ఉద్రిక్తత... ఆందోళన!

ఉద్రిక్తత... ఆందోళన!
x
Highlights

ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరన్నది ఇంకా తేలలేదు. డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ మేజిక్‌ మార్క్‌ 270ని దాటేస్తారనే అంచనా...

ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరన్నది ఇంకా తేలలేదు. డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ మేజిక్‌ మార్క్‌ 270ని దాటేస్తారనే అంచనా ఉన్నా.. నాలుగేళ్ల కిందట ఫలితాల్లానే ఈసారీ అద్భుతం జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు రిపబ్లికన్లు.

ఊహించినట్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ-భరిత క్లైమాక్స్‌ దిశగా వెళుతున్నాయి. ట్రంప్‌,జో బైడెన్‌ మధ్య నువ్వా-నేనా అన్న పరిస్థితి నెలకొంది. అధ్యక్ష రేసులో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. అత్యంత కీలకమైన 6 ప్రభావ రాష్ట్రాల్లో గెలిచిన వారికే అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలుండగా మిషిగన్‌, విస్కాన్‌సన్‌ రాష్ట్రాలు ఇప్పటికే బైడెన్ వశమయ్యాయి. పెన్సిల్వేనియాలో ఇప్పటికీ ఫలితం తేలలేదు. ఇక్కడ ట్రంప్‌కు ఆధిక్యం ఉంది. ఇక కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాలు నార్త్‌ కరోలినా, జార్జియా, నెవడాల్లోనూ ఇప్పటికీ ఫలితం రాలేదు. పెన్సిల్వేనియాలో కౌంటింగ్‌కు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. నార్త్ కరోలినాలో 15 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అక్కడ ఓట్ల లెక్కింపు ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. దీంతో గెలుపెవరిని వరిస్తుందనేది సస్పెన్స్‌గానే ఉంది.

ఇక స్వింగ్ స్టేట్స్‌ను మినహాయిస్తే మిగిలిన చోట్ల బైడెన్‌‌ విజయం అందుకున్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కొలరాడో, కనెక్టికట్‌, ఇల్లినాయి, డెలావేర్‌, మసచుసెట్స్‌, న్యూమెక్సికో, వెర్మాంట్‌, వర్జీనియాల్లో విజయం సాధించారు. ట్రంప్‌ కీలకమైన ఫ్లోరిడా, టెక్సస్‌, అయోవా, ఓహియోలో అనూహ్య విజయాలు సాధించారు. ఫ్లోరిడా, టెక్సాస్‌లో ఆయన లాటినోల మద్దతు గెలిచారు. వీటితో పాటు అలబామా, ఆర్కాన్సస్‌, కెంటకీ, లూసియానా, మిసిసిపీ, నెబ్రాస్కా, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, టెన్నెస్సీ, ఓక్లహామా, వెస్ట్‌ వర్జీనియా, ఇండియానా, వ్యోమింగ్‌, సౌత్‌ కరోలినాల్లో ట్రంప్‌ గెలుపొందారు. అయితే ట్రంప్ గెలిచిన రాష్ట్రాలన్నీ తక్కువ ఎలక్టోరల్‌ ఓటర్లున్నవే కావటంతో ట్రంప్ బైడెన్‌ కంటే వెనుకబడ్డారు.

ప్రపంచానికి పెద్దన్నను నిర్ణయించే ఫలితాలపై యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ట్రంప్ రావాలని కొన్ని దేశాలు బైడెన్ గెలవాలని మరికొన్ని దేశాలు ఆశిస్తున్నాయి. భారత్‌ విషయానికి వస్తే ట్రంప్ గెలిస్తేనే అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనాకు వ్యతిరేకి అయిన ట్రంప్‌ ఓడిపోతే చైనా విస్తరణవాద కాంక్షకు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి అగ్రరాజ్యం మద్దతు ఇప్పుడున్న స్థాయిలో ఉండదు.

పాకిస్థాన్‌ పట్ల కూడా ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారు. బైడెన్‌ మాత్రం పాక్‌ పట్ల ఉదారంగా ఉంటారు. పాక్‌కు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన చేసిన బైడెన్‌కు 2008లో ఆ దేశం హిలాల్‌-ఎ-పాకిస్థాన్ పురస్కారంతో గౌరవించింది పాక్‌. జమ్మూకశ్మీర్‌, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక వంటి అంశాలపై బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే పాక్‌ బైడెన్‌ గెలుపును కోరుకుంటోంది.

అయితే ట్రంప్‌ మళ్లీ గెలిస్తే పాక్‌ పట్ల మరింత వ్యతిరేకతతో ప్రవర్తించవచ్చని, బైడెన్‌ గెలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇమ్మిగ్రెంట్స్ విషయానికి వస్తే బైడెన్ గెలిస్తేనే అనుకూలమనే భావన వ్యక్తమవుతోంది. జాతీయవాద రాజకీయాలు చేస్తున్న రిపబ్లికన్‌ పార్టీ అమెరికన్లకే ప్రాధాన్యమిస్తుంది. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ వ్యవహారశైలి కూడా ఇందుకు నిదర్శనంగా నిలిచింది. దీంతో బైడెన్ గెలిస్తే ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories