రాజ కుటుంబాన్ని సైతం వదలని కరోనా రక్కసి

రాజ కుటుంబాన్ని సైతం వదలని కరోనా రక్కసి
x
Highlights

కరోనా కాటు 71 ఏళ్ల బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌కు కూడా తప్పలేదు. మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. కరోనా రక్కసి భయానికి కొన్నాళ్ల నుంచి ఎవరిని...

కరోనా కాటు 71 ఏళ్ల బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌కు కూడా తప్పలేదు. మహమ్మారి బారి నుంచి తప్పించుకోలేకపోయారు. కరోనా రక్కసి భయానికి కొన్నాళ్ల నుంచి ఎవరిని కలిసినా భారతీయశైలిలో చేతులు జోడించి నమస్తే చెబుతున్నా వైరస్‌ ఆయనను వెంటాడింది. యువరాజు చార్లెస్‌నే కాదు అతి పెద్ద రాజప్రసాదంలో ఉన్న మలేషియా రాజదంపతులు కూడా కరోనా బారిన పడ్డారు.


ఈయన బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌. వయసు 71 ఏళ్లు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం నమస్కారం చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారా అవును ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఫ్లూ లక్షణాలతో ప్రస్తుతం స్కాట్లాండ్‌లో స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారు. అదే ఆయన భార్య కామిల్లాకు వైరస్‌ నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా ఆమెను కూడా స్వీయ ఐసోలేషన్‌లో ఉంచారు.

చార్లెస్‌ క్విన్ ఎలిజబెత్ పెద్ద కుమారుడు. రాచకుటుంబంలో కోవిడ్ బారిన పడిన తొలి వ్యక్తి చార్లెస్. ఈనెల12న ఆస్ట్రేలియా బుష్ ఫైర్ రిలీఫ్ ఈవెంట్లో పాల్గొన్న చార్లెస్‌ కొద్ది రోజుల నుంచి ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. తనను పలకరించిన వారికి నమస్తే పెడుతున్నారు.

ప్రిన్స్‌ చార్లెస్‌కే వైరస్‌ పాజిటివ్‌ రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అటు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యక్షుడికి, ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అలాగే భూతాపం, పర్యావరణ ముప్పుపై కొద్దిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నే ఉరిమిచూసిన చిచ్చరపిడుగు గ్రెటా థెన్‌బర్గ్‌ కూడా అప్పట్లో మధ్యయూరప్‌ పర్యటనకు వెళ్లొచ్చాక కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించాయి. కాకపోతే ఆమెకు పాజిటివ్‌ రాలేదు గానీ ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లో ఉండిపోయారు.

చార్లెస్‌కు కరోనా పాజిటివ్ రావడంతో క్వీన్‌ ఎలిజబెత్‌ స్పందించారు. కరోనాపై పోరాటం కోసం బ్రిటన్ ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అటు అతిపెద్ద రాజప్రసాదంలో ఉన్న మ‌లేషియా రాజ దంప‌తులు క్వారెంటైన్‌లో ఉన్నారు. రాజ‌సౌధానికి చెందిన ఏడుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాజు, రాణి ఇద్దరూ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. సుల్తాన్ అబ్దుల్లా రియాతుద్దిన్‌, ఆయ‌న స‌తీమ‌ణి త‌న‌కు అజిహ అమినా మైమునా ఇస్కంద‌రియాలు రాజ భ‌వ‌నంలోనే వేరు వేరుగా జీవిస్తున్నారు. వారిద్దరికీ వైర‌స్ నెగ‌టివ్ అని తేలినా జాగ్రత్తలు పాటిస్తున్నారు. క‌రోనా వైర‌స్ సోకిన ఏడుగురి ఉద్యోగుల ప‌రిస్థితి ప్రస్తుతం నిల‌క‌డ‌గానే ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories