ఈసీకి సవాల్ గా మారిన ఎన్నికలు...ఆర్టికల్ 324 సైతం ప్రయోగించిన ఈసీ
పంజరంలో చిలక సీబీఐ పై ఒకప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అది. మరి ఎన్నికల కమిషన్ కూడా అలానే మారిందా అవుననే అంటున్నాయి పలు విపక్షాలు. విపక్షాల...
పంజరంలో చిలక సీబీఐ పై ఒకప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అది. మరి ఎన్నికల కమిషన్ కూడా అలానే మారిందా అవుననే అంటున్నాయి పలు విపక్షాలు. విపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికల నిర్వహణ అంత సులభమేమీ కాదు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల సంఘంపై ఎన్నో ఒత్తిళ్ళు విమర్శలు ఆరోపణలు. వాటన్నిటి మధ్య చివరి దశ ప్రచార అంకం ముగిసింది. గతంలో మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్నికల సంఘం తాజాగా పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రధాని మోడీ పై చేసిన విమర్శలకు క్లీన్ చిట్ ఇచ్చింది. బహుశా అలా క్లీన్ చిట్టాపద్దును బ్యాలెన్స్ చేసిందేమో.
అమెరికా, బ్రిటన్ లతో సహా పలు దేశాల్లో ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది. పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్ట సభలు కూడా ఎన్నికల సంఘం నియామక ప్రక్రియలో పాలుపంచుకుంటాయి. మనదేశంలో మాత్రం ఎన్నికల కమిషనర్లను ప్రభుత్వం ఏకపక్షంగా నియమిస్తోంది. వారి నిర్వహణ తీరుతెన్నులను పక్కనబెడితే, సిద్ధాంతపరంగా ఇదే అంశం ఎంతో కీలకంగా మారింది. ఎన్నడూ లేనిది కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. మరోవైపున పలు పార్టీలు ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు, ఆరోపణలు గుప్పించాయి. గతంలో కంటే తీవ్రస్థాయిలో ఎన్నికల సంఘం పై చర్చ మొదలైంది.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యవస్థల్లో ఒకటిగా భారత ఎన్నికల సంఘాన్ని రూపొందించారు. అయితే తన శక్తిని అది ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటుందనే అంశంపైనే దాని విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. 1952 నుంచి ఇప్పటి వరకూ దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అవేవీ కూడా ప్రస్తుత ఎన్నికల మాదిరిగా వివాదాస్పదం కాలేదు. దేశంలో ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఎన్నికల సంఘం అత్యంత శక్తివంతమైందిగా మారుతుంది. సుప్రీంకోర్టు కూడా దాని విషయంలో జోక్యం చేసుకోలేదు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత న్యాయస్థానాలు ఆ ప్రకియలో జోక్యం చేసుకోవడాన్ని ఆర్టికల్ 329 నిరోధిస్తుంది. ఆ విషయం తెలిసి కూడా సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎన్నికల సంఘం తీరుపై ఆరోపణలు ఏ స్థాయిలో వెల్లువెత్తాయో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి కూడా కాదు రెండు సార్లు ఎన్నికల సంఘం అంశం సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. మొదటి సందర్భంలో సుప్రీం కోర్టు అసలు మీకు అధికారాలు ఏమిటో మీకు తెలుసా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఇక మరో సందర్భంలో మోడల్ కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించింది. ఒక సమున్నత వ్యవస్థను మరో సమున్నత వ్యవస్థ నిలదీసే పరిస్థితి రావడం దురదృష్టకరం. రెండింటిలో ఏది సమున్నతమైంది అనే చర్చకు ఇక్కడ తావు లేదు. అలాంటి పరిస్థితి రావడమే ఎన్నికల సంఘంపై మచ్చలా పడింది. తనకు గల అధికారాలేమిటనే అంశంపై ఒక వ్యవస్థను మరో వ్యవస్థ మేల్కొపాల్సి వచ్చింది.
ఎన్నికల సంఘాలనికి విశేష అధికారాలున్న మాట నిజమే. మరీ ముఖ్యంగా ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఏ న్యాయస్థానం కూడా అందులో జోక్యం చేసుకోలేదు. అలా అని చెప్పి ఎన్నికల సంఘం నిరంకుశంగా వ్యవహరించిన దాఖలాలు కూడా లేవు. శేషన్ లాంటి వ్యక్తుల హయాంలో మాత్రం ఎన్నికల సంఘం క్రియాశీలకంగా వ్యవహరించింది. అప్పట్లో ఎన్నికల సంఘం యాక్టివిజాన్ని ఏ పార్టీ కూడా భరించలేకపోయింది. మొత్తానికి అన్ని పార్టీలు కలసి ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించాయి. మరో ఇద్దరు కమిషనర్లను నియమించేందుకు వీలు కల్పించాయి. అదంతా గతం. ప్రస్తుతానికి వస్తే కొందరు నేతలు చేసిన ప్రసంగాలపై విమర్శలు వచ్చాయి. ఆ సందర్భంలో సుప్రీం కోర్టు ఎన్నికలసంఘానికి దాని అధికారాలను గుర్తు చేసింది. దాంతో యోగి ఆదిత్యానాథ్ ను 72 గంటల పాటు, మాయావతిని 48 గంటల పాటు ప్రచారపర్వానికి దూరంగా ఉండాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక మరో సందర్భంలో సుప్రీం కోర్టు ప్రధాని మోడీ పై వచ్చిన ఆరోపణల విషయంలో తీసుకున్న నిర్ణయమేంటని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. దీంతో మోడీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. అలా ప్రధాని మోడీకి ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భాలు మరో మూడు, నాలుగు కూడా ఉన్నాయి. మరో వైపున ప్రధాని మోడీపై అభ్యంతరకర విమర్శలు చేసిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు కూడా ఎన్నికల సంఘం తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. పని తక్కువ మాటలు ఎక్కువ అని చెప్పేందుకు సిద్దూ ఒక ముతక పోలిక చేశారు. గాజుల చప్పుడు ఎక్కువగా ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా ఆ నవ వధువు బాగానే పని చేస్తున్నట్లు భావిస్తారని సిద్ధూ మాటలకు అర్థం. ఏమైతేనేం అటు మోడీ ఇటు సిద్ధూ ఇద్దరూ క్లీన్ చిట్ లతో బయటపడ్డారు. మోడీ ప్రసంగానికి క్లీన్ చిట్ ఇవ్వడంపై ఎన్నికల సంఘం కమిషనర్లలో విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఏమైతేనేం నిర్ణయాన్ని ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంచకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం కూడా ముఖ్యమే.
ఇన్ని దశాబ్దాల కాలంలో ఎన్నికల సంఘం క్రియాశీలకంగా వ్యవహరించిన దాఖలాలు అతి తక్కువే. ఎన్నికల సంఘాన్ని నియమించే తీరు, తొలగించే తీరు కూడా అందుకు ప్రధాన కారణమనే చెప్పవచ్చు. ఇతర ప్రజాస్వామిక దేశాలకు భిన్నంగా మన దేశంలో ఎన్నికల సంఘం నియామకం ఉంటోంది. ఈ నియామకంలో ప్రభుత్వమే కీలకపాత్ర పోషిస్తోంది. చట్టసభలకు, ఇతర వ్యవస్థలకు ఈ నియామకంతో ప్రమేయం ఉండడం లేదు. ఒక కొలీజియం చే నియమించబడడం, పార్లమెంటరీ కమిటీ స్క్రీనింగ్ చేయడం, పార్లమెంట్ ధ్రువీకరించడం లాంటి ప్రక్రియలేవీ ఇందులో లేవు. అంతా ప్రభుత్వ ఇష్టానుసారం జరుగుతోంది. ఎన్నికల సంఘం నియామకాన్ని సంస్కరించేందుకు గతంలోనూ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించడంతో అవన్నీ విఫలమయ్యాయి. 225వ లా కమిషన్ నివేదిక ఎన్నికల సంఘం నియామకానికి ఒక కొలీజియం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రధాని, విపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అందులో సభ్యులుగా ఉండాలని సిఫారసు చేసింది. ఇదే విషయమై 2018లో సుప్రీం కోర్టులో ఒక పిల్ కూడా దాఖలైంది. రాజ్యాంగ బెంచ్ ఈ పిల్ ను విచారించాల్సి ఉంది. ఇక ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగానే ఉంది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ కు మాత్రమే రక్షణ ఉంది. మిగితా ఇద్దరు కమిషనర్లపై ప్రభుత్వ ఒత్తిళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంది. పార్టీలను రిజిష్టర్ చేసే అధికారం ఉన్న ఎన్నికల సంఘానికి ఆ నమోదును తొలగించే అధికారం మాత్రం లేదు. ఈ విషయంలో సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం ఇరవై ఏళ్ళుగా పోరాడుతున్నా ఫలితం లేదు.
మాకు అధికారాలు లేవు మేము శక్తి హీనులం నోటీసులు మాత్రమే జారీ చేయగలం సలహాలు మాత్రమే ఇవ్వగలం మరీ ముదిరితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ఇవీ గతంలో సుప్రీం కోర్టు ముందు ఎన్నికల సంఘం చెప్పిన మాటలు. ఆ తరువాత సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఎన్నికల సంఘం తన అధికారాలను గుర్తుకు చేసుకుంది. తాజాగా ఆర్టికల్ 324 కింద బెంగాల్ లో ప్రచార పర్వాన్ని ఒక రోజు ముందుగానే ముగించింది. ఇక తదుపరి దశ అయిన కౌంటింగ్ కూడా కీలకమే. అప్పుడు వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి ఇప్పుడు నెలకొంటోంది.
ఎన్నికల సంఘం తీసుకున్న పలు చర్యలు విపక్షాల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికే వస్తే కేబినెట్ సమావేశం విషయంలో ఉత్కంఠపై తెలుగుదేశం పార్టీ విమర్శించింది. చంద్రగిరి ఉప ఎన్నిక విషయంలో నెల రోజుల తరువాత వచ్చిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవడమేంటని ప్రశ్నించింది. ఇక పశ్చిమ బెంగాల్ లో ఆర్టికల్ 324 ఉపయోగించి ప్రచారపర్వానికి ఒక రోజు ముందే తెర వేయాలన్న నిర్ణయంపై కూడా విమర్శలు తప్పలేదు. ప్రధాని మోడీ సభలు ఉన్నందునే తక్షణమే గాకుండా రాత్రి 10 గంటల నుంచి ప్రచారానికి తెర వేశారని మాయావతి, మమతాబెనర్జీ లాంటి నాయకులు విమర్శించారు. వీవీప్యాట్ ఓట్ల లెక్కింపు విషయంలో విపక్షాలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అవి మోడీ కోడ్ ఆఫ్ మిస్ కండక్ట్ గా అభివర్ణించాయి. ప్రధాని మోడీ మాత్రం విపక్షాలు నిరాశతోనే తనపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. విపక్షాలు తనను ఎంతగా తిడితే ప్రజలు తనను అంతగా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల సంఘంపై విమర్శలు మొదలయ్యాయి. ప్రచారపర్వం ముగిసే నాటికి అవి మరింత తీవ్రమయ్యాయి. విమర్శల్లో నిజం సంగతి ఎలా ఉన్నా ఎన్నికల సంఘం మాత్రం విశ్వసనీయత కోల్పోయింది. నమో టీవీ ఉదంతం, ప్రధాని లగేజీ తనిఖీ ఉదంతం, కొన్ని ఈవీఎంలు సరిగా పని చేయకపోవడం, బోగస్ ఓట్లు, ప్రచారంలో ధన ప్రవాహం, నేతల దిగజారుడు విమర్శలు, ప్రచారంలో సైన్యం పేరు ప్రస్తావించడం, ఎన్నికల సంఘం వద్ద ఉన్న మొత్తం ఈవీఎంల సంఖ్య ఇలా చెబుతూపోతే మరెన్నో అంశాలు. వాటిపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణలు మాత్రం అంత సంతృప్తికరంగా లేవనే పలువురు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం మాత్రమే కాదు అలా జరిగినట్లు కన్పించడం కూడా ముఖ్యమే. ప్రజాస్వామ్యంలో అంతకు మించింది మరొకటి లేదు. అదే ప్రజాస్వామ్యానికి రక్ష.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire