Afghanistan: మహిళలపై తాలిబన్ల అరాచకం.. జిమ్ములు, పార్కులకు నో ఎంట్రీ..

Afghanistan Taliban ban Women From Parks
x

Afghanistan: మహిళలపై తాలిబన్ల అరాచకం.. జిమ్ములు, పార్కులకు నో ఎంట్రీ..

Highlights

Afghanistan: ప్రపంచంలోనే మహిళలకు విద్యను నిషేధించిన దేశం ఏది?

Afghanistan: ప్రపంచంలోనే మహిళలకు విద్యను నిషేధించిన దేశం ఏది?.. ఈ ప్రశ్నకు సమాధానంగా అందరి వేళ్లు అఫ్ఘానిస్థాన్‌వైపే చూపుతాయి. తాలిబన్ల అరాచక పాలనలో మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా పార్కులు, జిమ్ముల్లో స్త్రీలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ప్రైమరీ నుంచి ఉన్నత స్థాయి విద్య మహిళలకు అక్కర్లేదంటూ తాలిబన్లు వాదిస్తున్నారు. తాము మారిపోయామని మహిళల హక్కులను కాపాడుతామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అసలు నైజాన్ని తాలిబన్లు బయటపెడుతున్నారు. షరియత్‌లో కంటే మరింత దారుణమైన చట్టాలతో మహిళపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని కేవలం వంటింటికే పరిమితం చేసే దిశగా అక్కడి నేతలు అడుగులు వేస్తున్నారు.

2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్‌ను సొంతం చేసుకున్న తాలిబన్లు క్రమంగా 1990ల్లో తాలిబన్లలా మారుతున్నారు. ఇచ్చిన హామీలన్నింటిని కాలరాస్తున్నారు. కేవలం ఒక జెండర్‌కే పెద్ద పీట వేస్తున్నారు. ఇదంతా అక్కడి మహిళల గురించేనని ఈ పాటికే స్పష్టంగా అర్థమై ఉంటుంది. తాజాగా తాలిబన్లు మరో దారుణ నిర్ణయం తీసుకున్నారు. జిమ్ములు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అసలు పార్కులు, జిమ్ముల్లోకి ఎందుకు వెళ్లకుండా మహిళలను ఎందుకు నిషేధించారు? అంటే తాలిబన్ల నుంచి సమాధానం మాత్రం రావడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీ, పురుషులు కలిసి వెళ్లడంపై తాలిబన్లు నిషేధం విధిస్తున్నారు. అందులో భాగంగా పార్కులు, జిమ్ముల్లోకి మహిళలు, పురుషులు కలిసి వెళ్లడాన్ని నిషేధించారు. అందుకు మహిళలకు వారంలో కొన్ని రోజుల్లో మాత్రమే పార్కులు, జిమ్ములకు వెళ్లేలా మొదట నిర్ణయించారు. అది వర్క్ అవుట్‌ కాలేదు. దీంతో అసలు ఆడవారికి జిమ్ములు, పార్కులకు వెళ్లడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేలా రోజు రోజుకు తాలిబన్లు కఠిన నియమాలను తెస్తున్నారు. పబ్లిక్‌ ప్రదేశాల్లో మహిళలు, పురుషులు కలిసి ఉండే చోట హిజాబ్‌ నిబంధనను ఉల్లంగిస్తున్నారని అందుకే పార్కులు, జిమ్ములకు వారికి అనుమతిని నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఇచ్చే జిమ్ములు, ప్రశాంతతను కల్పించే పార్కుల్లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో అక్కడి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ఆధ్వర్యంలో మహిళలు క్రమంగా చీకటిలోకి వెళ్తున్నారు. 2021 ఆగస్టు 15న కాబుల్‌ను తాలిబన్లు సొంతం చేసుకున్నారు. అయితే 1990ల్లో తాలిబన్ల అరాచకాలను చూసిన ప్రజలు లక్షలాది మంది దేశం విడిచి వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే అఫ్ఘాన్‌ ప్రజలు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదంటూ తాలిబన్లు చెప్పారు. తాము మారిపోయామన్నారు. మహిళల హక్కులను కాపాడుతామంటూ హామీ ఇచ్చారు. షరియా చట్టం ప్రకారం వారి హక్కులను కాపాడుతామన్నారు. అందులో భాగంగా చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు మహిళలకు అనుమతిస్తామని చెప్పారు. వారి మాటలు నిజమేనని అఫ్ఘానిస్థాన్‌ ప్రజలు నమ్మారు. కానీ ఏమాత్రం తాలిబన్లు మారలేదని ఏడాది పాలనలో స్పష్టమవుతోంది. ప్రపంచమంతా ముందుకు దూసుకెళ్తుంటే తాలిబన్లు మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారు. అధికారం చేపట్టగానే మొదట మహిళ వ్యవహారాల శాఖను తొలగించారు. ఆ తరువాత 6వ తరగతి వరకే బాలికా విద్యను పరిమితం చేశారు. ప్రపంచంలో ఆరో తరగతికే విద్యను బ్యాన్‌ చేసిన ఏకైక దేశం అప్ఘానిస్థానే. అంతకాదు బాలికా వివాహాలను తాలిబన్లు ప్రోత్సహిస్తున్నారు. ఆ దిశగా తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఇళ్లలో ఖాళీగా కుర్చునే బదులు పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఉంటుందని తాలిబన్లు సెలవిస్తున్నారు.

మహిళలపై తాలిబన్ల కఠిన నియమాలను అమలు చేయడంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే బాలికా విద్య బ్యాన్‌ తాత్కాలికమేనని తాలిబన్లు చెబుతున్నారు. కానీ.. వారి మాటలను మాత్రం అక్కడి ప్రజలు విశ్వసించడం లేదు. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా తాలిబన్ల తీరు ఉందంటూ అంతర్జాతీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తాలిబన్ల వ్యవహరశైలి అఫ్ఘాన్‌ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఏడాది మేలో తాలిబన్లు కొత్త నియమాన్ని తీసుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరి ముఖానికి కనిపించకుండా చేసుకోవాలని ఆదేశించారు. ఇంట్లో ఉంటే ఈ నిబంధన అవసరం లేదేని.. బయటికి వస్తేనే ఈ నిబంధన అంటూ స్పష్టం చేశారు. అప్పట్లో మెుఖాన్ని కవర్‌ చేసుకోని మహిళలపై తాలిబన్లు దాడులు నిర్వహించారు. తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించే మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడి మహిళల ప్రాథమిక హక్కులను హరించివేస్తున్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎక్కిడికి ప్రయాణించాలి? ఎవరితో వెళ్లాలనేది తాలిబన్లే నిర్ణయిస్తున్నారు. ఆఖరుకు సెల్‌ఫోన్లు కూడా మహిళలు వాడరాదంటూ ఆంక్షలు విధిస్తున్నారు. పార్కుల్లో ప్రవేశానికి నిషేధం విధించడంతో.. పిల్లలకు సరదా ఆటాపాటలు తల్లులు ఎలా నేర్పుతారంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.

కొన్ని దశాబ్దాలుగా తాలిబన్ల అరాచకాలతో అప్ఘానిస్థాన్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తరువాత లింగ సమానత్వం ఆ దేశంలో దారుణంగా పడిపోయింది. 2021లో విడుదలైన 156 దేశాల జెండర్‌ గ్యాప్‌ జాబితాలో కాలబులీవాలా దేశం చివరి స్థానంలో నిలవడం శోచనీయం. అప్ఘానిస్థాన్‌లో మొత్తం 63 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. వారిలో 55 లక్షల మంది మహిళలకు అత్యవసరంగా మానవతా సాయం అమని నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో మహళా సంక్షేమానికి కృషి చేసే సంఘాలు, సంస్థలకు ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. మహిళా సంక్షోభంపై ఆ దేశంలో నోరు విప్పేవారే కనిపించడం లేదు. కనీసం మీడియాలో కనిపించే యాంకర్ల మొహాలు కూడా కనపడకూడదంటూ ఈ ఏడాది మేలో ఆంక్షలు విధించడం తాలిబన్ల ఆరాచకానికి పరాకాష్ట. తాలిబన్లతో సంబంధాలను పెట్టుకునే దేశాలు ఈ విషయంలో నోరుమెదపడం లేదు. మహిళల హక్కులను కాలరాయడంపై ఏ మాత్రం ప్రశ్నించడం లేదు. అంతర్జాతీయ సమాజం అక్కడి ప్రజల గురించి పట్టించుకోవాలని అక్కడి సమాజిక వేత్తలు, మహిళలు కోరుతున్నారు. తాలిబన్ల రాకతో అప్ఘానిస్థాన్‌ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘాన్ల పరిస్థితి మరింత దిగజారింది. నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి. తినడానికి తిండి కూడా దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాకుండా తాలిబన్ల రాకతో 10 లక్షల మేర ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు.

గతంలోలాగా ప్రజలను హింసించమని గతేడాది చెప్పారు. కానీ వారిలో ఏమాత్రం మార్పు లేదు. మహిళలపై ఆంక్షలు మళ్లీ విధిస్తున్నారు. బాలికల విద్యను రద్దు చేశారు. మగవారికి గడ్డం తప్పనిసరి చేశారు. బుర్కాలను తప్పనిసరి చేశారు. మహిళల డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేశారు. గతంలోని తాలిబన్ల ఆరాచక పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి. తాలిబన్ల కొత్త విధానాలతో ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories