Pakistan: పాకిస్థాన్‌లో క్షీణిస్తున్న పరిస్థితులు.. పెళ్లి వేడుకలపై నిషేధం

Economic Crisis in Pakistan | Pakistan News
x

Pakistan: పాకిస్థాన్‌లో క్షీణిస్తున్న పరిస్థితులు.. పెళ్లి వేడుకలపై నిషేధం

Highlights

Pakistan: ఇస్లామాబాద్‌లో రాత్రి 10 గంటల తరువాత పెళ్లి వేడుకలపై నిషేధం విధించిన ప్రభుత్వం

Pakistan: దాయాది దేశంలో రోజు రోజుకు పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్న పాకిస్థాన్‌లో తాజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో రాత్రి పది గంటల తరువాత జరిగే పెళ్లి ఫంక్షన్లను నిషేధించింది. దేశ వ్యాప్తంగా రాత్రి 8 గంటలకే మార్కెట్లను మూసేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశంలో ముదురుతున్న ఆర్థిక మాంద్యానికి ఇవి గుర్తులుగా అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్థాన్‌లోనూ ప్రజలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందంటున్నారు.

భారత్‌పై నిత్యం విషం చిమ్మే పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు విషమంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్‌లా దూసుకెళ్తోంది. నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. పెట్రో ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే లీటరు ఇంధనంపై 60 రూపాయల మేర పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటరు పెట్రోలు ధర 209 రూపాయలు, డీజిల్ 204 రూపాయలు, కిరోసిన్ 181 రూపాయలు పలుకుతోంది. పెట్రో ధరలు పెరగడంతో రవాణా చార్జీలతో పాటు నిత్యవసర ధరలు కూడా కొండెక్కాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు, గ్యాస్ కొనుగోలుకు తగినంత నిధులు పాక్ వద్ద లేవని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా ప్రకటించారు. మే 6 నాటికి పాక్ వద్ద విదేశీ మారక నిధులు కేవలం వెయ్యి 10వేల కోట్ల డాలర్లే మిగిలినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపింది. ఈ నిధులను అత్యవసరాల కొనుగోలుకు పాక్ ప్రభుత్వం వాడుతోంది. కేవలం పెట్రోలు, గ్యాస్ కొనుగోలుకు వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రో, గ్యాస్, విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకుంటోంది.

పాకిస్థాన్‌లో నిత్యం 26వేల మెగా వాట్ల విద్యుత్ అవసరం. అయితే ఉత్పత్తి అవుతున్నది మాత్రం 22వేల మెగావాట్ల విద్యుత్తే. 4వేల మెగా వాట్ల విద్యుత్ లోటు నెలకొన్నది. తాజాగా దేశంలో విద్యుత్ కొరతను నివారించేందుకు పాక్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లను 8 గంటల లోపు మూసేయాలని వ్యాపారులకు షెహబాజ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఇస్లామాబాద్‌లో రాత్రి 10 గంటల తరువాత పెళ్లి వేడుకలపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని పాకిస్థాన్‌ విద్యుత్ శాఖ మంత్రి కుర్రమ్ దస్తగిర్ కోరారు. అలా చేస్తే భారీగా విద్యుత్ ఆదా అవుతుందని సూచించారు. అంతేకాకుండా వారంలో ఐదు రోజులు మాత్రమే పని దినాలను ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం కూడా సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రోజుకు రెండు గంటల కరెంటు కోతలను విధించింది.

2019 నుంచే పాకిస్థాన్‌లో పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయి. రోజురోజుకు పెరుగుతన్న ధరలను నియత్రించడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఏకమై.. ప్రధానమంత్రి పదవి నుంచి ఆయనను గద్దె దించాయి. ఇటీవల ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో పరిస్థితులు మరింత దిగజారాయి. కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ధరలను నియంత్రించలేక చేతులెత్తేశారు. మరోవైపు పాక్ వద్ద ఉన్న విదేవీ మారక నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. మిత్ర దేశాలై సౌదీ, ఇరాన్, చైనా నుంచి రుణాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా అప్పులను ఇచ్చేందుకు మిత్రదేశాలు ముందుకు రావడం లేదు. మరోవైపు అప్పు కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-ఐఎంఎఫ్‌ను పాక్ ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే పెట్రో, గ్యాస్, ఆయిల్, పామాయిల్ ధరలపై సబ్సిడీ ఎత్తివేయాలంటూ ఐఎంఎఫ్‌ షరతు విధించింది. పాక్ ప్రభుత్వానికి మరో అవకాశం లేకపోవడంతో ఐఎంఎఫ్ నిబంధనలకు అంగీకరించింది. అయితే సబ్సిడీ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించకపోయినా పది రోజుల వ్యవధిలో 60 రూపాయలను ప్రభుత్వం పెంచేసింది.

పాక్ ఆర్థిక పరిస్థితి క్రమంగా శ్రీలంక మార్గంలోనే పయనిస్తోంది. ఒకవేళ ఇప్పుడు ఐఎంఎఫ్ 3వేల కోట్ల డార్లను ఇచ్చినా అందులో 2వేల కోట్ల డాలర్లు రుణాల చెల్లింపునకే పోతాయి. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. మరోవైపు అప్పు పుట్టడం లేదు. దీంతో దేశం క్రమంగా సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఇదే అదనుగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెచ్చిపోతున్నారు. పెరుగుతున్న ధరలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ధరల విషయంలో ప్రజలను ఇమ్రాన్ రెచ్చగొడుతున్నారు. వెంటనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మనీలాండరింగ్ కేసు ప్రధాని షెహబాజ్ షరీఫ్ మెడకు చుట్టుకోనున్నది. షెహబాజ్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలంటూ దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికే న్యాయస్థానాన్ని కోరింది. ప్రస్తుతం ప్రధాని బెయిల్ గడువు మరో రెండ్రోజుల్లో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పాకిస్థాన్‌లో ఉత్కంఠ నెలకొంది.

మొత్తంగా చైనా దెబ్బతో అప్పుల పాలైన రెండో దేశంగా పాక్ నిలుస్తోంది. దక్షిణ ఆసియాలో శ్రీలంక తరువాత సంక్షోభం దిశగా పాక్ అడుగులు వేగంగా పడుతున్నాయి పొరగు దేశంలోనూ శ్రీలంక ప్రజల మాదిరిగా తిరుబాట్లు చెలరేగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణలు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్‌లో ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories