కనిపించని ప్రత్యర్థి తో చేసిన యుద్ధంలో ప్రధాని మోడీ విజయం సాధించినట్లుగానే ఎగ్జిట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ ఫలితాలను పూర్తిగా...
కనిపించని ప్రత్యర్థి తో చేసిన యుద్ధంలో ప్రధాని మోడీ విజయం సాధించినట్లుగానే ఎగ్జిట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్ ఫలితాలను పూర్తిగా విశ్వసించలేనప్పటికీ అన్ని సంస్థల ఎగ్జిట్ ఫలితాలు కూడా బీజేపీ కూటమి ఆధిక్యాన్నే సూచించాయి. దేశంలో నిజంగా ఇది ఒక సంధి కాలం. ఒక వైపున బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తి చేసుకొని మరో అవకాశం కోసం బరిలోకి దిగింది. మరో వైపున కాంగ్రెస్ ఉనికి కాపాడుకునే ఆత్మరక్షణలో పడింది. ఆ రెండు పార్టీలకు కూడా ఒక అరడజను రాష్ట్రాలు యుద్ధ రంగాలుగా మారాయి. అదే సమయంలో అక్కడి ప్రాంతీయ పార్టీలు సైతం జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారడం విశేషం.
తాజాగా వెల్లడైన ఎగ్జిట్ ఫలితాలను బట్టి చూస్తే ఐదేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కుంచుకునేందుకు ఉరకలు వేస్తోంది. మరో వైపున కాంగ్రెస్ ఉనికి కాపాడుకునే ఆత్మరక్షణలో పడిపోయింది. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు కొన్ని రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి. యుద్ధ రంగాలుగా మారిన ఆ ఆరు రాష్ట్రాలు దేశ భవితను నిర్ణయించడంలో కీలకంగా మారాయి.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిషా ఈ ఆరు రాష్ట్రాలు భారత్ ఎన్నికల ఫలితాలను శాసించనున్నాయి. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఏ పార్టీదో నిర్ణయించనున్నాయి. భౌగోళికంగా పెద్దవి కావడం, అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు ఉండడం అని మాత్రమే గాకుండా అక్కడి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా అవెంతో కీలక రాష్ట్రాలుగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచే పార్టీ లేదా కూటమిని నిర్ణయించడంలో కీలకపాత్ర వహించే రాష్ట్రాలు కచ్చితంగా పెద్దవే అయి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ ఒక పార్టీ లేదా కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్యను బట్టి అవి ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
మిగితా రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సరికొత్త యుద్ధరంగంగా అవతరించింది. 2014లో కూడా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ తలపడినప్పటికీ, ఈ సారి మరింత గట్టి పోటీ ఇచ్చింది. అక్కడ మొత్తం 42 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ 34 స్థానాల్లో గెలుపొందడం విశేషం. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలిచింది. సీపీఎం, బీజేపీ చెరో రెండు స్థానాలు సాధించాయి. ఈ దఫా మాత్రం అక్కడ కమల వికాసం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం అక్కడ బీజేపీకి కనిష్టంగా 11 నుంచి గరిష్ఠంగా26 వరకు వచ్చే అవకాశం ఉంది. తృణమూల్ కు కనిష్ఠంగా 19 నుంచి గరిష్ఠంగా 29 వరకు వచ్చే వీలుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే అక్కడ బీజేపీ గరిష్ఠంగా 24 స్థానాలను అదనంగా సాధించే అవకాశం ఉంది. అందుకే బీజేపీ పశ్చిమ బెంగాల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తృణమూల్ కూడా బీజేపీని అదే స్థాయిలో ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. మోడీ, అమిత్ షా ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేసింది. తృణమూల్ ను దెబ్బ తీసేందుకు సీపీఎం కార్యకర్తలు సైతం బీజేపీ కి ప్రచారం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇక ఇక్కడ కాంగ్రెస్ గరిష్ఠంగా రెండు సీట్లను గెలువ వచ్చు. అసలు ఒక్క సీటు గెలవకపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. తృణమూల్ గనుక బాగా దెబ్బతింటే అది విపక్షం ఆశలకు విఘాతం కలిగించినట్లే అవుతుంది.
ఒడిషా కూడా అత్యంత కీలక రాష్ట్రమే. అక్కడ బిజూ జనతాదళ్ ను బీజేపీ బలంగా ఎదుర్కొంటోంది. ఇక్కడ మొత్తం సీట్ల సంఖ్య 21. గత ఎన్నికల్లో బిజూ జనతాదళ్ 20 సీట్లలో గెలుపొందింది. బీజేపీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఈసారి మాత్రం సీన్ మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టిన రాష్ట్రాల్లో ఒడిషా కూడా ఒకటి. అందుకే ఈ రాష్ట్రం కూడా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఒడిషాలో ఈసారి బిజూ జనతాదళ్ కనిష్ఠంగా ఏడు, గరిష్ఠంగా 19 సీట్లను గెలచుకునే అవకాశం ఉంది. బీజేపీ 6 నుంచి 14 సీట్లలో విజయం సాధించే వీలుంది. కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే ఒడిషాలో బీజేపీ గరిష్ఠంగా 12 సీట్లు అదనంగా సాధించే అవకాశం ఉంది.
తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 39 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్నా డీఎంకే 37 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, పీఎంకే చెరో స్థానంలో విజయం సాధించాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏఐడీఎంకే, బీజేపీ కలసి కనిష్ఠంగా 2 గరిష్ఠంగా 12 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అంటే అదనంగా 11 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం పొందే సూచనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే కలసి కనిష్ఠంగా 22, గరిష్ఠంగా 36 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక్కో చానల్ ఎగ్జిట్ పోల్స్ ఒక్కో రకంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో చాలా తేడాలున్నాయి. అవెలా ఉన్నా కూడా తమిళనాట బీజేపీ తన ప్రాబల్యం చాటుకునే అవకాశం ఏర్పడింది. కోల్పోయే సీట్ల స్థానంలో కొత్తగా గెలుచుకునే స్థానాల సంఖ్యను అధికం చేసుకోవడం ద్వారా ఆధిక్యం సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. ఆ వ్యూహం ప్రకారమే బెంగాల్, ఒడిషా, తమిళనాడులలోకి బీజేపీ చొచ్చుకెళ్ళగలిగింది.
ఉత్తరప్రదేశ్, బీహార్ ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంపీ స్థానాలను అత్యధికంగా కలిగి ఉంటూ సంప్రదాయక యుద్ధరంగాలు అవి ప్రఖ్యాతి గాంచాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, బీజేపీ లు తలపడిన మహారాష్ట్ర కూడా కీలకంగా మారింది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ దఫా అత్యంత ఆసక్తిదాయక విశేషాలు చోటు చేసుకోనున్నాయి.
యూపీలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 73 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచాయి. ఈ దఫా మాత్రం అక్కడ పరిస్థితి మారబోతున్నదని ఎగ్జిట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ కూటమి కనిష్ఠంగా 33, గరిష్ఠంగా 68 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. మహాఘటబంధన్ 7 నుంచి 45 స్థానాల్లో గెలిచే వీలుంది. కాంగ్రెస్ కనీసం 1, గరిష్ఠంగా 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం మీద యూపీలో బీజేపీ కొన్ని సీట్లను కోల్పోయే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అయితే బెంగాల్, ఒడిషా, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో అదనంగా గెలుచుకునే సీట్లతో ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే పలు ప్రాంతాల్లో బలహీన అభ్యర్థులను బరిలోకి దింపింది. పొత్తు కుదుర్చుకోవడం కంటే కూడా కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే ప్రభుత్వ అనుకూల ఓట్లను చీల్చవచ్చని విపక్షాలు భావించాయి. ఆ వ్యూహం ఫలిస్తుందా లేదంటే బెడిసికొట్టిందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
బీహార్ లో మొత్తం సీట్లు 40. గతంలో ఇక్కడ బీజేపీ కూటమి 28 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్జేడీ నాలుగు స్థానాలు పొందింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది. తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే బీహార్ లో బీజేపీ కూటమి కనిష్ఠంగా 30, గరిష్ఠంగా 34 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ 6 నుంచి 10 స్థానాలు గెలిచే వీలుంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ మొత్తం సీట్లు 48. గతంలో బీజేపీ కూటమి 42 సీట్లలో విజయం సాధించింది ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అక్కడ బీజేపీ కూటమి కనిష్ఠంగా 38, గరిష్ఠంగా 42 గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ కనిష్ఠంగా 6, గరిష్ఠంగా 10 స్థానాల్లో విజం సాధించే వీలుంది. మొత్తం మీద బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి గెలుపొందే స్థానాల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
వరుసగా ఐదేళ్ళు పాలించిన పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడం సహజమే. అలాంటి వ్యతిరేకతను బీజేపీ ఎంతో ముందునుంచే పసిగట్టింది. అందుకే రెండేళ్ళ నుంచీ కొత్త మిత్రపక్షాలను చేరువ చేసుకోవడం పై దృష్టి సారించింది. అప్పటి వరకూ బీజేపీ పెద్దగా ఉనికి చాటుకోని రాష్ట్రాల్లో ప్రాబల్యం చాటుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరీ ముఖ్యంగా తీరప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలపై కూడా దృష్టి సారించింది. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ వహించింది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వల్ల కోల్పోయే స్థానాల కంటే కూడా ఎక్కువ సీట్లను అదనంగా పొందే అవకాశం బీజేపీకి ఏర్పడింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. బీజేపీ విస్తరణ వ్యూహంతో పోలిస్తే కాంగ్రెస్ వ్యూహం విఫలమైంది. పలు రాష్ట్రాల్లో అది ఉన్న బలాన్ని కూడా చేజార్చుకుంది. అవన్నీ కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేశాయి. మొత్తం మీద పోల్ మేనేజ్ మెంట్, ప్రచార వ్యూహం, సాంకేతికత వినియోగం లాంటి అంశాలపై తాజా ఎన్నికలు మరెన్నో పాఠాలు కూడా నేర్పాయి. అదే సమయంలో ధన ప్రవాహం, ఓటింగ్ మెషిన్లు, నాయకుల కోడ్ ఉల్లంఘనలు, ప్రసంగాల్లో విమర్శలు లాంటివి కూడా తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికలు పలు పార్టీల అంతర్గత వ్యవహారాలను కూడా ప్రభావితం చేయనున్నాయంటే అతిశయోక్తి కాదు. మొత్తం మీద దేశ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలుగా వీటిని చెప్పవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire