Top
logo

గ్రేటర్‌లో చక్రం తిప్పిన ముఖేష్‌ గౌడ్ ఇప్పుడెక్కడ?

గ్రేటర్‌లో చక్రం తిప్పిన ముఖేష్‌ గౌడ్ ఇప్పుడెక్కడ?
Highlights

గ్రేటర్ కాంగ్రెస్‌లో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నాయకుడు ఇప్పుడు ఏమైపోయాడు....? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో...

గ్రేటర్ కాంగ్రెస్‌లో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నాయకుడు ఇప్పుడు ఏమైపోయాడు....? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన, ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదెందుకు? ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా...పార్టీ ఎందుకు పట్టించుకోవడంలేదు...? రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం ఆయన్ను మరిచిపోయిందా...? టీపీసీసీ ముఖ్య నాయకులపై సదరు నేత కుటుంబ సభ్యులు ఎందుకు ఆవేదనగా ఉన్నారు?

ఒకప్పుడు గ్రేటర్ కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన నేతల్లో ఒకరు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. పీజేఆర్ మరణాంతరం ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ ఇద్దరూ నగర కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉండేవారు. గ్రేటర్ పార్టీని వారే లీడ్ చేసేవారు. వీరిద్దరినీ అప్పట్లో హైదరాబాద్ బ్రదర్స్ అని పిలిచేవారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో అటు దానం నాగేందర్‌తో పాటు ముఖేష్ గౌడ్‌కు కాంగ్రెస్ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చింది. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ముఖేష్ గౌడ్ మాత్రం ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి పార్టీలో చేరాలనే ఆఫర్లు వచ్చినా ఆయన మాత్రం హస్తాన్ని వీడకుండా కంటిన్యూ అవుతున్నారు. తనకు గుర్తింపు నిచ్చిన పార్టీలోనే చివరి శ్వాస వరకు కొనసాగుతానని చెప్పుకొస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లోనే ఉన్నా ముఖేష్ గౌడ్ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నగరానికి వచ్చినా ఆయన మాత్రం ఆ సభలకు హాజరు కాలేదు.

నిజానికి తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2014 ఎన్నికల తర్వాత, ముఖేష్ గౌడ్ సైలెంట్ అయిపోయారు. ఇక అదే సమయంలో రాష్ట్రకాంగ్రెస్‌ నాయకత్వంలో కూడా మార్పులొచ్చాయి. నగరంలో ఒకప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఫ్రంట్ లైన్‌లో ఉండే ముఖేష్ గౌడ్ పట్ల, కొత్త నాయకత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న వాదనలున్నాయి. దాంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు క్రమంగా దూరమవుతూ వచ్చారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖేష్ గౌడ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నగరంలో స్థబ్దుగా మారిన కాంగ్రెస్‌లో జోష్ తీసుకురావడానికి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత పెంచడానికి తన నివాసంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. నేతలందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. దాంతో ఇక ఆయన గ్రేటర్‌లో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తారని అందరూ ఊహించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి మళ్లీ ఆయన ఎక్కడా కనిపించకుండా పోయారు. దాంతో ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే చర్చ మొదలైంది..

అసలే ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తుండటంతో ముఖేష్ గౌడ్ పేరు మళ్లీ తెరమీదకొచ్చింది. ఆయన సైతం కమలం పార్టీతో కరచాలనానికి సిద్దమయ్యారని, చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ గ్రేటర్ కాంగ్రెస్‌ లీడర్‌ కూడా చాలాకాలంగా కనిపించకుండా పోవడంతో ఫిరాయింపు వార్తలు మరింత జోరందుకున్నాయి. అవన్నీ ఫేక్ న్యూసేనని ఆయన వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. ఆయన సైలెంట్ కావడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయి.

ముఖేష్ గౌడ్ ఏడు మాసాలుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంటున్నారు. నోటి కేన్సర్, కంటి కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన దానికి ట్రీట్ మెంట్ పొందుతున్నారట. వైద్యులు ఇప్పటికే ఏడు సర్జరీలు చేశారట. అయినప్పటికీ ఆయన కండీషన్ మాత్రం ఇంకా సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు మాసాలుగా ఆయన కన్ను కూడా తెరవలేదంటే సరిస్థితి అర్థంచేసుకోవచ్చు. మెరుగైన వైద్యం కోసం అమెరికా తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట. అయితే వైద్యులు మాత్రం కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారట. అలా కదలలేని స్థితిలో బెడ్ మీదున్న ఆయన పార్టీ మారుతున్నారంటూ ఫుకార్లు రావడంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

అదలా ఉంచితే పార్టీ సీనియర్ లీడర్ గత కొంత కాలంగా పార్టీకార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, టీపీపీసీ ముఖ్య నాయకులు మాత్రం ఎందుకు? ఏమిటీ? ఏమైందని కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడు మాసాలుగా ఒక ముఖ్య నాయకుడు అనారోగ్యంతో బాధపడుతుంటే, పీసీసీ అధ్యక్షుడు గానీ సీఎల్పీ నేత గాని పలకరించిన పాపానపోలేదట. ఆస్పత్రికి వెళ్లీ పరామర్శించలేదట. అయితే ఆయన హస్పిటల్‌లో ఉన్న విషయం తెలుసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించరాట. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి వచ్చారట. ఇక చాలా మంది టీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు ఏపీకి ముఖ్య నాయకులు సైతం పరామర్శించారట. ఇతర పార్టీ నాయకులు, పక్కరాష్ట్ర కీలక నేతలు సహా ఎంతో మంది నాయకులు కష్టంలో ఉన్నారని తెలుసుకుని వస్తున్నారు కానీ సొంత పార్టీ పీసీసీ, సీఎల్పీ నేతలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
లైవ్ టీవి


Share it
Top