అమెజాన్‌ను వణికిస్తున్న ఉద్యోగులు.. 40 దేశాల్లో సంస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు.. అసలు అమెజాన్‌లో ఏం జరుగుతోంది.?

Amazon Workers Across World on Strike
x

అమెజాన్‌ను వణికిస్తున్న ఉద్యోగులు.. 40 దేశాల్లో సంస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు.. అసలు అమెజాన్‌లో ఏం జరుగుతోంది.?

Highlights

Amazon: ఇటీవల 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించి అమెరికన్ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కలకలం రేపింది.

Amazon: ఇటీవల 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించి అమెరికన్ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కలకలం రేపింది. రిటైల్‌, డివైజ్‌ మేకింగ్‌, మానవ వనరుల విభాగాల్లో ఉద్యోగులను తొలగింపునకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రక్రియ పూర్తికాకముందే తాజాగా అమెజాన్‌కు మరో సవాల్‌ ఎదురయ్యింది. సంస్థకు వ్యతిరేకంగా అమెజాన్‌ పే పేరిట పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమానికి తెరలేపారు. 40 దేశాలకు చెందిన 80 ట్రేడ్‌ యూనియన్లకు చెందిన అమెజాన్‌ కార్మికులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అసలు అమెజాన్‌లో ఏం జరుగుతోంది.? ఉద్యోగులు అంత పెద్ద ఎత్తున ఎందుకు ఆందోళనలకు దిగారు? వారి డిమాండ్లు ఏమిటి? ఈ కామర్స్ దిగ్గజానికి కష్టాలు తప్పవా?

ఇటీవల 10వేల మంది ఉద్యోగులను తొలగిస్తామంటూ అమెజాన్‌ చేసిన ప్రకటన ఆ సంస్థ కార్మికులను తీవ్ర ఆందోళన కలిగించింది. చెప్పినట్టుగానే నాటి నుంచి రిటైల్‌, డివైజ్ మేకింగ్‌, మానవ వనరుల విభాగాల్లోని ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాక ముందే అమెజాన్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా 40 దేశాల్లో 80 ట్రేడ్ యూనియన్లకు చెందిన అమెజాన్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ పెద్ద ఎత్తున కొనసాగుతున్న తరణంలోనే ఉద్యోగులు ఆందోళనకు దిగడం అమెజాన్‌లో కలకలం రేపింది. మేక్‌ అమెజాన్‌ పే పేరిట కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళనలకు దిగారు. భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా దేశాల్లోని ఈ కామర్స్‌ దిగ్గజం ఎదుట కార్మికులు ఆందోళనలు చేపట్టారు. యూకేలో జీఎంబీ యూనియన్‌కి చెందిన వందలాది మంది సభ్యులు కొవెంట్రీతోపాటు పలు నగరాల్లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ల ఎదుట నిరసనలు చేపట్టారు. వేతనాల పెంపు, మెరుగైన పని పరిస్థితులు కల్పించేందుకు యూనియన్లతో చర్చలు జరుపాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. క్రిస్మస్‌ సీజన్‌ నేపథ్యంలో ఓవర్‌టైమ్‌కు అనుగుణంగా బోనస్‌ ఇవ్వాలన్నారు. 'పని బారెడు, వేతనం మూరెడు'లా కార్మికుల దుస్థితి ఉన్నదని జీఎంబీ నేత అమంద గేరింగ్‌ పేర్కొన్నారు. భారత్‌లో ఢిల్లీ జంతర్‌ మంతర్‌తో పాటు యూపీ, ఉత్తరాఖండ్‌, బీహార్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌ తదితర రాష్ర్టాల్లో ఆందోళనలు జరిగాయి.

అతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తప్పదని భావిస్తున్న తరణంలో అమెజాన్‌ కార్మికుల ఆందోళనకు దిగడం ఆసక్తి రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మూడో త్రైమాసికంలో అమెజాన్‌ సేల్స్‌ 13 శాతం పెరిగాయి. ఆదాయం కూడా భారీగానే వచ్చింది. బ్రిటన్‌లో అమెజాన్‌ 60 శాతం లాభాలను అర్జించింది. దీంతో 20 కోట్ల 40 లక్షల పౌండ్ల ఆదాయాన్ని అర్జించింది. అంటే మార్కెట్లో అమెజాన్‌ డామినేషన్ పెరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. సహజంగానే అమెజాన్‌ ఉద్యోగులు జీతాలను పెంచాలని కోరుకుంటున్నారు. అందులోనూ ప్రత్యేకంగా గోడౌన్లలో పనిచేసే కార్మికులు జీతాలను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను చెల్లించాలని వివిధ దేశాల్లో అమెజాన్‌ కార్మికులు పట్టుబడుతున్నారు. చేసే పనిని బట్టి జీతాలను పెంచాలంటున్నారు. 40 దేశాల్లోని కార్మికులు ఏకమై.. ఆందోళనలకు దిగారు. అయితే తాజా కార్మికులు డిమాండ్లపై అమెజాన్‌ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు. కానీ నిరసనలపై మాత్రం కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఆందోళనలకు దిగారంటూ ఆరోపిస్తోంది. ప్రత్యేక ఆసక్తులతో కొందరు ఆందోళనలకు దిగారని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. తాము ఎలాంటి చర్యలను చేపట్టాలో వాటిని తప్పకుండా చేస్తామని అమెజాన్‌ చెబుతోంది. అమెజాన్‌లో గతంలోనూ ఇలాంటి అందోళనలు రేకెత్తాయి. కానీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చిన దాఖలాలు మాత్రం లేవు. ఒక్క అమెజానే కాదు పలు సంస్థల్లో ఆందోళన చేసిన కార్మికుల పరిస్థితి ఇలానే ఉంది.

భారత్‌లో తాము ఏ ఉద్యోగినీ బలవంతంగా తొలగించలేదని కేంద్ర ప్రభుత్వానికి అమెజాన్‌ తెలిపింది. తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగారని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమాధానం ఇచ్చింది. ఏటా అన్ని విభాగాల్లోని ఉద్యోగులపై సమీక్ష నిర్వహిస్తుంటామని, పునర్‌ వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే పరిహారం చెల్లిస్తుంటామని స్పష్టం చేసింది. ఇందులో బలవంతం ఏమీ లేదని, తమ ప్యాకేజీని అంగీకరిస్తే ఉద్యోగులు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగవచ్చని, లేదంటే ప్యాకేజీని తిరస్కరించే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తున్నామని అమెజాన్‌ వివరించింది. వలంటరీ సెపరేషన్‌ ప్రోగ్రామ్‌-వీఎస్‌పీకి సానుకూలంగా ఉన్నవారు ఈ నెల 30లోగా సంతకం చేయాలని, ఈ గడువులోగా సంతకం చేసినవారు మాత్రమే వేతన ప్రయోజనాలను పొందేందుకు అర్హులని అమెజాన్‌ స్పష్టం చేసింది. దీంతో అమెజాన్‌ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సెనేట్‌- NITES ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై అమెజాన్‌ను కేంద్ర కార్మిక శాఖ వివరణ కోరింది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ కేంద్ర ప్రభుత్వానికి తమ వివరణను అందజేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఆర్థిక మాంద్యం వస్తుందన్న అనుమానం టెక్‌ సెక్టార్‌ను భయాందోళనకు గురిచేస్తోంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం గుబులు పుట్టిస్తున్నాయి. పలు కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. ట్విట్టర్‌తో మొదలైన ఈ ఉద్యోగుల కోత సెగ తాజాగా అమెజాన్‌కు తాకింది. 10 వేల మందిని తొలగిస్తున్నట్టు అమెజాన్‌ ఇటీవల ప్రకటించింది. ఈ సంఖ్య తక్కువే అయినా అమెజాన్‌ చరిత్రలోనే 10వేల మందిని తొలగించడం ఇదే తొలిసారి. భారీగా వేర్‌హౌస్‌లు, పలు ప్రయోగాత్మక ప్రాజెక్టులు, టెలీహెల్త్‌ సర్వీసులను ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ మూసివేస్తోంది. అయితే వ్యయాలను ఎందుకు తగ్గించుకుంటోందన్న దానికి అమెజాన్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ బెత్‌ జెలేటీ జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులు సమాధానం చెబుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం లోపించిందని అందుకే నియామకాలు, పెట్టుబడులను సమం చేసేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చితిపైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ సైతం ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక మాంద్యం వస్తే.. ఏం చేస్తారన్నదానికి బెజోస్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఆర్థిక వ్యవస్థ ఏమంత బాగా లేదని స్పష్టం చేశారు. పరిస్థితులు నెమ్మదించాయన్నారు. పలు కంపెనీలు ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నట్టు వివరించారు. ప్రజలు కొంత రిస్క్‌ తీసుకోవాలని.. కొనుగోళ్లు ఆపేయాలన్నారు. వీలైనంత వరకు డబ్బును ఆదా చేసుకోవాలని బేజోస్‌ పిలుపునిచ్చారు. బేజోస్‌ సలహాను అమెజాన్‌ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా అమెజాన్‌లో లాభాలు ఉన్నా ఉద్యోగులను తొలగిస్తుండడం చర్చకు తావిస్తోంది. మరోవైపు కార్మికులు ఆందోళనకు దిగడంతో ఆయా దేశాల్లో ప్రభుత్వాల నుంచి అమెజాన్‌కు చిక్కులు తప్పవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories