
Dragon Fruit : సామాన్య రైతును రాజుగా మార్చే పంట... లక్షల్లో లాభాలు
తక్కువ నీరు – తక్కువ ఖర్చుతో సాగు… మార్కెట్లో భారీ డిమాండ్‌తో రైతుకు స్థిరమైన అధిక ఆదాయం అందించే లాభదాయక పంట!
భారతదేశం అన్నపూర్ణమ్మ ఒడి. తరతరాలుగా మనకు వ్యవసాయమే జీవనాధారం. ఒకప్పుడు 90 శాతం, నేడు 60 శాతానికి పైగా జనాభా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మట్టిని నమ్ముకునే బతుకుతున్నారు. అయితే, ఇంతమంది శ్రమిస్తున్నా "వ్యవసాయం లాభసాటిగా ఉందా?" అన్న ప్రశ్నకు మెజారిటీ రైతుల నుంచి వచ్చే సమాధానం నిట్టూర్పు మాత్రమే. పెరిగిన పెట్టుబడులు, తగ్గని కూలీల ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల మధ్య సామాన్య రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.
కానీ, ఆశే రైతు ఊపిరి. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది అయినా అదృష్టం వరించకపోతుందా అన్న చిన్న ఆశే అతడిని నాగలి పట్టేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఆధునిక రైతు తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నాడు. సంప్రదాయ పంటల కంటే వినూత్నమైన, మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త పంటల వైపు అడుగులు వేస్తున్నాడు.సాధారణంగా కొత్త రకం పంటలు అంటే ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూర వంటి పంటలు సాగు చేయాలంటే ఎకరానికి సుమారు 5 లక్షల రూపాయల భారీ పెట్టుబడి అవసరం. ఇంత పెద్ద మొత్తాన్ని సామాన్య రైతు భరించడం కష్టమే అయినా, ఆర్థిక స్తోమత ఉన్న అభ్యుదయ రైతులు ముందుకొచ్చి ఈ పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.
ఖర్జూర కేవలం ఎడారిలోనే కాదు, మన నేలల్లోనూ అద్భుతంగా పండుతుందని రుజువవుతోంది.ఫ్రెష్ ఫ్రూట్ రకాలైన 'బర్హీ', 'ఎలైట్' వంటి వాటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఎకరానికి సుమారు 76 మొక్కలతో ఈ సాగు చేపట్టవచ్చు.ఇది ఎడారి జాతి మొక్క కాబట్టి పెద్దగా చీడపీడల బెడద ఉండదు. అయితే 'రెడ్ వీవిల్' అనే పురుగు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది చెట్టు లోపల ఉండి నాశనం చేస్తుంది. కుక్కలు చెట్టు మొదట్లో తవ్వుతున్నాయంటే అక్కడ పురుగు ఉందని గమనించి నివారణ చర్యలు చేపట్టాలి.
నాటిన మూడవ ఏట నుంచే దిగుబడి ప్రారంభమవుతుంది. నాలుగవ ఏట ఎకరానికి ఒక టన్ను పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కిలో రూ. 130 వరకు పలుకుతుండటంతో ఇది దీర్ఘకాలికంగా రైతుకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది.
ఆరోగ్య స్పృహ పెరిగిన నేటి కాలంలో డ్రాగన్ ఫ్రూట్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.సిమెంటు స్తంభాలు, పైన సిమెంటు రింగులను ఏర్పాటు చేసి ఈ మొక్కలను నాటుతారు. గతంలో వాడిన టైర్ల కంటే సిమెంటు రింగులు బరువును తట్టుకోవడంలో మెరుగ్గా ఉంటున్నాయి. దీనిని ప్రత్యేకంగా 10 ఎకరాల్లోనే కాకుండా, ఖర్జూర తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. వియత్నాం వంటి దేశాల నుంచి మనం ప్రస్తుతం వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గరే సాగు విస్తీర్ణం పెరిగితే వినియోగదారులకు తక్కువ ధరకే పండ్లు అందుతాయి, రైతులకు విదేశీ పోటీ తప్పుతుంది.
డ్రాగన్ ఫ్రూట్లో పింక్ పల్ప్ రకం రుచికి అద్భుతంగా ఉండటమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ప్రజలు దీనిని కేవలం రుచి కోసమే కాకుండా, ఆరోగ్యం కోసం తింటున్నారు. పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ కొత్త తరం పంటలు రైతును మళ్ళీ రాజును చేస్తాయనడంలో సందేహం లేదు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




