Top
logo

అమెరికా - చైనా మధ్య ముదురుతున్న వివాదం...హువావేతో అనుబంధం భారత్ కు తప్పదా ?

అమెరికా - చైనా మధ్య ముదురుతున్న వివాదం...హువావేతో అనుబంధం భారత్ కు తప్పదా ?
X
Highlights

మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారో 23న తేలనుంది. ఎవరు అధికారంలోకి...

మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారో 23న తేలనుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా దేశీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. అలాంటి వాటిలో ముఖ్యమైంది టెలికాం రంగంలో 5జి. దేశంలో 4జి సృష్టించిన సంచలనం తెలిసిందే అంతకు మించిన విప్లవం 5జీ తో రానుంది. యావత్ ప్రపంచానికి ఆ సాంకేతికతను అందించేందుకు చైనా కంపెనీ హువా వే సిద్ధంగా ఉంది. ఇతర అగ్రరాజ్యాలు మాత్రం ఆ కంపెనీ ఉత్పాదనలపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా అమెరికా - చైనా ట్రేడ్ వార్ ముదిరిపోవడంలోనూ ఈ కంపెనీదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలో భారత్ ఏం చేయనుంది అనేదే ఇప్పుడు కీలకంగా మారింది. అసలు 5జీలో హువా వే వివాదమేంటి? భారతదేశంలో దాని స్థానమేంటి ? దేశభద్రతను పణంగా పెట్టాల్సిందేనా? రాబోయే ప్రభుత్వం ఎలా వ్యవహరించే అవకాశం ఉంది?

అమెరికా ప్రభుత్వం చైనా కంపెనీ హువావే పై విధించిన నిషేధం పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. నిషేధం నేపథ్యంలో గూగుల్, ఆండ్రాయిడ్, ఇంటెల్ లాంటి మరెన్నో కంపెనీలు హువా వేతో తమ అనుబంధాన్ని తెంచేసుకున్నాయి. హువా వే వివిధ దేశాలు నిషేధాలు, ఆంక్షలు ప్రకటించడం కొత్తేమీ కాదు. అయినా కూడా భారత్ తో సహా పలు దేశాలు హువా వే పై నిషేధం వేటు వేయలేకపోతున్నాయి. అందుకు ప్రధాన కారణం 5జీ టెక్నాలజీని ఆ కంపెనీ అత్యంత చౌకధరలకు అందించడమే. అలా అని చెప్పి దేశభద్రతను పణంగా పెట్టగలమా అనే ప్రశ్నలూ ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ప్రముఖ చైనా కంపెనీ హువా వేను అమెరికా నిషేధించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హువా వేతో అగ్రరాజ్యాల తగాదాలు ఇప్పటివేమీ కాదు. మరీ ముఖ్యంగా ఫైవ్ ఐస్ పేరిట కూటమిగా ఉన్న ఐదు దేశాలు మొదటి నుంచి కూడా చైనా కంపెనీల ఉపకరణాల గూఢచర్యంపై కన్నెర్ర చేస్తూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, బ్రిటన్, అమెరికా ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. కూటమిలోని ఒక్కో దేశం హువావే పై వేటు వేస్తూ వచ్చింది. ఇప్పుడు అమెరికా వంతు వచ్చింది. అవి హువావే పై వేటేసేందుకు అనేక కారణాలున్నాయి. పౌరహక్కుల అణచివేత, ఆంక్షలు విధించిన దేశాలకు టెక్నాలజీ సరఫరా, చైనా ప్రభుత్వం తరఫున గూఢచర్యం లాంటి సాకులు ఉన్నాయి. దేశీయంగా తమ కంపెనీలను లేదంటే మిత్రరాజ్యాల కంపెనీలను ప్రోత్సహించాలనే స్వీయప్రయోజన అజెండాలూ ఉన్నాయి. ఇక హువా వే పై నిషేధం విషయానికి వస్తే 2018 ఆగస్టులోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం హువావే ను తమ 5జీ కార్యక్రమంలో నిషేధించింది. హువా వే పేరును ప్రత్యేకంగా ప్రకటించకపోయినప్పటికీ, విదేశీ ప్రభుత్వం నుంచి న్యాయబద్ధం కాని ఆదేశాలు పొందే కంపెనీలు తమ దేశంలో 5జీ టెక్నాలజీని అందించేందుకు వీల్లేదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా విధించిన ఆ నిషేధం హువా వే పైనే అనే విషయం ఎవరికైనా తేలిగ్గానే అర్థమవుతుంది. హువా వే ప్రస్తుతం ఆస్ట్రేలియా లో 4జీ సేవలు అందిస్తోంది. త్వరలోనే 5జీ గనుక పూర్తిస్థాయిలో విస్తరిస్తే మరెన్నో ఉపకరణాలు ఇంటర్నెట్ కు అనుసంధానమవుతాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం హువా వే అందించే సాంకేతికతల్లో, ఉపకరణాల్లో చైనా గూఢచర్యానికి తోడ్పడేవి గోప్యంగా ఉన్నాయని భావిస్తోంది. ఇక న్యూజీలాండ్ కూడా ఆస్ట్రేలియా అడుగుజాడల్లోనే నడిచింది. 5జీ సాంకేతికతను అందించేందుకు తాము హువా వే ఉపకరణాలను వినియోగిస్తామని స్పార్క్ అనే మొబైల్ కంపెనీ న్యూజీలాండ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను న్యూజీలాండ్ ప్రభుత్వం తిరస్కరించింది. హువా వే ను నిషేధించాల్సిందిగా బ్రిటన్ ఎప్పటి నుంచో కోరుతోంది. బ్రిటన్ ఇప్పటి వరకూ నేరుగా హువా వే ను నిషేధించకపోయినా, ఆ కంపెనీపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాదిస్తోంది. హువా వే కంపెనీ అనుమానస్పద రీతిలో వ్యవహరించింది అనేందుకు ఆధారాలు లేనప్పటికీ, కీలక మౌలిక వసతుల కల్పనలో చైనా కంపెనీల ప్రమేయాన్ని బ్రిటన్ వ్యతిరేకిస్తోంది. కెనడా విషయానికి వస్తే అక్కడ 5జీ నెట్ వర్క్ లో చైనా కంపెనీల ప్రమేయం వద్దంటూ అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇక జర్మనీ ఇప్పటికే హువా వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా భవిష్యత్తుపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక జపాన్ సైతం హువా వే ఉత్పాదనల కొనుగోలుపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. హువావే ఉపకరణాలను వినియోగిస్తే.... వాటిని గూఢచర్యానికి చైనా ప్రభుత్వం ఉపయోగించుకునే వీలుందని పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ ఆందోళనతోనే అవి హువా వే ఉపకరణాలపై నిషేధం విధిస్తున్నాయి.

దేశంలో 5జీ ని తీసుకువచ్చేందుకు హువా వే ఉపకరణాలను వినియోగించడంపై పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధునాతన సాంకేతికత అత్యంత చౌకధరలకు లభిస్తుంటే వద్దనుకోగలమా అని కొందరు ఉన్నతాధికారులు అంటున్నారు. హువా వే ఉత్పాదనలపై పూర్తిగా నిషేధం విధించకున్నా వాటితో దేశభద్రతకు ప్రమాదం వాటిల్లకుండా వ్యూహాన్ని రూపొందించుకోవాలని మరి కొందరు అధికారులు సూచిస్తున్నారు. భారతదేశంలో 5జీ ట్రయల్స్ లో తమను అనుమతిస్తారన్న ఆశావాదంతో హువా వే ఉంది. తాజా ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చే కొత్త ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. నోకియా, ఎరిక్సన్ లతో పాటుగా చైనాకే చెందిన జెడ్ టీఈ కంపెనీ కూడా హువా వే కు గట్టిపోటీని ఇస్తున్నాయి. భారతదేశ సైబర్ చట్టాలకు అనుగుణంగానే తమ ఉత్పాదనలు ఉంటాయని హువా వే అంటోంది. అయితే భారతీయ సైబర్ చట్టాలు ఎంతో బలహీనంగా ఉన్నాయి. మరెన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిని కఠినంగా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో పేటెంట్స్, మేధో సంపత్తి హక్కులకు సంబంధించి చైనా కంపెనీల భాగస్వామ్యం పెరిగిపోతున్నది. అవి పెరిగిపోతున్నాయంటే దాని అర్థం రాయల్టీల రూపంలో భారీ మొత్తాలు చైనాకు వెళ్ళడమే. వైర్లెస్ టెక్నాలజీలో కొత్తగా పేటెంట్ పొందిన వాటిలో 36 శాతం చైనాకు చెందినవే. అంటే అమెరికా, యురోపియన్ సంస్థల ప్రాబల్యం తగ్గుదున్నదనే అర్థం. ఇది మొదటి నుంచీ ఈ రంగంలో ఉన్న చైనాయేతర కంపెనీలకు ఇబ్బందిగా పరిణమించింది. ఇప్పడు ఆ కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయాదేశాల ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. కంపెనీల మధ్య పోటీ క్రమంగా ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పెద్ద కంపెనీలు, ప్రభుత్వాలకు మధ్య పెరిగిపోతున్న అనైతిక బంధాలు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఇక్కడ ఆసక్తిదాయక అంశం మరొకటి కూడా ఉంది. టెలికాం రంగంలో ప్రమాణాలను నిర్దేశించేందుకు 3GPP, itU లాంటి వేదికలు ఉంటాయి. అలాంటి వేదికల్లోనూ 60 శాతం ప్రాతినిథ్యం చైనా కంపెనీలదే కావడం గమనార్హం. దాంతో నిర్దేశిత ప్రమాణాలు కలిగిన హువా వే లాంటి చైనా కంపెనీలే అంతర్జాతీయంగా టెలికాం రంగంలో రాజ్యమేలుతున్నాయి. హువా వే లాంటి సంస్థలు టెలికాం లో A టు Z ఉత్పత్తులను అందిస్తున్నాయి. అమెరికన్, యురోపియన్ కంపెనీలు సైతం హువా వే ఉపకరణాలను జోడిస్తూ తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

భారతదేశం విషయానికి వస్తే హువా వే లాంటి చైనా కంపెనీల ఉత్పాదనల వినియోగం పై నిషేధం విధించడం అంత తేలికేమీ కాదు. ప్రతీ విషయంలోనూ చైనా భారత్ పై రకరకాలుగా ఒత్తిళ్ళు తీసుకువస్తూ బేరసారాలు చేస్తోంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గాలంటే భారత్ మరే అంశంలోనో చైనాకు తలొగ్గాల్సి వస్తోంది. మరో వైపున పాకిస్థాన్ ను చైనా తన ఆయుధంగా ప్రయోగించే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకూ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా చైనా రోడ్ బెల్ట్ ప్రాజెక్ట్ లో చేరకుండా భారత్ గట్టిగా నిలబడగలిగింది. 5జీ విషయంలోనూ అలా చేయడం మాత్రం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. సాంకేతిక విప్లవం లేనిదే అగ్రరాజ్యాలతో పోటీ పడలేం. అలాంటి సాంకేతిక విప్లవం చౌకగా రావాలంటే చైనా ఉత్పత్తులు వాడక తప్పదు. ఆ ఉత్పత్తులు వాడడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు ఉందనుకుంటే ఆ ముప్పు రాకుండా ఉపకరణాల సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవడం ఒక్కటే మార్గం. భారతదేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడితేనే చైనా ఒత్తిళ్ళను తట్టుకునే అవకాశం ఉంది. తాజా ఎన్నికల్లో బీజేపీనే మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి నుంచి కూడా జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ హువా వే విషయంలో ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. హువా వే పై నిషేధం విధించాలని అమెరికా చేసే ఒత్తిళ్లను ఎదిరిస్తుందా లేదంటే చైనాతో అనవసర శత్రుత్వం ఎందుకని హువా వే ఉత్పత్తులను అనుమతిస్తుందా అలా చేస్తే అమెరికా ఊరుకుంటుందా ఇవన్నీ రాబోయే ప్రభుత్వానికి చిక్కుముళ్ళుగానే ఉంటాయి.

మొన్న 3జి నిన్న 4జి రేపు 5జి 2020 నాటికి దేశంలో 5 జీ అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. దేశంలో కొత్త ప్రభుత్వం రాగానే చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో 5 జి కోసం స్పెక్ట్రమ్ కేటాయించడం అత్యంత ముఖ్యమైంది. దేశాభివృద్ధిలో ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ సాంకేతికత ఎంతో కీలక పాత్ర వహిస్తోంది. దేశంలో డిజిటల్ అజెండాను ముందుకు తీసుకెళ్ళాలంటే 5జి విస్తృత స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం అధికారం లోకి రాగలదనుకుంటున్న బీజేపీ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందన్నది ఈ విషయంలో కీలకంగా మారింది.

హువా వే సంస్థ పట్ల బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన వ్యతిరేకత ఏదీ లేదు. కాకపోతే ఆ కంపెనీని కీలక మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం చేయడంపై అధికారుల్లోనే కొన్ని సందేహాలున్నాయి. అవి కూడా సహేతుకమైనవే. అందులో ముఖ్యమైంది చైనా కంపెనీ ఉపకరణాల్లో రహస్య గూఢచర్యానికి వీలు కల్పించేవేవి ఏవైనా ఉంటాయేమో అనేది. అందుకు కూడా అధికారులు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. సెక్యూరిటీ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు. ఆ దృష్టితో చూస్తే దేశంలో 5జీ మౌలిక వసతుల కల్పనలో హువా వే కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం హువా వే కంపెనీపై విధించిన నిషేధం భారతదేశంతో సహా అంతర్జాతీయంగా 5జీపై పెద్దగా ప్రభావం కనబరిచే అవకాశం లేదు. తాజాగా టెలికాం కార్యదర్శి అరుణ సుందర రాజన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

టెలికాం రంగంలో మౌలిక వసతుల కల్పన అనేది భారీ పెట్టుబడులతో కూడుకున్నది. నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు 4 జి నుంచి 5జి కి మారిపోయే పరిస్థితి కూడా లేదు. సాంకేతికత ఒక్కటి అందుబాటులో ఉంటే సరిపోదు. దాన్ని అందించేందుకు టెలికాం సంస్థలు కూడా సిద్ధంగా ఉండాలి. అందుకు భారీ పెట్టుబడులు అవసరం. అందుకే వొడాఫోన్ ఐడియా లాంటి పెద్ద సంస్థనే దేశంలో 5జీ రాకను కొన్నేళ్ళపాటు వాయిదా వేద్దామని సూచించింది. అధికార వర్గాలు మాత్రం అందుకు సిద్ధంగా లేవు. బీజేపీ కూడా సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ వచ్చింది. ఇటీవలి ఎన్నికల ప్రచారంలోనూ అది సాంకేతికతను విస్తృత స్థాయిలో వినియోగించుకుంది. మరో వైపున బీజేపీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పథకాల అమల్లో సాంకేతికత వినియోగానికి పెద్ద పీట వేసింది. అలా చూస్తే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ళకే 5జీ దేశంలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కీలక మౌలిక వసతుల కల్పన విషయంలో విదేశీ కంపెనీలు మరీ ముఖ్యంగా చైనా కంపెనీలపై ఒక కన్నేసి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది.

Next Story