బోండా ఉమ బంగీ జంప్‌ ఏ పార్టీలోకి?

బోండా ఉమ బంగీ జంప్‌ ఏ పార్టీలోకి?
x
Highlights

ఆయన అరుస్తాడు. బీపీ పెరిగితే కరుస్తానంటాడు. టీడీపీ హయాంలో అసెంబ్లీలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయాడు. కానీ వన్‌ ఫైన్ మార్నింగ్ ఓడిపోయాడు. కొన్నాళ్లు...

ఆయన అరుస్తాడు. బీపీ పెరిగితే కరుస్తానంటాడు. టీడీపీ హయాంలో అసెంబ్లీలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయాడు. కానీ వన్‌ ఫైన్ మార్నింగ్ ఓడిపోయాడు. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడు సడెన్‌గా బంగీ జంప్‌ చేస్తున్న వీడియో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతి త్వరలో డేరింగ్ జంప్ చేయబోతున్నానని సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకీ ఆ‍యనెవరు...ఆ బంగీ జంప్‌, ఏ పార్టీలోకి?

అవును. బోండా ఉమా మహేశ్వర రావు. విజయవాడ సెంట్రల్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయిన నాయకుడు. మరి ఎందుకు బంగీ జంప్ చేశాడు...త్వరలో ఈ బంగీ జంప్‌ లాంటి సాహసమేదో చేయబోతున్నానని ఎందుకు సింబాలిక్‌గా హింట్ ఇచ్చాడు? ఆయన జంప్‌ చేయబోతున్న పార్టీ ఏది?. బోండా ఉమ 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు, రకరకాల ఆరోపణలతో చాలా తక్కువ టైంలోనే పాపులరయ్యారు. పార్టీ అధినేతకు సైతం దగ్గరయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో, కేవలం 25 ఓట్ల ఓట్లతో ఓడిపోయారు బోండా ఉమ. అప్పటి నుంచి బోండా ఉమా, పార్టీకి దూరంగా ఉండటంతో, ఆ‍యనపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై, బోండా ఉమ కొంతకాలంగా అసహనంగా ఉన్నారని విజయవాడలో చర్చ జరుగుతోంది. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. పార్టీలోని కొంద‌రు నేతల తీరుపైన ఆయ‌న అసంతృప్తితో ఉన్నారట. మొన్న కాకినాడ‌లో జ‌రిగిన టీడీపీ కాపు నేత‌ల స‌మావేశంలోనూ ఆయ‌న పాల్గొన్నారు. తరువాత చంద్రబాబు త‌న నివాసంలో ఏర్పాటు చేసిన కీల‌క స‌మావేశానికి, విజ‌య‌వాడ‌లోనే ఉన్నా బోండా ఉమా రాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఉమా పార్టీ మారుతున్నార‌నే ప్రచారం మొద‌లైంది. ఇఫ్పుడు బంగీ జంప్‌ చేసి, త్వరలో మరో పార్టీలోకి జంప్‌ చేస్తానన్న హింట్ ఇవ్వడండో, బోండా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ జంప్‌ ఏ పార్టీలోకన్నదే ఉత్కంఠ కలిగిస్తోంది.

బోండా ఉమ, బంగీ జంప్‌తో, మరో పార్టీలోకి జంప్ చేస్తానని అయితే సంకేతమిచ్చారు. అయితే ఈయన ముందున్న ఆప్షన్స్ ఏవనే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ముందుగా వైసీపీలో అవకాశాలను పరిశీలిద్దాం. ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలోకే ఎవరైనా జంప్ చేస్తారు. కానీ బోండా ఉమ, గతంలో వైసీపీని, జగన్‌ను తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. అసెంబ్లీలో కాంట్రావర్సీ కామెంట్లతో రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు బోండా ఉమ వస్తానన్న వైసీపీ చేర్చుకోదన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న చర్చ. ఆల్రెడీ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యేగా బోండా మీద గెలిచిన మల్లాది విష్ణు ఉన్నారు. ఉమను చేర్చుకుంటే విష్ణు అలిగే అవకాశముంది. బోండా ఉమా మీద అనేక ఆరోపణలు కూడా చేసిన వైసీపీ, ఉమకు ఇప్పడు రెడ్ కార్పెట్ పరిస్తే, ప్రజల్లో చులకనయ్యే అవకాశముంది. బోండా ఉమతో వైసీీపీకి ఇఫ్పుడు అవసరం కూడా ఏమీ లేదంటున్నాయి ఆపార్టీ వర్గాలు. సో వైసీపీలోకి ఉమా వెళ్లే అవకాశం దాదాపుగా లేదన్నది ఇప్పుడు పరిస్థితులను బట్టి, అర్థమవుతోందని విశ్లేషకులంటున్నారు.

ఇక ఏపీలో వైసీపీ తర్వాత బోండా ముందున్న మరో ఆప్షన్స్‌‌గా జనసేనను చెబుతున్నారు కొందరు నేతలు. ఎందుకంటే, పవన్ కల్యాణ‌్, బోండా ఉమలది ఒకే సామాజికవర్గం. కాపు. దీంతో జనసేనలోకి బంగీ జంప్ చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందు, జనసేనపైన కూడా నోటికి బాగానే పని చెప్పారు ఉమ. జనసేనలోకి వెళతారన్న ప్రచారంపై, ఘాటుగా ఆన్సరిచ్చారు. తాను కాదు కదా, కనీసం తన కారు డ్రైవర్ కూడా జనసేనలోకి వెళ్లరని మాట్లాడారు. ఇన్ని మాటలన్న బోండా ఉమను, పవన్ కల్యాణ్ పార్టీలోకి చేర్చుకుంటారా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే జనసేనలోకి బంగీ జంప్ కష్టమేనా?

ఇక వైసీపీ, జనసేన కాకుండా బోండా ఉమా జంప్‌కు మిగిలిన అవకావం బీజేపీ. ఇప్పటికే బోండా ఉమకు అత్యంత సన్నిహితుడైన ఎంపీ కేశినేని నాని, బీజేపీలోకి వెళతారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ఇటు సొంత పార్టీ టీడీపీ, అటు ప్రత్యర్థి వైసీీపీలను విమర్శిస్తూ, బీజేపీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుంది కేశినేని తీరు. కొందరు బీజేపీ పెద్దలతోనూ నాని సమావేశం కావడం, ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. నాని బీజేపీలోకి వెళితే, ఆయనకు చాలా క్లోజయిన ఉమ కూడా అదే దారి పట్టడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ, సామాజికవర్గంతో పాటు బోండా ఉమలాంటి కాస్త నోరున్న సీనియర్ లీడర్లను కూడా లాగాలనుకుంటోంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు బోండాతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కాకపోయినా, కొన్ని నెలల తర్వాతైనా ఉమా, బీజేపీలోకి వెళ్లడం ఖాయమని, అందుకోసమే ఇలా బంగీ జంప్‌లతో టీజర్లు వదులుతున్నారన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి న్యూజిల్యాండ్ బంగీ జంప్ వీడియో విడుదల చేసి, తాను సైతం మరో పార్టీలోకి జంప్ చేస్తానని సిగ్నల్ ఇచ్చిన బోండా ఉమ, ఏ పార్టీలోకి జంప్‌ అన్నది మాత్రం తేల్చలేదు. టీడీపీలో ఉన్నా, లేకపోయినా లాభం లేదని, అతి త్వరలో జంప్‌ చేయాలని మాత్రం భావిస్తున్నారట ఉమ. చూడాలి, జంప్‌ ఏ పార్టీలోకో...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories