ప్రపంచ ఈ దుస్థితికి కారణం ముమ్మాటికీ చైనాయే కారణం : జర్మన్ పత్రిక ఘాటు వ్యాఖ్యలు

ప్రపంచ ఈ దుస్థితికి కారణం ముమ్మాటికీ చైనాయే కారణం : జర్మన్ పత్రిక ఘాటు వ్యాఖ్యలు
x
china president (file image)
Highlights

కరోనా అనే పేరు వింటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేపేరు చైనా. ఆ దేశం ఎంత మొత్తుకున్నా.. కోవిడ్-19 అనే వైరస్ ను అంటే కరోనా ను చైనా వైరస్ అనే...

కరోనా అనే పేరు వింటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేపేరు చైనా. ఆ దేశం ఎంత మొత్తుకున్నా.. కోవిడ్-19 అనే వైరస్ ను అంటే కరోనా ను చైనా వైరస్ అనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంభోదిస్తున్నారు. అంతర్జాతీయ మర్యాద కోసం కొన్ని దేశాలు.. చైనాతో ఉన్న స్నేహబంధం కోసం మరికొన్ని రాజ్యాలు.. నలుగురితో పోవాల్సిన పరిస్థితిలో ఉన్న మరిన్ని సమూహాలు చైనా చేసిన పని పై కక్కలేక మింగలేక వ్యవహరిస్తున్నాయి.

అయితే, అంతర్జాతీయంగా మీడియా అలా ఉండదు. కొన్ని విషయాలను విస్పష్టంగా తమదైన శైలిలో ప్రశ్నిస్తుంది. సరిగ్గా అపనే చేసింది జర్మనీ నుంచి వెలువడే అతిపెద్ద పత్రిక 'బిల్డ్'. ఆ పత్రిక కరోనా వైరస్ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యవహార శైలిని కడిగిపాడేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మదిలో రేకెత్తుతున్న ప్రశ్నల్ని నిర్మొహమాటంగా అడిగేసింది. ది జేరుసేలెం పోస్ట్ వెబ్సైట్ కథనం ప్రకారం బిల్డ్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ జూలియన్ రీచెల్ట్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఉద్దేశించి ఏమన్నారో వివరంగా..

'' బెర్లిన్ లోని మీ రాయబార కార్యాలయం నాకు ఒక బహిరంగ లేఖ రాసింది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న నష్టానికి చైనా జవాబుదారీ అంటూ మేము ప్రచురించిన కథనాన్ని తప్పుపడుతూ ఈ లేఖ రాశారు. అయితే, మేము ఆ కథనానికి కట్టుబడి ఉన్నాం. కేవలం మీ (జిన్ పింగ్) ప్రభుత్వం, సైంటిస్టులు చేసిన తప్పిదమే ఇది. చాల కాలం క్రితమే కరోనా వైరస్ తో మానవాళికి వచ్చే ముప్పు మీకు తెలుసు. అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టారు. మీ జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, మీ దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మీరు ఆ తప్పు చేశారు. వుహాన్ లో ఏం జరుగుతోందన్న విషయాన్ని పాశ్చాత్య దేశాల పరిశోధకులు ప్రశ్నించినప్పటికీ మీరు ఆ కారణంతోనే సరిగా స్పందించలేదు.''

'' మీ పాలన మొత్తం నిఘాతోనే సాగుతుంది. ప్రజల మీద నిఘా ఉంటుంది. దేశంలోకి వచ్చేపోయే వారిమీద నిఘా ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే నిఘా వ్యవస్థ లేకుండా మీరు పాలనా చేయలేరు. అటువంటిది ఒక మాంశాహార బజారులో జరుగుతున్నా విషయాలను మీరు మానిటర్ చేయలేకపోయారు. కాదు.. మీరు ఆ మార్కెట్ ను మానిటర్ చేయడానికి ఇష్టపడలేదు. మీరు మీ దేశంలో మీకు నిజాల్ని చెప్పే పత్రికలను, వెబ్సైట్ లను నిర్దాక్షిణ్యంగా మూసివేయిస్తారు. కానీ, మానవాళికి చేటు చేసే గబ్బిలాల సూపును అమ్మకానికి పెట్టె స్టాల్స్ ను మాత్రం యధేచ్చగా వదిలేస్తారు. దీంతో మీ ప్రజల ప్రాణాల్ని పణంగా పెడతారు. అలాగే ఇప్పుడు ప్రపంచ మానవాళి ప్రాణాల మీదకు తెచ్చారు.''

అయన ఇంకా ఈ విధంగా చైనా విధానాలను తూర్పార పట్టారు..

''నిఘా అనేది ప్రజల స్వేచ్చను తిరస్కరించడం. ఏ జాతి అయితే, స్వేచ్చను కోల్పోతుందో ఆ జాతి సృజనాత్మకతను కూడా కోల్పోతుంది. వినూత్న ఆవిష్కరణలకు ఆ జాతి దూరంగా ఉండిపోతుంది. అందుకే మీ దేశం మేధోసంపత్తిని దొంగిలించడంలో ప్రపంచ చాంపియన్ గా మారిపోయింది.''

''చైనా దేశం ఇతరుల ఆవిష్కరణల మీద సుసంపన్నం అయింది తప్ప తన దేశపు సృజనాత్మకత మీద కాదు. దీనికి కారణం మీదేశంలో యువత ను మీరు స్వేచ్చగా ఆలోచించే అవకాశం ఇవ్వరు. చైనా దేశపు గొప్ప ఎగుమతి ఏదైనా ఉందంటే అది కరోనా వైరస్ మాత్రమే. విచిత్రం ఏమిటంటే ఇది ఎవరూ కోరుకోనిది. కానీ మీరు ప్రపంచానికి అందించింది.'' అంటూ చైనా అధ్యక్షుడిపై బిల్డ్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ జూలియన్ రీచెల్ట్ పై విరుచుకు పడ్డారు.

అసలు ఏం జరిగిందంటే..

అంతకు ముందు కరోనా వైరస్ చైనా వైరస్ అంటూ బిల్డ్ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. దీనిని ఖండిస్తూ బెర్లిన్ లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి టావో లిల్ తమ రాయబార కార్యాలయ వెబ్ సైట్ లో ఒక బహిరంగ లేఖను ప్రచురించారు. ఆ లేఖలో ఆమె బిల్డ్ పత్రికలో వచ్చిన కథనాన్ని తప్పు పట్టారు. ప్రపంచం మొత్తం ప్రభావితం చేస్తున్న ఒక మహమ్మారి గురించి ఒక దేశాన్ని తప్పు పట్టడం సరికాదంటూ ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో బిల్డ్ కథనంలో కొన్ని నిజాలను విదిచిపెట్టేశారు అని ఆమె అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా వ్యాప్తిని గురించి మేము ప్రపంచాన్ని అప్రమత్తం చేశాం అని ఆ లేఖలో చెప్పుకొచ్చారు.

ఈ లేఖలో పేర్కొన్న అంశాల పై ప్రతిస్పందిస్తూ బిల్డ్ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ పై విధంగా ప్రతిస్పందించారు. అంతే కాకుండా, అయన ''మీ వూహాన్ పరిశోధన శాలలో గబ్బిలాల్లో కరోనా వైరస్ కు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు. అయితే, అటువంటి పరిశోధనలు జరుగుతున్న ప్రాంతంలో తీసుకోవాల్సిన పటిష్టమైన జాగ్రత్తలు మీరు తీసుకోలేదు. మీ కారాగారాల్లో రాజకీయఖైదీలకు ఇచ్చినంత సురక్షితమైన విధానం ఎందుకని ప్రయోగశాలలో కల్పించాలేకపోతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విధవలుగా మారిన వారు.. తల్లులు, పిల్లలు, తండ్రులు ఇలా తమ బంధు వర్గాన్ని కోల్పోయిన వారికి మీరేం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.

''ఇప్పుడు మీ దేశ ప్రజలు కూడా మీగురించి తక్కువగానే మాట్లాడుకుంటున్నారు. మీరు ఒక శక్తి ఉడిగిన నాయకుడిగా మారిపోయారని వారనుకుంటున్నారు. కరోనాకు ముందు చైనా ను నిఘాదేశంగా పిలిచే వారు. ఇపుడు చైనాని ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధిని వదిలిన దేశంగా పిలుస్తారు. ఇదే మీ రాజకీయ వారసత్వంగా మిగిలిపోనుంది.'' అంటూ బిల్డ్ పత్రిక తన కథనం ముగించింది.

మొత్తమ్మీద చైనాలో పుట్టిన కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా చేసిన పెను తప్పిదం ఇప్పుడు ప్రపంచ మానవాళిని బలితీసుకోవడమే కాకుండా.. ప్రపంచంలోని అన్ని వ్యవస్థలనూ సర్వ నాశనం చేసేస్తోంది. చరిత్రలో చైనా చేసిన ఈ తప్పిదానికి (తప్పిదమా? కావాలని చేసిందా?) ప్రపంచం మొత్తం మారిపోయే పరిస్థితి వచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories