Martin Cooper: సెల్‌ఫోన్‌కు 50 ఏళ్లు.. సృష్టించినందుకు మార్టిన్ కూపర్ చింతిస్తున్నారట..

Martin Cooper: సెల్‌ఫోన్‌కు 50 ఏళ్లు.. సృష్టించినందుకు మార్టిన్ కూపర్ చింతిస్తున్నారట..
Martin Cooper: సెల్‌ఫోన్‌కు 50 ఏళ్లు.. సృష్టించినందుకు మార్టిన్ కూపర్ చింతిస్తున్నారట..
Martin Cooper: పొద్దున లేచింది మొదలు.. పడుకునే వరకు.. అది లేకుండా మనిషి ఉండలేడు... ప్రతి ఐదు నిమిషాలకొకసారి.. దాన్ని చూస్తుంటాడు.. మనిషికి అదొక నిత్యావసరంగా మారింది. అది లేకుంటే... అయ్యో ప్రపంచంలో ఏం జరిగిందోనని దిగాలు పడిపోతాడు.. అదేదో కాదు.. సెల్‌ఫోన్.. ఆధునిక ప్రపంచంలో అతి గొప్ప ఆవిష్కరణ ఇదే.. మొదట ఇటుకలాగా.. కేజీ బరువున్న ఈ ఫోన్ ఇప్పుడు ఆధునిక హంగులతో.. ఆరు అంగులాలకు మారింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అరచేతిలో చూపుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా... వీడియోకాల్స్‌తో అతి చేరువ చేసింది. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా సెల్‌ఫోన్లు మార్చాయి. అయితే ఈ మొబైల్ ఫోన్లతో నష్టాలు ఏమిటి? లాభాలు ఏమిటి? మొబైల్‌ను సృష్టికర్త... నేటి ఆధునిక ఫోన్లపై ఏమంటున్నారు?
ప్రపంచ చరిత్రలో చక్రం తరువాత.. అతి గొప్ప ఆవిష్కరణ ఏమిటి? ఈ ప్రశ్నకు... ఎవరైనా కొంచెం ఆలోచించాల్సిందే.. ఎందుకంటే.. చక్రం ఆవిష్కరణతో ప్రపంచ గతి మారిపోయింది. వాటితో బండ్లు, సైకిళ్లు, జీపులు, కార్లు, ఇలా ఒకటేమిటి.. ఏకంగా నింగిలోకి ఎగిరే విమానాలు కూడా వచ్చేశాయి. ఆ తరువాత గొప్ప ఆవిష్కరణ అంటే.. తడుముకోకుండా సమాధానం చెప్పడం కష్టమే.. ఎందుకంటే.. ఈ జాబితాలో చాలా ఉన్నాయి. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు అద్భుతమైన టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది.. ఈ క్రమంలో చాలా మంది గుర్తించని అద్భుతం ఒకటి ఉంది. అదేదో కాదు.. సెల్‌ఫోనే.. మీరు కూడా ఆలోచించలేదు కదూ... కానీ.. సెల్‌ఫోన్ అద్భుతమనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ సెల్‌ఫోన్ సుదీర్ఘ ప్రయాణంలో వేలాది డెవలప్‌మెంట్స్, అనేక మైలురాళ్లను మనం చూశాం.. మీకు తెలుసా?... మొదటి సెల్‌ఫోన్ తయారుచేసి.. 50 ఏళ్లు పూర్తయ్యింది. వైర్‌లెస్ కమ్యూనికేషన్ మార్గదర్శకుడు, అమెరికాకు చెందిన మార్టిన్ కూపర్.. ఇటుకలాంటి ఆకారం ఉన్న తన సెల్‌ఫోన్ నుంచి మొదటి కాల్ చేశారు. అప్పటికి కూపర్‌కు తెలియదు.. తను చరిత్ర సృష్టించారని.. మొదటి హ్యాండ్‌సెట్ బరువు కేజీ ఉండేదట. ఈ మొబైల్ ఫోన్‌ను 9 ఇంచుల పొడవు, 1.75 ఇంచుల వెడల్పుతో తయారుచేశారు. ఈ ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి 10 గంటల సమయం పట్టిందట. అంతసేపు చార్జింగ్ చేసినా.. అది పనిచేది కేవలం 25 నిమిషాలే. అంటే.. ఈ మొబైల్ బ్యాటరీ లైఫ్ కేవలం 25 నిమిషాలు మాత్రమే. ఈ సెల్‌ఫోన్‌ను మోటోరోలా డైనటాక్ లేదా ఇటుక అని కూపర్ పిలిచేవారట.
ఫోన్‌ను కనిపెట్టిన కూపర్... అది అద్భుతాలను ఆవిష్కరిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. దశాబ్దాలు ఇట్టే గడిచిపోయాయి. కానీ.. సెల్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఇటుక ఆకారంలో ఉన్న ఫోన్.. ఇప్పుడు ఓ సొగసైన గాజు పరికరంలా మారింది. మొదట్లో కేవలం వైర్‌లెస్ కాల్స్‌కోసమే తయారుచేసిన మొబైల్ ఫోన్.. ఇప్పుడు బహుముఖ ప్రయోజనకారిగా మారింది. కాల్స్‌తో పాటు సెర్చింగ్, కనెక్టింగ్, ఫొటోలు, షాపింగ్, బ్రౌజింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలారం, గడియారం, క్యాలెండర్, ఫోన్ బుక్‌లు.. ఆఖరికి కెమెరాలను పనికిరానివాటి కింద మార్చేసింది ఈ సెల్‌ఫోన్. ప్రస్తుతం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కంటే.. ఆరు అంగులాల సెల్‌ఫోన్‌లోనే అద్భుతమైన టెక్నాలజీ ప్యాక్ అందుబాటులో ఉంది. నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడానికి ముందు.. కమ్యూనికేషన్ కోసం.. మానవ నిర్మిత సమాచారా వ్యవస్థ వాయేజర్-1ను అంతరిక్షంలోకి పంపింది. నాసా ప్రయోగించిన వాయెజర్-1 కంటే ఐఫోన్‌నే శక్తివంతమైన కార్యకలాపాలను నిర్వహిస్తుందంటే.. ఆశ్చర్యం కలగక మానదు.. ప్రస్తుతం మనం మెలకువగా ఉండే సమయంలో ఎక్కువగా సెల్‌ఫోన్లలోనే గడుపుతున్నాం.. ప్రజలు తమ కేరీర్ మొత్తాన్ని మొబైల్ ఫోన్లతోనే నిర్మించుకుంటున్నారు. కొత్త కంటెంట్ రాయడం, మొబైల్ ఫొటోగ్రఫీ, మొబైల్ యాప్స్ తయారీ, వ్యాపారం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. మొబైల్ ఉపయోగాలు చాంతాడంత అవుతాయి. అంతేకాదు... లాక్‌డౌన్ వంటి సమయాల్లో ఆన్‌లైన్ విద్యకు, వినోదానికి కూడా ఉపయోగపడింది. సెల్ ఫోన్ ఆవిష్కరణ కమ్యూనికేషన్‌ను సమూలంగా మార్చేసింది. ఈ తరం మొత్తం సెల్‌ఫోన్లకు బానిసయింది.
వెన్నునొప్పి, మెడనొప్పి రావడం ఇప్పుడు కామన్‌గా మారింది. ఆందోళనలు పెరుగుతున్నాయి. వీటన్నింటికి కారణం.. మొబైల్ ఫోన్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెల్ ఫోన్లకు మనం ఎంత బానిసలయ్యామో అనడానికి ఇవి నిదర్శనం. 71 శాతం మంది అమెరికన్లు నిద్ర లేచిన 10 నిమిషాల్లోనే తమ ఫోన్లను చెక్ చేసుకుంటారట. 70 శాతం మంది నోటిఫికేషన్లు వచ్చిన ఐదు నిమిషాల్లోనే తనిఖీ చేస్తారాట. 47 శాతం మంది తమకు తామే సెల్‌ఫోన్లకు బానిసయ్యామని భావిస్తున్నారట. 35 శాతం మంది డ్రైవింగ్‌లోనూ మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. సెల్‌ఫోన్లు గర్భంపై ప్రభావం చూపడమే కాదు.. మానవ శ్రేయస్సును కూడా దెబ్బతీస్తోంది. మనుషుల మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎలా అంటే.. 61 శాతం మంది అమెరికన్లు.. ఒకే గదిలోనే ఉన్నా.. మొబైల్ ఫోన్‌లో సందేశాలను పంపుకుంటున్నట్టు అంగీకరిస్తున్నారు. 43 శాతం మంది డేటింగ్ కోసం ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. బహుషా అందుకేనేమో... సెల్‌ఫోన్‌ను సృష్టించినందుకు మార్టిన్ కూపర్ చింతిస్తున్నారట. సెల్‌ఫోన్లతో వైద్యం అద్భుతమైన పురోగతి సాధిస్తుందని మార్టిన్ కూపర్ ఆశించారు. ఆధునిక సెల్‌ఫోన్లపై తనకు ఎలాంటి పిచ్చి లేదంటున్నారు కూపర్. ప్లాస్టిక్ వస్తువుని తీసుకుని.. ముఖానికి ఇబ్బందికరమైన స్థితిలో చేతిలో పట్టుకోవడం నాకు ఏ మాత్రం నచ్చదన్నారు. సెల్‌ఫోన్ తప్పకుండా శరీరంలో ఏదో ఒక భాగంలో చొప్పించబడుతుందని జోస్యం చెప్పారు. మొబైళ్లు ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంలో ఇది ప్రారంభం మాత్రమేనని కూపర్ ఆందోళన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయన్నది నిజమేనని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు.
మొబైల్‌ను ఎక్కువగా వినియోగించడంతో కంటి చూపు కూడా మందగిస్తోంది. వినికిడి శక్తిని కూడా పలువురు కోల్పోతున్నారు. గర్భ సంబంధమైన ఇబ్బందులు, వెన్నుముక మంటతో పాటు మానసికంగా క్రుంగిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆందోళన, నిస్పృహ, హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌ను ఫోన్లు ప్రేరేపిస్తున్నాయి. నిరంతరం సెల్‌ఫోన్లను చూడడంతో మనస్సుకు విశ్రాంతి లభించడం లేదు. మనం నిత్యం చూస్తున్న సెల్‌ఫోన్లతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నాము. అంతేకాదు.. ఈ మొబైళ్లతో గోప్యత, భద్రతా ఇబ్బందులను కూడా ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ విషయంలో మార్టిన్ కూపార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై మనకు ప్రైవసీ లేదన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రతిదీ కొన్ని చోట్ల రికార్డు చేయబడుతుందన్నారు. ఇలాంటి తరుణంలో మనం ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి.. మొబైల్ ఫోన్లతో అతి పెద్ద సవాల్ మానవాళికి తప్పదని కూపర్ అన్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ల కారణంగా.. సంసారాలు కూడా నాశనమవుతున్నాయి. సరదాగా మొదలయ్యే ఆన్‌లైన్ స్నేహాలు పెడదోవ పడుతున్నాయి. మరికొందరు ఆన్‌లైన్ స్నేహితులను నమ్మి గుడ్డిగా డబ్బును కూడా ఇచ్చేస్తున్నారు. ఆ తరువాత మోసపోయామని లబోదిమోమని మొత్తుకుంటున్నారు. ఇలాంటివి ఇటీవల కాలంలో అధికమయ్యాయి. సెల్‌ఫోన్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. మనిషి మాత్రం సమస్యలను కూడా పెంచుకుంటున్నాడు. మితిమీరిన ఫోన్ వినియోగంతో ఆరోగ్య సమస్యలతో పాటు కష్టాలను కొని తెచ్చుంటున్నారు.
సెల్‌ఫోన్ ఆవిస్కరణతో మొదలై విప్లవం... నేడు ఎక్కడున్నా నేరుగా చూసుకునే అవకాశం మనకు లభించింది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగిన క్షణాల్లో తెలుసుకుంటున్నాము.. నిజానికి చక్రం తరువాత.. అతి గొప్ప ఆవిష్కరణ ఇదే. మొబైల్ ఫోన్ల ప్రస్థానం 50 ఏళ్లకు చేరుకుంది. ఈ మొబైల్ డివైజ్‌లను అభివృద్ధికి వినియోగించుకోవాలే తప్ప.. సమస్యలను కొనుతెచ్చుకుండా ఉంటే చాలని నిపుణులు చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



