పునర్జన్మపై ఊపందుకున్న ప్రయోగాలు.. భవిష్యత్తులో నిజం చేస్తామంటున్న శాస్త్రవేత్తలు..

Cryonics Is Seeking To Defy Mortality
x

పునర్జన్మపై ఊపందుకున్న ప్రయోగాలు.. భవిష్యత్తులో నిజం చేస్తామంటున్న శాస్త్రవేత్తలు..

Highlights

Reincarnation: చనిపోయిన మనషి మళ్లీ ప్రాణం పోసుకుంటాడా? పునర్జన్మ సాధ్యమేనా?

Reincarnation: చనిపోయిన మనషి మళ్లీ ప్రాణం పోసుకుంటాడా? పునర్జన్మ సాధ్యమేనా? ఈ ప్రశ్నలు మనిషిని నిత్యం వేధిస్తున్నాయి. మరణించిన మనిషిని మళ్లీ బతికించే దిశగా.. అనాది నుంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఆ దిశగా ఎవరూ విజయం సాధించలేదు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు. అయితే భవిష‌్యత్తులో అది సాధ్యమేనంటున్నారు అమెరికన్‌ శాస్త్రవేత్తలు అందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మనిషి చనిపోయిన వెంటనే వారి శరీరాలను భద్రపరుస్తున్నారు. ఫ్యూచర్‌ టెక్నాలజీ మనిషికి జీవం పోస్తుందని నమ్ముతున్నారు. ఇంతకు శరీరాలను ఎలా భద్రపరుస్తున్నారు? అందుకు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారు? శరీరాలను కాపాడేందుకు ఎంత వసూలు చేస్తున్నారు?

చనిపోయిన మనిషి మళ్లీ జీవిస్తాడా? చనిపోయిన మనుషులను బతికించినట్టు మన పురాణాల్లో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పునర్జన్మ ఉందని ఎందరో నమ్ముతారు. పునర్జన్మ అంటే.. చనిపోయిన మళ్లీ పుట్టడమే.. కానీ... చనిపోయిన మనిషిని బతికించడం కూడా పునర్జన్మగానే భావిస్తారు. ఆ దిశగా ఎన్నో శతాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ దిశగా ఇప్పటికీ ఎవరూ విజయం మాత్రం సాధించలేదు. కానీ.. మనిషిని మళ్లీ బతికించడం సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు. శరీరాన్ని భద్రపరిచి.. వైద్యం చేసి.. పునర్జన్మ సాధించొచ్చని తేల్చి చెబుతున్నారు. భవిష్యత్తు టెక్నాలజీ మరణాన్ని జయిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పునర్జన్మను నమ్మేవారు కూడా.. రోజు రోజుకు పెరుగుతున్నారు. చనిపోయిన తరువాత తమ శరీరాలు పాడుకాకుండా భద్రపరుచుకుంటున్నారు. అందుకు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటివరకు 500 మందికి పైగా చేరారు. పునర్జన్మ ఉందని నమ్మి.. శరీరాన్ని భద్రపరుచుకునే వారికి కోసం ఓ కంపెనీ కూడా ఉంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో అల్కర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ ఫెసిలిటీ ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. చనిపోయిన తరువాత శరీరాలు పాడవకుండా దశాబ్దాల తరబడి కాపాడుతుంది ఇంతకు ఆ కంపెనీ శరీరాలను ఎలా కాపాడుతుంది? ఒక్కొక్కరికి ఎంత వసూలు చేస్తోంది? కేవలం మనుషుల శరీరాలకే భద్రత కల్పిస్తుందా? లేక జంతువుల శరీరాలకు కూడా రక్షణనిస్తుందా?

ఆల్కర్‌ పౌండేషన్‌ను లిండా, ఫ్రెడ్‌చాంబర్‌ లైన్‌ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని అందించే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు వాళ్లు చెబుతున్నారు. శరీరాలను రక్షించేందుకు ఈ సంస్థ విట్రిఫికేషన్‌ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మొదట శరీరం నుంచి రక్తాన్ని, ఇతర ద్రవాలను తొలగిస్తారు. కుళ్లిపోకుండా మంచు స్పటికలు ఏర్పడకుండా.. రసాయనాలతో శరీరాన్ని నింపేస్తారు. ఆ తరువాత ఆ మృతదేహాన్ని లిక్విడ్‌ నెట్రోజన్‌తో నిండిన ఒక స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ట్యాంకుల్లో ఉంచుతారు. దీన్ని క్రయో ప్రిజర్వ్‌ పద్దతి అంటారు. ఇందులో మృతదేహాలను మైనస్ 196 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు ఉంచుతారు. దీనివల్ల శరీర కణజాలాలు, ఇతర అవయవాలు పాడుకాకుండా ఉంటాయి. ఈ పద్దతిని క్రయోనిక్స్‌ అంటారు. 2014లో మృతి చెందిన బిట్‌కాయిన్ మార్గదర్శకుడు హాల్‌ ఫిన్ని శరీరాన్ని క్రయో ప్రిజర్వ్‌ చేశారు. 2015లో బ్రెయిన్ కాన్సర్‌తో చనిపోయిన థాయ్‌లాండ్‌కు చెందిన రెండేళ్ల మాథెరిన్‌ నవోరాట్‌పాంగ్‌ను కూడా అలాగే ఉంచారు. మాథెరిన్‌ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే.. తమ బిడ్డ ఎప్పటికైనా బతికొస్తుందని తల్లిదండ్రులు నమ్ముతున్నారు. వారు ఆల్కర్‌ ఫౌండేషన్‌ను సంప్రదించి పాపను క్రయో ప్రిజర్వ్‌ చేయించారు. ఇలా ఇప్పటివరకు అల్కర్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌ 199 మానవ శరీరాలను భద్రపరిచింది. ఈ సంస్థ శరీరాలను మాత్రమే కాదు కేవలం మెదడును కూడా భధ్రపరుస్తోంది. శరీరానికి అయితే కోటిన్నర రూపాయలు, మెదడుకు అయితే 65 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్టు ఆల్కర్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

ఎవరైనా తమ శరీరాన్ని భద్రపరుచుకోవాలంటే ముందుగా అల్కర్‌ లైఫ్ ఎక్స్‌టెన్షన్‌ ఫౌండేషన్‌‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. వారు చనిపోయినట్టు చట్టబద్ధంగా నిర్ధారించిన మరుక్షణమే అల్కర్‌ తన పనిని ప్రారంభిస్తుంది. మొదట విట్రిఫికేషన్‌ ఆతరువాత క్రయో ప్రిజర్వ్‌.. చివరికి క్రయోనిక్స్‌ ప్రక్రియలను చేపడుతుంది. వారి శరీరాలకు భద్రత కల్పిస్తుంది. అలా చేస్తే మనుషులు తిరిగి ఎలా బతుకుతారు? అంటే.. దానికి అల్కర్‌ వివరణ ఇస్తోంది. గుండె కొట్టుకోవడం ఆగిపోగానే.. మరణించినట్టు కాదంటోంది. శరీరంలోని కణజాలాలు, కండరాలు, అవయవాలు అచేతనంగా మారడానికి కొంత సమయం పడుతోందని చెబుతుంది. మనం దానం చేసే నేత్రాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. చనిపోయిన తరువాత కొంత సమయంలో వాటిని సేకరించి భద్రపరుస్తారు. అల్కర్‌ కూడా అలానే చేస్తోంది. శరీరంలోని అవయవాలు అచేతనంగా మారకముందే వాటిని గడ్డకట్టిస్తోంది. అయితే పునర్జన్మ ప్రసాదించడంపై ఇప్పటికిప్పుడే ఏం చేప్పలేమని అల్కర్‌ సంస్థ చెబుతోంది. ప్రస్తుతానికి శరీరాలను భద్రపరుస్తున్నామని చెబుతోంది. ఇప్పుడు గుండెను పనిచేయించే విధానం లేదని చెబుతోంది. కానీ భవిష్యత్తులో ఆ పద్దతులు వస్తాయని అంచనా వేస్తోంది. అందుకు ఇప్పటి నుంచే అల్కర్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. పలువురి శరీరాలను భద్రపరుస్తోంది. అయితే మనుషుల శరీరాలను మాత్రమే కాకుండా జంతువుల కళేబరాలను కూడా అల్కర్‌ భద్రపరుస్తోంది. పెంపుడు జంతువులపై ప్రేమతో అవి తిరిగి బతుకుతాయన్న నమ్మకంతో చనిపోయిన తరువాత అల్కర్‌ సంస్థలో భద్రపరుస్తున్నారు. అలా 100 పెంపుడు జంతువుల కళేబరాలను కూడా అల్కర్‌ భద్రపరుస్తోంది.

అయితే క్రయోనిక్స్‌ విధానం ఎంతమేరకు సరైనదన్న చర్చ మొదలైంది. భవిష్యత్తు కోసం శరీరాన్ని భద్రపరాలనుకోవడం తెలివితక్కువ తనమే అంటున్నారు వైద్య నిపుణులు. ఇది కేవలం సైన్స్‌ ఫిక్షన్‌ మాత్రమేనని కొట్టి పడేస్తున్నారు. క్రయోనిక్స్‌ చేసే సంస్థలు బాగుపడతాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ఒకవేళ భవిష్యత్తులో గుండెను తిరిగి పని చేసే టెక్నాలజీ వచ్చినా అప్పటి ప్రజలకు అనుకూలంగా ఉంటుందే తప్ప ఇప్పటి మనుషులకు కాదంటున్నారు. ఒకవేళ ఒక వందేళ్ల తరువాత అలాంటి సాంకేతికత వచ్చి ఈ మనిషిని బతికించినా వృథాయే అంటున్నారు. చనిపోయిన వ్యక్తి కాలం నాటికి.. అతడు బతికిన కాలం.. పూర్తిగా మారి ఉంటుందన్న విషయం మరచిపోకూడదంటున్నారు. మళ్లీ బతికిన వ్యక్తులు దశాబ్దాల తరువాత మారిన సమాజంలో ఇమడలేరని తేల్చి చెబుతున్నారు. ఆ వ్యక్తి ఓ గ్రహంతర వాసిగా అనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటి టెక్నాలజీని అందుకోలేక.. ఆ సమాజంలో బతకలేక.. చావడమే నయమనే భావన వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతే అనుసరించడం వృథాయే అంటున్నారు. నిజానికి అది సృష్టికి విరుద్ధమని కూడా కొందరు వాదిస్తున్నారు. కానీ పునర్జన్మను నమ్మేవారి సంఖ్య మాత్రం ఇటీవల పెరుగుతోంది.

ఏదైనా ప్రకృతి నియమాలను అనుసరించి ఉంటేనే దానికి విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఏ ప్రక్రియ కూడా విజయం సాధించినట్టు మానవ చరిత్రలో లేదంటున్నారు. నిజానికి ప్రకృతిని మించిన దైవం లేదని పునర్జన్మ ఇప్పటికైతే అసాధ్యమని భవిష్యత్తుల్లో చెప్పలేమంటున్నారు. మనిషి మళ్లీ బతకడమే అత్యాశంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories