China and Turkey: రెండు దేశాల్లోనూ ప్రజల్లో అధ్యక్షుల తీరుపై ఆగ్రహం

Elections in 2023 in China and Turkey | Live News
x

China and Turkey: రెండు దేశాల్లోనూ ప్రజల్లో అధ్యక్షుల తీరుపై ఆగ్రహం

Highlights

China and Turkey: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సెంటిమెంట్లను రగులుస్తున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, టర్కీ అద్యక్షుడు ఎర్డొగన్‌

China and Turkey: రెండు దేశాల ఎన్నికలు మరో రెండు దేశాల గొంతులపై కత్తి పెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు అధ్యక్షులు పొరుగు దేశాలపై ఆక్రమణకు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఒకరు బఫర్‌ జోన్‌ పేరుతో మరొకరు అది తమ ప్రాంతమేనంటూ వాదిస్తూ యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నారు. ఏ క్షణంలో తమపై దాడి జరుగుతుందోనని ఆ రెండు దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతోనే ప్రపంచ దేశాలు కుదేలవుతుంటే మరో నాలుగు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోన్న టెన్షన్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.

కరోనా కల్లోలం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమవుతోంది. పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ జాబితాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా ఉంది. కరోనా సమయంలో దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తీసుకున్న నిర్ణయాలపై చైనాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీరో కోవిడ్‌ నిబంధన పేరుతో నరకం అంటే ఎలా ఉంటో జిన్‌పింగ్‌ ప్రభుత్వం ప్రజలకు చూపించింది. అంతేకాకుండా వరుస లాక్‌డౌన్లతో చైనా ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో పతనమైంది. దీంతో జిన్‌పింగ్‌పై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మూడోసారి జిన్‌పింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఎలాగైనా మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలని జిన్‌పింగ్‌ ప్లాన్‌ వేస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని దృష్టి మరల్చి వారిలోని సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ఎత్తులు వేశారు. అందుకు దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్‌ను ఆక్రమణనే అందుకు సరైనదని భావిస్తున్నారు.

ఈ క్రమంలో తైవాన్‌పై చైనా అధ్యక్షుడు జిన్పింగ్‌ ఒత్తిడి పెంచుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్ గగనతలంలోకి తరచూ బీజింగ్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తైవాన్‌కు సమీపంలోనే డ్రాగన్‌ సైనిక విన్యాసాలను చేపడుతోంది. దీంతో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తైవాన్‌ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తైవాన్‌కు అగ్రదేశం అమెరికా అండగా నిలుస్తోంది. తైవాన్ ఏమీ ఉక్రెయన్‌ కాదని కయ్యానికి కాలుదువ్వితే తమ సైన్యం రంగంలోకి దిగుతుందని బైడెన్‌ హెచ్చరించారు. తైవాన్‌ తమ అంతర్గత విషయమని చైనా దబాయిస్తోంది. తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోమంటూ అమెరికాను చైనా హెచ్చరిస్తోంది. వన్‌ చైనా వన్ పాలసీలోనూ తైవాన్‌ తమ భూభాగమని పేర్కొన్నామని.. అందుకు అమెరికా అంగీకరించిందని కూడా చెబుతోంది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ కంట్రీ భారీగా సైన్యాన్ని మోహరించింది.

టర్కీ అధ్యక్షుడు రెచప్ తయ్యిప్ ఎర్డొగన్ కూడా జిన్‌పింగ్‌ ఫార్ములానే అనుసరిస్తున్నారు. 2023లో టర్కీలోనూ ఎన్నికలు రానున్నాయి. కోవిడ్‌, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. చమురు ధరలు రోజురోజుకు పైపైకే పోతున్నాయి. ఫిబ్రవరి 21కి ముందు లీటరు పెట్రోలు 62 రూపాయలు ప్రస్తుతం ఆ ధర 90 రూపాయలకు చేరింది. దీంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరగడంతో ఆహార కొరత వేధిస్తోంది. దేశంలో అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తున్నారు. టర్కీ ప్రజలు సెంటిమెంట్‌గా భావించే అంశాలపై ఎర్డోగన్‌ దృష్టి సారించారు. అందులో భాగంగా టర్కీ పేరును తుర్కియెగా మార్చారు. నిత్యం తమ దేశంపై దాడులు చేస్తున్న సిరియా ఫైటర్ల అయిన కుర్దులపై టర్కీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో సిరియాపై సైనిక చర్యకు సిద్దమవుతున్నారు.

అమెరికా, రష్యాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కానీ విచిత్రంగా సిరియాకు మాత్రం ఈ రెండు మిత్ర దేశాలు సిరియాపై సైనిక చర్యకు టర్కీ మిత్రదేశమైన అమెరికానే వ్యతిరేకిస్తోంది. ఇక సిరియాపై రష్యా ఈగను కూడా వాలనివ్వదు. సిరియా విషయంలో 2015లో రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చేసింది. 2020లో ఇడ్లిబ్‌లో రష్యా, టర్కీ మధ్య వైమానికి దాడులు జరిగాయి. తాజాగా కూడా సిరియాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంపై సర్వశక్తులు ఒడ్డుతున్న రష్యా తమపై దాడికి రాదని ఎర్డోగన్‌ భావిస్తున్నారు. ఇక అమెరికా అభ్యంతరాలను స్వీడన్, ఫిన్లాండ్‌ నాటో సభ్యత్వంతో చెక్‌ పెడుతున్నారు. దీంతో దాదాపు సిరియాపై సైనిక చర్యకు ఎర్డోగన్‌ సర్వం సిద్ధం చేసుకున్నారు.

ఈ ఆక్రమణలు అటు తైవాన్‌, ఇటు సిరియా ప్రజలకు ప్రాణసంకటంగా మారనున్నాయి. జిన్‌పింగ్‌, ఎర్డొగన్‌ స్వార్థానికి ఆ రెండు దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు ఈ ఇద్దరి నేతల చర్యలతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో భయపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories