Deadly Virus: మూడు రోజుల్లోనే మనిషిని చంపేసే అత్యంత ప్రమాదకర వైరస్‌ను చైనా ఎలా తయారుచేసింది?

How Did China Make The Most Dangerous Virus That Can Kill A Human In Three Days?
x

Deadly Virus: మూడు రోజుల్లోనే మనిషిని చంపేసే అత్యంత ప్రమాదకర వైరస్‌ను చైనా ఎలా తయారుచేసింది?

Highlights

Deadly Virus: మనుషులను మూడు రోజుల్లోనే చంపేసే ఒక కొత్త వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో సృష్టించారు.

మనుషులను మూడు రోజుల్లోనే చంపేసే ఒక కొత్త వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో సృష్టించారు.

చైనాలోని హెబేయీ యూనివర్సిటీలో ఈ పరిశోధన జరిగింది. ప్రాణాంతక ఎబోలా వైరస్ ఎలా పనిచేస్తుందో దగ్గర నుంచి పరిశీలించేందుకు, కొత్త చికిత్సా మార్గాలు కనిపెట్టేందుకు ఈ కొత్త వైరస్‌ను తయారుచేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ఇలాంటి పరిశోధనల వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై ‘సైన్స్ డైరెక్ట్’ జర్నల్‌లో ఓ కథనాన్ని ప్రచురించారు.

ఎలా తయారుచేశారు?

ప్రాణాంతక ఎబోలా వైరస్‌లోని కొన్ని భాగాలను తీసుకొని తాజా వైరస్‌ను తయారుచేశారు.

ఈ పరిశోధన కోసం మొదటగా వెసికులర్ స్టొమటైటిస్ వైరస్ (వీఎస్‌వీ)లను తీసుకున్నారు. ఎబోలా వైరస్ నుంచి తీసుకొచ్చిన గ్లైకోప్రోటీన్ (జీపీ) దీనికి జత అయ్యేలా మార్పులు చేశారు.

ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించి, కణాలకు ఇన్ఫెక్షన్ సోకడంలో ఈ గ్లైకోప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఎబోలా వైరస్‌ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, లక్షణాలు ఒక్కొక్కటిగా ఎలా వస్తాయో కనుక్కోవడమే లక్ష్యంగా తాజా వైరస్‌ను సృష్టించారు.

వేటిపై ప్రయోగం జరిగింది?

ఈ వైరస్‌ను సిరియన్ హేమ్‌స్టర్‌లపై ప్రయోగించారు. వీటిలో ఐదు మగ జీవులు, ఐదు ఆడ జీవులు ఉన్నాయి.

మనుషులకు ఎబోలా వైరస్‌ సోకినప్పుడు కనిపించే లక్షణాలే.. కొత్త వైరస్‌ను ఎక్కించిన అనంతరం హేమ్‌స్టర్‌లకు వచ్చాయి.

సిస్టమిక్ డిసీజ్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు ఆ జీవుల్లో కనిపించాయి.

మొత్తంగా మూడు రోజుల్లోనే ఆ జీవులన్నీ చనిపోయాయి.

కొన్ని హేమ్‌స్టర్‌లకు కళ్లలో నుంచి ద్రవాలు కూడా కారాయి. దీంతో వాటి కంటి చూపు మసకబారింది. ఎబోలా వైరస్ సోకినప్పుడు కూడా మనుషుల్లో ఇలాంటి కంటి సమస్యలే కనిపిస్తాయి.

బీఎస్ఎల్-4 ప్రయోగశాల లేకుండానే..

అత్యంత సురక్షితమైన బయోసేఫ్టీ లెవల్ -4 (బీఎస్‌ఎల్-4) ప్రయోగశాలల అసవరం లేకుండానే జంతువుల్లో ఎబోలా వైరస్‌ లక్షణాలను తీసుకొచ్చి, వాటిని దగ్గరుండి పరిశీలించడం కూడా ఈ ప్రయోగ లక్ష్యాల్లో ఒకటి.

వాస్తవానికి ఎబోలాపై పరిశోధనకు అత్యంత సురక్షితమైన ల్యాబ్‌లు అవసరం. కానీ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో బీఎస్ఎల్-2 ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయి.

అయితే, అత్యంత సురక్షితం కాకపోయినా కాస్త సురక్షితమైన ల్యాబ్‌లో ప్రయోగాలు చేపట్టే మోడల్‌ను తయారుచేయాలని తాజా పరిశోధనలో భావించారు.

తాజా పరిశోధన అనంతరం ఎబోలా పరిశోధనలు మరిన్ని దేశాల్లో చేపట్టేందుకు, కొత్త చికిత్సల తయారీకి బాటలు పరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చనిపోయిన హేమ్‌స్టర్‌లను ఏం చేశారు?

ఇన్ఫెక్షన్ సోకడంతో చనిపోయిన హేమ్‌స్టర్‌ల అవయవాలను పరిశోధకులు పరిశీలించారు. వైరస్‌ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు వీటిపై అధ్యయనం చేపట్టారు.

గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కడుపు, పేగులు లాంటి కీలకమైన అవయవాల్లో ఈ వైరస్ స్థాయిలు పెద్దయెత్తున పరిశోధకులకు కనిపించాయి.

దీంతో భిన్న అవయవాలు ఒకేసారి ఎలా విఫలం అవుతున్నాయో పరిశోధకులకు అవగాహన వచ్చింది.

వ్యాక్సీన్ల తయారీకి

ఎబోలాపై అధ్యయనానికి ప్రీక్లినికల్ ఎవాల్యుయేషన్ మెథడ్ (పీఈఎం)ను తాజా పరిశోధన అందిస్తోంది. అంటే తక్కువ కాలంలోనే పరిశోధనలకు ఇది బాటలు పరుస్తోంది.

దీంతో కొత్త చికిత్సా విధానాలు, వ్యాక్సీన్ల తయారీకి ఇది మార్గం సుగమం చేస్తోంది.

అయితే, ప్రస్తుతం ఇలాంటి పరిశోధనలు నిర్వహిస్తున్నందుకు కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన, నైతిక పరమైన అంశాలపై నిపుణులు ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఆందోళన ఎందుకు?

ఇలాంటి పరిశోధనలు నిర్వహించేటప్పుడు కఠినమైన పర్యవేక్షణ ఉండాలని, పారదర్శకమైన నైతిక మార్గదర్శకాలను అందరూ పాటించేలా చూడాలని నిపుణులు కోరుతున్నారు.

అయితే, ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఎబోలా కూడా ఒకటి. దీని మరణ రేటు, తీవ్రమైన లక్షణాలు నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చివరిసారిగా 2014, 2016 మధ్య ఎబోలా చాలా దేశాల్లో విజృంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వేల మంది దీని వల్ల మృత్యువాత పడ్డారు.

ఇలాంటి ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు అత్యవసర చికిత్సలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా గతంలో నొక్కి చెప్పింది.

ల్యాబ్ లీక్ అయితే...

ఇలాంటి పరిశోధనల్లో వైరస్‌లు ల్యాబ్‌ల నుంచి లీక్ అయ్యే ముప్పు ఉంటుంది. వాస్తవానికి కోవిడ్-19కు కారణమయ్యే కరోనావైరస్‌ కూడా ఇలానే ల్యాబ్ నుంచి లీకయ్యిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలు నిరాధారమైనవని చైనా చెబుతూ వచ్చింది.

ఎలాంటి లీక్‌లకూ అవకాశం లేకుండా అత్యంత పకడ్బందీగా ఈ పరిశోధన చేపట్టామని చైనా పరిశోధకులు చెప్పినట్లు సైన్స్‌ డైరెక్ట్ తెలిపింది.

‘‘ఎబోలా వైరస్‌ ఎలా పనిచేస్తుందో వివరించే సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణహితమైన మోడల్‌ను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దీనిలో మేం విజయం సాధించాం కూడా’’ అని పరిశోధకులు చెప్పినట్లు సైన్స్ డైరెక్ట్ వివరించింది.

అయితే, ఈ వైరస్ ఒకసారి ల్యాబ్ నుంచి లీకై ఎవరికైనా సోకితే మూడు రోజుల్లోనే సదరు వ్యక్తి మరణించే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి పరిశోధనలు అత్యంత సురక్షితమైన బీఎస్ఎల్-4 ప్రయోగశాలల్లోనే చేపట్టాలని, అప్పుడే ప్రాణాంతక వైరస్‌లు లీకయ్యే ముప్పు తగ్గుతుందని వివరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories