్వాసం

Increased Confidence of Russians in Vladimir Putin
X

పుతిన్‌పై రష్యన్లకు పెరిగిన విశ్వాసం 

Highlights

Russia: రష్యన్ ప్రజా అభిప్రాయ పరిశోధన కేంద్రం సర్వే

Russia: ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పలు దేశాలు కఠిన ఆంక్షలను విధించాయి. రష్యాను దౌత్యపరంగా ఏకాకిని చేశాయి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా దూసుకెళ్తున్నారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై రివర్స్‌లో పుతిన్‌ ఆంక్షలు విధించారు. ఇదంతా ఒకెత్తయితే రష్యా ప్రజలు మాత్రం ఉక్రెయిన్‌పై దూకుడును పుతిన్‌ చర్యలను సమర్థిస్తున్నారు. రష్యన్ ప్రజా అభిప్రాయ పరిశోధన కేంద్రం చేపట్టిన సర్వేలో పుతిన్‌పై పౌరుల్లో విశ్వాసం గణనీయంగా పెరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి 81 శాతం మంది మద్దతు పలికారు.

ఉక్రెయిన్‌ యుద్ధం 46 రోజులకు చేరుకుంది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో రష్యా దాడులు కొనసాగిస్తోంది. పుతిన్‌ సేనలను ఎక్కడికక్కడ ఉక్రెయిన్‌ బలగాలు అడ్డుకుంటున్నాయి. మరోవైపు బుచా నగరంలోని మారణకాండపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రష్యాపై మరిన్నిఆంక్షాలను విధించాయి. తాజాగా ఐక్యరాజ్యసమితిలోని మానవహక్కుల మండలి విభాగం నుంచి రష్యాను బహిష్కరించాయి. 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలిలో తీర్మానానికి అనుకూలంగా 93 దేశాలు, 24 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్‌ సహా 58 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. దీంతో రష్యా సభ్యత్వాన్ని తొలగించినట్టేనని యూఎన్‌ అభిప్రాయపడింది. అంతకుమందు తమకు వ్యతిరేకంగా ఓటిస్తే తమతో శత్రుత్వం పెట్టుకున్నట్టేనని రష్యా హెచ్చరించింది. అయినా కౌన్సిల్‌లో సభ్య దేశాలు మాత్రం రష్యాకు వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం.

అయితే రష్యాపై ప్రపంచ దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా రష్యన్లు మాత్రం పుతిన్‌కు మద్దతు పలుకుతున్నారు. తాజాగా రష్యన్‌ ప్రజాభిప్రాయ పరిశోధన కేంద్రం చేపట్టిన సర్వే ఈ విషయం వెల్లడిస్తోంది. పాశ్యాత్య దేశాలకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌పై పుతిన్‌ దాడికి ఆదేశించడాన్ని 81 శాతం మంది రష్యన్‌ ప్రజలు ఆమోదించారు. ఫిబ్రవరి 24కు ముందు పుతిన్‌పై 64 పాయింట్‌ 3 శాతం మందికే విశ్వాసం ఉండేది. అయితే ఫిబ్రవరి 24 నుంచి రష్యా దాడులు చేపట్టిన తరువాత.. పుతిన్‌పై మరింత విశ్వాసం పెరిగినట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. తాజా సర్వేలో పుతిన్‌పై 81 శాతం మందికి విశ్వాసం పెరిగినట్టు తేలింది. అయితే 19 శాతం మంది మాత్రం పుతిన్‌పై నమ్మకం కోల్పోయారు. 2014లో ఉక్రెయిన్‌ ఆధ్వర్యంలోని క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అప్పట్లో కూడా ప్రపంచ దేశాలు రష్యాను వ్యతిరేకించాయి. అయితే రష్యా ప్రజలు మాత్రం అప్పట్లో కూడా సమర్థించడం గమనార్హం.

ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాలో పలు మీడియా సంస్థలు మూతపడ్డాయి. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా సంస్థలపై కొరడా పుతిన్ కొరడా ఝులిపించారు. అంతేకాకుండా విదేశీ మీడియాతో పాటు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌ న్యూస్‌ వంటి ప్రధాన సామాజిక మాద్యమాలను గత నెలలో రష్యా బ్లాక్‌ చేసింది. రష్యన్‌ ప్రజాభిప్రాయ పరిశోధన కేంద్రం ప్రభుత్వానికి చెందినది కావడంతో దానిపై విమర్శలు కూడా వస్తున్నాయి. పుతిన్‌ ఆదేశాల మేరకే సదరు సర్వేలు ఉంటాయని కేవలం పుతిన్‌ పార్టీకి చెందిన కార్యకర్తల అభిప్రాయాన్నే దేశ ప్రజలు అభిప్రాయంగా రుద్దుతున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమైన సమయంలో మాస్కోతో పాటు పలు నగరాల్లో ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన దృశ్యాలు సోష‌ల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రష్యా ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉక్రెయిన్‌పై దాడులను రష్యా సైనిక చర్యగా అభివర్ణిస్తోంది. అయితే పాశ్యాత్య దేశాలు మాత్రం ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు పాల్పడిందని పేర్కొంటున్నాయి. రెండో ప్రపంచ యుద్దం తరువాత అతి పెద్ద మానవ సంక్షోభం ఉక్రెయిన్‌లో నెలకొంది. ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం లెక్కల ప్రకారం 43 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు పొరుగున ఉన్న దేశాలకు వలసవెళ్లిపోయారు. దేశంలో 71 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు రష్యా దాడుల్లో సుమారు 8వేల మందికి పైగా పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్‌ ప్రభుత్వం చెబుతోంది. రెండ్రోజుల క్రితం రైల్వే స్టేషన్‌పై రష్యా నిర్వహించిన మిస్సైల్‌ దాడిలోనూ 50 మందికి పైగా పౌరులు మృతి చెందారు. ఈ దాడిని కూడా తాము చేయలేదని మాస్కో ప్రకటించడం గమనార్హం.

ఉక్రెయిన్‌లోని రష్యా బలగాలను నడిపించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజాగా కొత్త జనరల్‌ను నియమించారు. ఉక్రెయిన్‌పై దాడులు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Web TitleIncreased Confidence of Russians in Vladimir Putin
Next Story