Natural Farming: ఓర్పు..నేర్పే నేలను బంగారం చేసింది

Cultivation of Cereals in Organic Methods
x

Natural Farming: ఓర్పు..నేర్పే నేలను బంగారం చేసింది

Highlights

Natural Farming: సేంద్రియ సాగుకు ఆ గ్రామం పెట్టింది పేరు. అసలైన మహిళా సాధికారత అంటే ఏంటో ఆ గ్రామంలోని మహిళలను చూస్తే స్పష‌్టంగా అర్థమవుతుంది.

Natural Farming: సేంద్రియ సాగుకు ఆ గ్రామం పెట్టింది పేరు. అసలైన మహిళా సాధికారత అంటే ఏంటో ఆ గ్రామంలోని మహిళలను చూస్తే స్పష‌్టంగా అర్థమవుతుంది. అంతరించిపోయే దశకు చేరుకున్న మన పూర్వకాలం నాటి పంటలు అవే పాత పంటలైన జొన్నలు, కొర్రలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను ఈ తరానికి అందజేయాలని వారంతా కంకనం కట్టుకున్నారు. పూర్వకాలపు సేద్యపు విధానాలను అనుసరించి ఆది పంటలకు పునరుజ్జీవం పోస్తున్నారు మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని మహిళలు. రసాయన రహిత ఉత్పత్తులను సమాజానికి అందిస్తున్నారు. ఈ మహిళల విజయం వెనుక ఉన్న డీడీఎస్ సంస్థ వారి కృషిని లోకానికి తెలియజేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. కేవలం సాగులో మాత్రమే కాదు సాంకేతికతను వాడుకోవడంలో కూడా అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటూ పాత పంటల సాగులో విజయకేతనం ఎగురవేస్తూ ముందుకు సాగుతున్న పస్తాపూర్ మహిళా రైతులపై ప్రత్యేక కథనం.

ఒక్క అవకాశం ఇస్తే చాలు తమ సత్తా ఏంటో సమాజానికి చూపిస్తారు మహిళలు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ గ్రామ మహిళలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మెదక్ జిల్లాలోని జహీరాబాద్. ఇలాంటి చోటే సిరుల పంటలు పండిస్తూ సేద్యాన్ని ఓ పండగా మారుస్తున్నారు. చిరుధాన్యాల సాగును కొత్త పుంతను తొక్కిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా 1983 ఏర్పడిన డెక్కన్ డెవలప్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో చిరు ధాన్యాల సాగుచేస్తూ మహిళలు విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

మెదక్ జిల్లా, సంగారెడ్డి మండలం, పస్తాపూర్ గ్రామం పేరు వినగానే పాత పంటలు పండిస్తున్న మహిళల విజయగాథలే కళ‌్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అక్కడి మహిళలకు మరో వ్యాపకం లేదు వ్యవసాయమే ఆధారం అందుకే చిరుధాన్యాలను చిరునవ్వుతో పండిస్తూ ముందుకెళ్తున్నారు. 1983లో ఏర్పడిన దక్కన డెవలప్‌మెంట్ ప్రోత్సాహంతో సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలను సాగు చేస్తూ వాటి ఖ్యాతి, రుచి ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేస్తున్నారు.

నాలుగు దశాబ్దాల క్రితం జహీరాబాద్‌ ప్రాంతంలో ఎక్కువ శాతం బీడు భూములే దర్శనమిచ్చేవి. మహిళలు ఉపాధికోసం కూలిపనికి వెళ్లేవారు. డీడీఎస్‌ డైరెక్టర్‌ పీవీ సతీశ్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వ్యవసాయం గూర్చి మహిళలకు అవగాహన కల్పించారు. ఫలితంగా నేడు జహీరాబాద్‌, రాయికోడ్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లోని 60 గ్రామాల్లో సుమారు 5000 మంది మహిళలు 75 సంఘాలుగా ఏర్పడి పూర్తి సహజ పద్ధతుల్లో సిరిధాన్యాలను పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.

అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులను సైతం ఎదుర్కొని ముందుకెళ్తున్నారు పస్తాపూర్ మహిళా రైతులు. స్థానికంగా నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కావడంతో సాధారణ పంటల సాగులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గుర్తెరిగే అన్ని నేలల్లో, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని పండే పాత పంటల సాగుకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆహార వైవిధ్యానికి అనుకూలమైన జొన్న, సామలు, సజ్జలు, కొర్రలు, రాగులు వంటి చిరుధాన్యాలతో పాటు ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. సాగుకు కావాల్సిన సహకారం, సూచనలను డిడిఎస్‌ సంస్థ నుండి పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా వంటి వైరస్‌ల ముప్పునుంచి బయటపడి రోగనిరోధక శక్తిని పొందాలంటే ఈ చిరుధాన్యాలే సరైన ఔషధమంటున్నారు.

అత్త నుంచి విచ్చిన సంప్రదాయాన్ని కోడలుగా కొనసాగిస్తూ వస్తోంది మహిళా రైతు మొగులమ్మ. తనకు సొంతంగా ఉన్న ఎకరంన్నర భూమితో పాటు మరో 7 ఎకరాలను కౌలుకు తీసుకుని చిరుధాన్యాలను పండిస్తోంది. ఒక ఎకరంలో వర్షాకాలం పంటగా సుమారు 25 రకాల పంటలు పండిస్తామంటోంది ఈ రైతు. చిరుధాన్యాలతో పాటే నూనె గింజలను పండిస్తూ సంవత్సరానికి సరిపడే నూనెలను, ఆహారాన్ని తమ కుటుంబానికి సమకూర్చుకుంటూనే వినియోగదారులకు విక్రయిస్తోంది. తద్వారా సంవత్సరానికి ఎంతలేదన్నా లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తోంది మొగులమ్మ. ఒంటరి మహిళగా ఉన్న మొగులమ్మ తన పిల్లలను చిరుధాన్యాల సాగుతో వచ్చిన ఆదాయంతోనే చదివిస్తోంది.

సాగుకు కావాల్సిన విత్తనాలను తామే తయారు చేసుకుంటామని మార్కెట్‌లపై ఆధారపడమని అంటోంది మొగులమ్మ. వేరే దేశాలకు సైతం దేశీ విత్తనాలను అందిస్తున్నామని చెబుతోంది. ప్రస్తుతం తన దగ్గర 60 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి. వీటినే పంటల సాగుకు వినియోగిస్తామని చెబుతోంది. పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పంటలను సాగు చేస్తోంది ఈ మహిళా రైతు. ఈ సేద్యం తప్పితే మరో సేద్యం ఆనవాళ్లు కూడా ఇక్కడ కనిపించవు. ఎలాంటి రసాయనాల వినియోగం లేకుండా ఆరోగ్యకరమైన పంటలు పండిస్తోంది కాబట్టే రాష్ట్రపతి అవార్డును సైతం అందుకుంది ఈ అభ్యుదయ రైతు. మిగతా రైతులు ఈ విధానాల వైపు అడుగులు వేయాలని కోరుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories