కొత్త బాంబు పేల్చిన చైనా.. కోళ్ల నుంచి..

China Records First Ever Human Case of H3N8 Avian Flu  | Telugu News
x

కొత్త బాంబు పేల్చిన చైనా.. కోళ్ల నుంచి..

Highlights

China: కేసులు తగ్గుముఖం పట్టినా.. పెరుగుతున్న మరణాలు

China: కరోనాతో విలవిల వణుకుతున్న చైనా తాజాగా మరో బాంబు పేల్చింది. ఇన్నాళ్లు పక్షులకు పరిమితమైన బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకుతుందని బీజింగ్‌ వెల్లడించింది. తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడికి బర్డ్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చైనా జాతీయ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. H3N8గా పిలువబడే ఈ వైరస్‌ మనుషులకు అంత ప్రమాదకరం కాదని చైనా స్పష్టం చేసింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైని కుదిపేస్తున్న కరోనా ఇప్పుడు బీజింగ్‌కు చేరింది. షాంఘై, జియాంగ్జీ, జిలిన్‌తో పాటు బీజింగ్‌ ప్రావిన్స్‌లో కఠిన కరోనా నిబంధనలను చైనా అమలు చేస్తోంది. ప్రజలు లాక్‌డౌన్‌తో ఇప్పటికే తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో బర్డ్ ఫ్లూ ఓ చిన్నారికి సోకిందనే వార్త ఇప్పుడు కలవరపెడుతోంది.

చైనాలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారి కేసులు 20వేల దిగువకు పడిపోయాయి. కేసులు తగ్గడంతో కొంత ఉపశమనం కలుగుతున్నది. అయితే అదే సమయంలో చైనా కొత్త బాంబును పేల్చింది. ఇప్పటివరకు పక్షులకు, గుర్రాలు, కుక్కలు, సీల్స్‌కు మాత్రమే పరిమితమైన బర్డ్‌ ఫ్లూ ఇప్పుడు మనుషులకు సోకుతున్నట్టు ప్రకటించింది. చైనాలోని సెంట్రల్‌ హెనాన్‌ ప్రావిన్స్‌లో ఓ నాలుగేళ్ల బాలుడికి బర్డ్‌ ఫ్లూ సోకినట్టు జాతీయ హెల్త్‌ కమిషన్ నిర్ధారించింది. ఈ నెల ప్రారంభంలో అస్వస్థతకు గురైన బాలుడికి జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించింది. బాలుడి కుటుంబం కోళ్లను, అడవి బాతులను పెంచుతున్నట్టు గుర్తించింది. కోళ్లకు సోకిన బర్డ్ ఫ్లూ చిన్నారికి నేరుగా సోకినట్టు తెలిపింది. అయితే బాలుడి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ బర్డ్‌ ఫ్లూ సోకలేదని, ఇది మనుషులకు సోకే సామర్థ్యం చాలా తక్కువని చైనా జాతీయ ఆరోగ్య హెల్త్‌ కమిషన్‌ స్పష్టం చేసింది.

హెనాన్‌ ప్రావిన్స్‌లో చిన్నారికి బర్డ్‌ ఫ్లూ సోకడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించింది. జ్వరం, శ్వాసకోస లక్షణాలు ఉంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను హెచ్చరించింది. అంతేకాకుండా జబ్బుపడిన లేదా చనిపోయిన పక్షులకు దూరంగా ఉండాలని అప్రమత్తం చేసింది. ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న చైనా నుంచి ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రపంచ దేశాలు టెన్షన్‌తో ఉన్నాయి. ఇప్పుడు చైనా పేల్చిన బాంబుతో. ఇప్పుడు పలు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే H3N8గా పిలువబడే బర్డ్‌ ఫ్లూ తొలిసారి ఉత్తర అమెరికాలో 2002లోనే బయటపడింది. ఇది మనుషులకు వ్యాపించదని అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం తెలిపింది. అయితే జంతువులకే పరిమితమైన బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకినా.. ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మరోవైపు చైనాను కరోనా వణికిస్తోంది. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా మరణాల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో 14వేల 298 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 వందల 24 ఒమిక్రాన్‌ లక్షణాలున్న కేసులుగా, 12,474 కేసులు వైరస్‌ లక్షణాలు లేనివిగా గుర్తించారు. మొత్తం కేసుల్లో 13వేల 562 కేసులు ఒక్క షాంఘై నగరంలోనే నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 48 మంది మృతి చెందారు. షాంఘై, జియాంగ్జీ, జిలిన్‌, బీజింగ్‌ ప్రావిన్సుల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి చైనా కఠిన లాక్‌డౌన్‌ను అమలుచేస్తోంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేస్తోంది. ఇళ్ల నుంచి పొరబాటున ఎవరైనా బయటికి వస్తే పోలీసులు లాఠీలను ఝులిపిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఏప్రిల్‌లో చైనా ఆర్థిక వృద్ధి కూడా మందగించింది. లాక్డ్‌ డౌన్‌ విధించడంతో నగరాల్లో వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీంతో చైనా తీవ్రంగా నష్టపోయినట్టు బ్లూమ్‌బర్గ్‌ నివేదికలు చెబుతున్నాయి.

మన దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతమవుతోంది. కొద్ది రోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కొత్త కేసులు 3వేలకు సమీపించడం కలకలం రేపుతోంది. 24 గంటల్లో 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా 2వేల 927 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో అత్యధికంగా 26 మంది మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. ఒక్క ఢిల్లీలోనే 12వందల 4 మందికి కరోనా సోకింది. దేశ రాజధాని తరువాత హర్యానాలో 517 అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేరళ, యూపీ, మిజోరాం రాష్ట్రాల్లోనూ వైరస్‌ విజృభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్‌ నిబంధనలు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మళ్లీ లాక్‌డౌన్‌ వస్తుందన్న టెన్షన్‌ వారిని వెంటాడుతోంది. గతంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు.

వైరస్‌ కట్టడికి ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరి మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ బారి నుంచి కాపాడుకోవడానికి అప్రమత్తతే అసలైన మందని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories