Farm App: సాగు పనుల్లో 'ఉబర్' విప్లవం.. ఇక ఫోన్ కాల్‌తో పొలంలోకి ట్రాక్టర్..!

Farm App: సాగు పనుల్లో ఉబర్ విప్లవం.. ఇక ఫోన్ కాల్‌తో పొలంలోకి ట్రాక్టర్..!
x

Farm App: సాగు పనుల్లో 'ఉబర్' విప్లవం.. ఇక ఫోన్ కాల్‌తో పొలంలోకి ట్రాక్టర్..!

Highlights

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు నేరుగా మీ పొలం గట్టు దగ్గరికే వచ్చేస్తాయి.

ఒకప్పుడు టాక్సీ కావాలంటే రోడ్డు మీద నిలబడి చేతులు ఊపాల్సి వచ్చేది. కానీ ఓలా, ఉబర్ వచ్చాక ఇంట్లో కూర్చునే కారును పిలుచుకుంటున్నాం. సరిగ్గా ఇదే టెక్నాలజీ ఇప్పుడు మన రైతన్నల ముంగిట చేరబోతోంది. నాగలి పట్టాలన్నా, మందు కొట్టాలన్నా, కోతలు కోయాలన్నా.. ఇక కూలీల కోసం వెతకాల్సిన పని లేదు, గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ట్రాక్టర్లు, డ్రోన్లు, హార్వెస్టర్లు నేరుగా మీ పొలం గట్టు దగ్గరికే వచ్చేస్తాయి.

తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న ఈ వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థ, రైతులకు మరియు యంత్రాల యజమానులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. ఇటీవల యూరియా యాప్ సాధించిన విజయంతో, సాగు పనులను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కూలీల కొరతతో సతమతమయ్యే రైతులకు ఇది వరం. నాట్లు, కోతల సీజన్‌లో యంత్రాలు దొరకక పంట పాడైపోయే రిస్క్ ఇక ఉండదు.డిమాండ్‌ను బట్టి ఇష్టానుసారంగా అద్దెలు వసూలు చేసే దళారీ వ్యవస్థకు చెక్ పడుతుంది. మార్కెట్ ధరల ప్రకారం సరసమైన రేటుకే యంత్రాలు అందుతాయి.

మందుల పిచికారీ కోసం డ్రోన్లను బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల మందు వృథా కాదు, రైతు ఆరోగ్యం కూడా దెబ్బతినదు.మీ ఆర్డర్ చేసిన ట్రాక్టర్ ఎక్కడ ఉంది? ఎప్పుడు వస్తుంది? అన్నది మీ ఫోన్‌లోనే చూసుకోవచ్చు. టెక్నాలజీపై అవగాహన లేని రైతుల కోసం క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు (AEO) అందుబాటులో ఉండి సహాయం చేస్తారు.

గతంలో ఏపీ ప్రభుత్వం యుటిలైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ ద్వారా ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టగా, తెలంగాణ ప్రభుత్వం అంతకంటే మెరుగైన ఫీచర్లతో, మరిన్ని యంత్రాలను జోడిస్తూ ఈ 'ఫామ్ యాప్'ను తీర్చిదిద్దుతోంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, యంత్రాల వాడకం పెరగడం వల్ల సాగు ఖర్చు తగ్గి, దిగుబడి పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.

వేలిముద్రతో ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో, నాగలి పట్టే రైతు కూడా టెక్నాలజీ సాయంతో లాభసాటి వ్యవసాయం చేయాలన్నదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ యాప్ అందుబాటులోకి వస్తే, తెలంగాణ వ్యవసాయ రంగం మరో మైలురాయిని అధిగమించినట్లే.

Show Full Article
Print Article
Next Story
More Stories