టీఆర్ఎస్‌ మీటింగ్‌కు డీఎస్‌ అటెండ్‌ అవడం వెనక?

టీఆర్ఎస్‌ మీటింగ్‌కు డీఎస్‌ అటెండ్‌ అవడం వెనక?
x
Highlights

మీరు కౌన్‌ బనేగా కరోడ్‌ పతి, షో చూసే వుంటారు. అమితాబ్ బచ్చన్‌, వన్‌ ల్యాక్ క్వశ్చన్, టెన్‌ ల్యాక్స్ క్వశ్చన్‌ అంటూ చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రతి...

మీరు కౌన్‌ బనేగా కరోడ్‌ పతి, షో చూసే వుంటారు. అమితాబ్ బచ్చన్‌, వన్‌ ల్యాక్ క్వశ్చన్, టెన్‌ ల్యాక్స్ క్వశ్చన్‌ అంటూ చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మల్టీపుల్ ఛాయిస్ ఇస్తుంటారు. మీకిప్పుడు నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. నాలుగు ఆప్షన్స్‌ కూడా ఇస్తాను. ఇంతకీ క్వశ్చన్‌ ఏంటంటే. తెలంగాణలో మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు డి.శ్రీనివాస్‌, ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు. ఆప్షన్‌ ఏ)టీఆర్ఎస్, ఆప్షన్‌ బీ)కాంగ్రెస్, ఆప్షన్‌ సి)బీజేపీ,ఆప్షన్‌ డి)పైవేవి కావు. ఇంతకీ మీ ఆన్సరేంటి మీ ఛాయిస్ ఏంటి. టీఆర్ఎస్‌ కార్యకర్తలకే అర్థంకావడం లేదంట డీఎస్ ఏ పార్టీలో ఉన్నారో. లేటెస్టుగా ఢిల్లీలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌లో సడన్‌గా డీఎస్‌ ప్రత్యక్షం కావడంతో, కన్‌ఫ్యూజన్‌ మరింత పెరిగిందే కానీ, తగ్గింది లేదు. ఇంతకీ డీఎస్ ఏ పార్టీలో ఉన్నారు. ఢిల్లీ మీటింగ్‌కు అటెండ్ కావడం వెనక మతలబు ఏంటి?

ఇదిగో ఇప్పుడు ఈ ఫోటోనే, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. ఒక్క ఫోటో వంద మాటలతో సమానమంటారు. మరి ఈ ఫోటో వెనక అసలు కథేంటి అన్నది ఉత్కంఠకు కారణమవుతోంది. ఎందుకంత ఉత్కంఠ అంటే, మొన్నటి వరకు డి.శ్రీనివాస్ అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా ఎవరికీ అర్థంకాలేదు. అటు కేసీఆర్ కూతురుపై, డీఎస్ కొడుకు అర్వింద్ విజయం సాధించడం, ఆ తర్వాత కొడుకుతో కలిసి డీఎస్ ఓ సదస్సుకు హాజరుకావడంతో, ఆయన పార్టీ మారతారన్న చర్చ కూడా జోరుగా సాగింది. ఈ పరిణామాలన్నింటిలో, అంతకుమించి అన్నట్టుగా ఢిల్లీలో ఈ దృశ్యం ఆవిష‌్కృతమైంది. టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీగా డీఎస్ హాజరుకావడం, ఫోటో క్లిక్‌మనడం, తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇంతకీ ఫోటో వెనక అసలు స్టోరి ఏంటి?

గత కొంతకాలంగా టీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టీఆర్ఎస్ అగ్రనేత కె.కేశవరావు అధ్యక్షతన బుధవారం పార్లమెంటు భవనంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఎస్ హాజరు కావడం అంతటా చర్చనీయాంశమైంది. అయితే డీఎస్‌ను పార్టీ నేతలే ఆహ్వానిచారా లేక ఆయనే వెళ్లారా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత డీఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన సీనియారిటిని గుర్తిస్తూ, గులాబీ బాస్ రాజ్యసభ సభ్వత్వం కూడా ఇచ్చారు. అయితే నిజామాబాద్ రాజకీయాల్లో ఏం జరిగిందో కాని, ఒక్కసారిగా అక్కడి నేతలంతా ఎంపీ కవిత నేతృత్వంలో నాటి మంత్రి, నేటి స్పీకర్ పోచారంతో పాటు అంతా డీఎస్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డీఎస్‌పై, కేసీఆర్‌కు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ఎస్‌లో డీఎస్‌ను దూరం పెట్టారు.

డీఎస్‌ కూడా పార్టీలో విభేదాల కారణంగా కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతారన్న ప్రచారం కూడా జరిగింది. తనపై వచ్చిన లేఖలోని ఆరోపణలను రుజువు చేయాలంటూ, పార్టీ అధినేతకు డీఎస్ లేఖ రాయడంతో అప్పట్లో టీఆర్ఎస్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో డీఎస్‌పై చర్యలు తీసుకుంటారని భావించినప్పటికీ కేసీఆర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తర్వాత వరుస ఎన్నికల్లో బిజీగా మారడంతో, పార్టీ అధిష్టానం ఆయన విషయాన్ని పట్టించుకోలేదు. దానికి తోడు ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరి జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నించారు. వరసు ఉద్యమాలతో టీఆర్ఎస్ సర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించిన టీఆర్ఎస్, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతింది. అటు నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి గెలుపొందారు. ఈ విజయం వెనక మొత్తం వ్యూహం డీఎస్‌దేనన్నది టీఆర్ఎస్ నేతల ఆరోపణ.

నిజామాబాద్ ఒక్కటే కాదు, అటు కరీనంగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో, టీఆర్ఎస్‌కు అనుకోని దెబ్బతగిలింది. పార్టీకి దూరంగా ఉంటూనే డీఎస్ చేయాల్సిందంతా చేశారని గులాబీ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఓ సామాజికవర్గం మొత్తాన్ని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో, బీజేపీకి డీఎస్ పరోక్షంగా సాయం చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఇప్పుడు తాజాగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్ హాజరుకావడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి, ఆధారాలతో సహా నిరూపించి వేటు వేయాలనుకుంటున్న వేళ, కేకే అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్ హాజరుకావడం సంచలనమైంది. కేకే, నామా నాగేశ్వర్ రావుల పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఆయనను ఎందుకు పిలిచారు, ఎందుకొచ్చారు, ఎందుకు సమావేశంలో కూర్చోబెట్టారన్నదానిపై సీరియస్‌ అయినట్టు సమాచారం. గతంలోనూ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసారు డీఎస్. ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు కూడా ప్రచారం జరిగింది కూడా. అయితే తానేమి పార్టీ కండువా కప్పుకోలేదని సోనియా, రాహుల్ గాంధీలను కేవలం మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన బదులివ్వడంతో పార్టీ వేటు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు డీఎస్.

పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు డీఎస్ ఇచ్చిన బదులు కూడా ఆసక్తి కలిగిస్తోంది. తానేమీ పార్టీకి దూరంగా జరగలేదని, వాళ్లు పిలిస్తేనే సమావేశానికి వెళ్లానని బదులిచ్చారు. మరోపక్క, సమావేశం గురించిన సమాచారాన్ని టీఆర్ఎస్ ఎంపీల వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం వల్లే, డీఎస్ వచ్చారని పార్టీ ఎంపీ, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు, కేసీఆర్‌కు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందని అంటున్నారు పార్టీ నేతలు. మొత్తానికి టీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో డీఎస్‌ సడన్‌గా కనిపించడం అనేక చర్చలకు దారి తీస్తోంది. కొడుకును గెలిపించుకున్న ఆనందంలో డీఎస్ వుంటే, కూతురును ఓడించారన్న కోపంతో కేసీఆర్‌‌ ఉన్నారు. దీంతో డీఎస్‌పై వేటు తప్పదని భావిస్తున్న వేళ, పార్టీ మీటింగ్‌కు అటెండ్‌ కావడం సెన్సేషన్ అయ్యింది. డీఎస్‌ కావాలనే తన విధేయతను చూపించుకోవడానికి వచ్చారా....లేదంటే వాట్సాప్‌ పొరపాటు మెసేజ్‌తో అటెండయ్యారా అన్నది చర్చనీయాంశమైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories