Top
logo

కరోనా వ్యాక్సిన్ రాకపోతే.. ప్లాన్-బి సిద్ధం చేసుకోవాలి!

కరోనా వ్యాక్సిన్ రాకపోతే.. ప్లాన్-బి సిద్ధం చేసుకోవాలి!
X
Highlights

కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రపంచం ఇప్పుడు టీకా వైపు ఆశగా చూస్తోంది. టీకా ఒక్కటే కరోనా మహమ్మారి వ్యాప్తిని ...

కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రపంచం ఇప్పుడు టీకా వైపు ఆశగా చూస్తోంది. టీకా ఒక్కటే కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలదని బలంగా విశ్వసిస్తోంది. అసలు టీకా వస్తుందా..? వస్తే ఎప్పటిలోగా వస్తుంది..? వచ్చిన టీకా సమర్ధవంతంగా పని చేస్తుందా..? ఒక వేళ టీకా రానట్లయితే పరిస్థితి ఏంటి భవిష్యత్ పరిణాలపై నిపుణులు భిన్నరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, జర్మనీ ఛాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌ వంటి వారు సైతం కరోనా వైరస్ కట్టడికి టీకా వస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. టీకా తయారీలో దాదాపు 100కు పైగా కంపెనీలు తలమునకలై ఉన్నాయి. అయితే వైరస్ టీకా ఎప్పుడు వస్తుందని కచ్చితంగా చెప్పకపోయినా.. టీకా సురక్షితం అంటున్నారు లండన్ కు చెందిన వైద్యనిపుణులు. ఏ టీకాను కూడా ఏడాది ఏడాదిన్నర లోపు పూర్తిగా అభివృద్ధి చేయలేమంటున్నారు.

కరోనా వైరస్ కు అసలు టీకా అనేది రాకపోతే ప్లాన్-బీకి అమలు చేయడానికి ప్రభుత్వాలు రెడీగా ఉండాలని చరిత్ర చెబుతోంది. గతంలో వెలుగు చూసిన ఎన్నో వైరస్ లకు టీకాలు రాలేదు అయినా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో వాటికి అడ్డుకట్ట వేశారని గుర్తు చేస్తున్నారు వైద్యనిపుణులు. అప్పట్లో ఎక్కడా జీవన యానం నిలిచిపోలేదంటున్నారు. అయితే వీటన్నిటి కంటే కరోనా వైరస్ భిన్నమైందని ఒక వేళ దీనికి టీకా అందుబాటులోకి రాకపోతే జీవన విధానం గతంలో మాదిరిగా ఉండే అవకాశం లేదంటున్నారు. కరోనా వైరస్ పరీక్షలు, క్వారంటైన్‌లు, ఐసోలేషన్లు మానవ జీవితంలో భాగమైపోతాయని చెబుతున్నారు.

కరోనా వైరస్ కు చికిత్స వచ్చినా ఏటా ఎక్కడో ఒక చోట కరోనా వైరస్ బుస కొడుతూనే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ నుంచి ప్రజలు, సమాజం తప్పించుకుంటూ జీవనం కొనసాగించే విధంగా సిద్ధపడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 1984లో హెచ్ఐవీ మహమ్మారికి టీకాను సిద్ధం చేసి ప్రయోగాలు మొదలు పెడతామని నమ్మకంగా చెప్పారు. దాదాపు 36 ఏళ్లు గడిచిపోయినా టీకా రాలేదు. దాదాపు హెచ్ఐవీ సోకి 3.2 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎయిడ్స్‌ భయం నుంచి సమాజం ఇప్పటికీ కోలుకోలేదు.

ఒక్క హెచ్ఐవీకే కాదు అ తర్వాత వచ్చిన డెంగీ, రైనో వైరస్‌, అడెనో వైరస్‌లకు కూడా టీకాల్లేవు. హెచ్‌ఐవీ వంటి వైరస్‌లకు టీకాలు రాకపోయినా యాంటీవైరల్‌ ఔషధాలను అభివృద్ధిచేసి బాధితుల ఆయుష్షును పెంచిన విధంగా కరోనా కట్టడికి టీకా తయారీలో పరిష్కారం లభించకపోతే చికిత్స విధానంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు ఔషద రంగ నిపుణులు.

కరోనా బారిన పడిన వారిని కాపాడటం కోసం ముందు జాగ్రత్త ఔషధాలను అభివృద్ధి చేస్తున్నారు. ఎబోలా ఔషధం రెమిడెసివిర్‌, ప్లాస్మా చికిత్స, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వంటి వాటిని తాత్కాలికంగా చికిత్సలకు ఉపయోగిస్తున్నారు. మొదట వీటి ప్రయోగాలకు శాస్త్రవేత్తల నుంచి విముఖత వచ్చినా కొన్ని సానుకూల ఫలితాలు వస్తుండటం రోగులు కోలుకొనే సమయాన్ని కుదించి వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గిస్తున్నందున ప్రభుత్వాలు పచ్చజెండా ఊపుతున్నాయి. ఈ చికిత్స విధానాలు సమాజంలో భయాలను తగ్గించి సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉపయోగపడతాయని ఆలోచన చేస్తున్నారు. ముందు జాగ్రత్త వ్యూహంలో భాగంగా ప్లాన్-బికి సిద్దం కావాలని పాలకులు ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ప్రజల మద్యకు వెళ్లే వారు తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Web Titleif the original vaccine for the coronavirus does not arrive governments should be prepared to implement Plan-B
Next Story