logo
ప్రపంచం

యూరప్, అమెరికాకు కోవిడ్‌ దడ.. విజృంభిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

యూరప్, అమెరికాకు కోవిడ్‌ దడ.. విజృంభిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
X
Highlights

కరోనా వైరస్ ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే పలు దేశాల్లో ఇప్పుడు కరోనా రెండవదశ ప్రతాపం చూపిస్తోంది. రోజుకు భారీ ...

కరోనా వైరస్ ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే పలు దేశాల్లో ఇప్పుడు కరోనా రెండవదశ ప్రతాపం చూపిస్తోంది. రోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక యూరప్, అమెరికా దేశాల్లో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. మొదటి సారి కంటే సెకండ్‌ వేవ్‌లో అత్యంత భయంకరంగా వైరస్‌ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో గురువారం ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. పోర్చుగల్, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాల్లో కర్ఫ్యూని అమలు చేశారు. ఐర్లాండ్‌ వారం రోజుల క్రితమే అత్యవసరాలు మినహా మార్కెట్లని మూసేసింది. దీంతో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌పై కూడా దేశంలో లాక్‌డౌన్‌ విధించాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ పట్ల వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

యూరప్‌ దేశాల్లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ వరకు కొనసాగే అవకాశాలున్నాయని యూకే సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీస్‌ అంచనా వేసింది. లాక్‌డౌన్‌ని అత్యంత కఠినంగా అమలు పరచకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కరోనా మరింత ఉధృత స్థాయికి చేరుకొని రోజుకి 800 మంది వరకు మరణిస్తారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

యూరప్‌ దేశాల్లో కోవిడ్‌–19 తొలి దశ విజృంభణ ముగిసిపోయాక ఆ దేశాలన్నీ బాగా రిలాక్స్‌ అయిపోయాయి. మొదటి సారి లాక్‌డౌన్‌ సమయంలో మళ్లీ మహమ్మారి విజృంభిస్తే ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వాలు పక్కాగా రచించలేదు. కరోనా రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్‌ కార్యక్రమం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే యూరప్‌లో పకడ్బందీగా అమలు కాలేదు. అంతేకాదు గత వేసవిలో ప్రజలు కూడా యథేచ్ఛగా తిరిగారు. విపరీతంగా ప్రయాణాలు చేయడం, నైట్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేయడం, క్లబ్బులు పబ్బులు, బీచ్‌ల వెంట తిరగడం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలన్నీ గాలికి వదిలేశారు. దీంతో అక్టోబర్‌లో మళ్లీ కరోనా బాంబు హడలెతిస్తోంది.

ఇక భారత్‌లో నవంబర్‌ 30 వరకు నిబంధనలున్నా జనం సామాన్యజీవనానికి వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి ఇతర అవసరాల కోసం పరిమితులు దాటిపోతున్నారు. ఈ నేపథ్యంలో చలికాలం వచ్చేసింది. వైరస్, బ్యాక్టీరియాలు పంజా విసరడానికి ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఈ ఏడాది కరోనాతో పాటు మరెన్నో సీజనల్ రోగాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏటా ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు విపరీతంగా అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది, అలా అని కరోనా పీడ విరగడైందనే భ్రమ మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. కేరళలో తగ్గిన కరోనా కేసులు ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.

Web TitleCorona second wave hitting Europe, America
Next Story