
తెలంగాణ రైతన్నలకు డబుల్ బొనాంజా.. ఈ నెలలోనే పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు
Good News : తెలంగాణ రైతులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందింది. గత కొన్ని నెలలుగా యాసంగి పెట్టుబడి సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ ఫిబ్రవరి నెల డబుల్ ధమాకా ఇవ్వబోతోంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నగదు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా, పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనుల కోసం డబ్బుల్లేక చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయడం లేదా బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం చేస్తున్నారు. గత జనవరిలోనే రైతు భరోసా నిధులు అందాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల మేరకు చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా జాప్యం జరిగింది. అయితే, తాజాగా ఈ సర్వే ప్రక్రియ పూర్తి కావడంతో ఫిబ్రవరి చివరి వారంలో నిధులను విడుదల చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడతను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర బడ్జెట్ కసరత్తు పూర్తి కావడంతో, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ₹2,000 చొప్పున జమ చేయనున్నారు. ఈ నిధులు కూడా ఫిబ్రవరి చివరి వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉండటంతో, అటు కేంద్రం సాయం, ఇటు రాష్ట్రం సాయం రెండు ఒకేసారి చేతికి అందనుండటం రైతులకు పెద్ద ఊరటనిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాటిలైట్ సర్వేలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాగులో లేని భూములకు కూడా గతంలో నిధులు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ఈసారి కేవలం పంట పండించే భూములకు మాత్రమే సాయం అందించాలని నిర్ణయించారు. సర్వే నివేదిక ప్రకారం సుమారు 10 శాతం భూముల్లో ప్రస్తుతం సాగు జరగడం లేదని తేలింది. అటువంటి భూములకు ఈసారి రైతు భరోసా నిలిపివేసే అవకాశం ఉంది. అర్హులైన మిగిలిన రైతులందరికీ ఎకరానికి రూ.6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ఈ ఫిబ్రవరి చివరి నాటికి పీఎం కిసాన్ రూ.2,000, రైతు భరోసా రూ.6,000 కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వం నుంచి అందే ఈ నిధులతో వడ్డీల భారం తగ్గుతుందని, సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చని అన్నదాతలు ఆశీభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య కాలంలో ఈ నగదు బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




