సేంద్రీయ రైతు వారధిగా మొబైల్ యాప్

సేంద్రీయ రైతు వారధిగా మొబైల్ యాప్
x
Highlights

సేంద్రియ పంటల సాగు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ అందుకు తగ్గట్టు మార్కెట్లో రైతుల పంటలకు ఎంత వరకు డిమాండ్ వుంది.. ? అందుకు తగ్గ ఆదాయం రైతు వరకు...

సేంద్రియ పంటల సాగు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ అందుకు తగ్గట్టు మార్కెట్లో రైతుల పంటలకు ఎంత వరకు డిమాండ్ వుంది.. ? అందుకు తగ్గ ఆదాయం రైతు వరకు చేరుతుందా...? రైతుకు పంట సాగు చేయటం ఒక ఎత్తైతే మార్కెట్ లో అమ్ముకునే సమయంలో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయ్...? ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో నేరుగా సేంద్రియ రైతులు తమ ఆహార ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఓ యువకుడు కొత్త యాప్ ని రూపొందించారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని బాలెం పల్లి గ్రామానికి చెందిన రామరాజు విదేశాల్లో కంప్యూటర్స్ సైన్స్ లో మాస్టర్స్ చదువుకొని హైదరబాద్ హైటెక్ సిటీలో వెబ్ సైట్ కి సంభందించిన సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో మంచి ఆరోగ్యం కోసం తానే రసాయనాలు లేని పంటలు పండించుకోవటం మొదలు పెట్టి తన వ్యవసాయ క్ష్తేత్రంలో పండే కూరగాయల్ని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నంలో రైతుల ఇబ్బందులను చవి చూసాడు. దీనితో గోపార్మ్ అనే యాప్ ని రూపొందించాడు.

నగర శివారు ప్రాంతంలో శంకర్ పల్లిలో 25 ఎకరాల భూమిని తన బంధువులతో కలసి లీజుకు తీసుకొన్నారు. రాళ్లు రప్పలతో నిండిపోయిన పొలాన్ని అందరూ కలసి సాగు భూమిగా మల్చుకున్నారు. అందులో అన్ని రకాల ఆకు కూరలు, కాయ కూరలతో సేంద్రియ పధ్దతిలో పంట సాగు మొదలు పెట్టారు. ఇక్కడ నుండి 60 శాతం కూరగాయలను వినియోగదారులకు అందిస్తూ మిగిలిన 40 శాతం కూరగాయలను సేంద్రియ రైతుల ద్వారా తీసుకొని వినియోగదారులకు యాప్ ద్వారా అందిస్తున్నారు రామరాజు.

ఈ యాప్ ని రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు. సేంద్రియ పంటలను సాగు చేసిన రైతులు తమ పంటలు విక్రయించుకునేందుకు రిజిష్టర్ చేసుకునే అవకాశంతో పాటు వినియోగదారులు కూడ ఇదే యాప్ ద్వారా అగ్రి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అదే రీతిలో ప్రతి వినియోగదారుడికి తాను తింటున్న పంటలను ఏ రైతు పండించాడు అన్న వివరాలను కూడ ఇందులో పొందు పరుస్తారు. ఇలా రైతులకు మరియు వినియోగదారులకు మధ్య అనుసంధానం చేస్తు ఇరువురికి మేలు కలిగేలా ఈ యాప్ ని రూపొందించామని రామ రాజు అంటున్నాడు.

అందరికి మంచి ఆరోగ్యం కావాలంటే విషపూరిత రసాయనాలు లేని ఆహారమే మేలని అంటుంటారు. కానీ సేంద్రియ పంటలు పండించే వారికి మాత్రం సరైన ధర రావటం లేదు. ఇలాంటి సమయంలో సేంద్రియ రైతులకు మార్కెటింగ్ వ్యవస్థ చాల అవసరం. దానిని సులభతరం చేయటానికి ఈ యాప్ ని రూపొందించామని అంటున్నారు. ఇందుకు సంభందించి రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వారు పండించే పధ్దతిని పరిశీలించిన తరువాతే ఈ ప్రక్రియ మొదలవుతుందని ఆ ఉత్పత్తులను పండించిన రైతుల వివరాలను కూడ అందుబాటులో వుంచుతున్నామని గోపామ్ సంస్థ ప్రతినిధి సైదపు రాజు అంటున్నారు.

రైతు ఆదాయం పెరిగేందుకు రక రకాల కొత్త పధ్దతులను అవలంభిస్తాడు. అందులో ఇప్పుడు సేంద్రియ పంటల సాగు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ ఇందులో పంట సాగుతో పాటు మార్కెటింగ్ లో మెళకులను తెలుసుకుంటే రైతుకు మంచి ఆదాయం వుంటుంది. రైతుకు వినియోగదారులకు మధ్య వారధిగా వుంటూ ఇలాంటి యాప్ లు రావటం తమకు మేలు కలుగుతుందని రైతులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories