దాహమే ప్రాణాలు తీసింది!

దాహమే ప్రాణాలు తీసింది!
x
Highlights

అత్యాశ ప్రాణాల మీదకు తెచ్చింది. గుప్తనిధుల కోసం ప్రకాశం జిల్లా వెలుగొండ అటవీ ప్రాంతానికి వెళ్లిన ముగ్గురులో ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే....

అత్యాశ ప్రాణాల మీదకు తెచ్చింది. గుప్తనిధుల కోసం ప్రకాశం జిల్లా వెలుగొండ అటవీ ప్రాంతానికి వెళ్లిన ముగ్గురులో ఇద్దరు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన హనుమంత నాయక్, కృష్ణ నాయక్, హైదరాబాద్ కు చెందిన శివకుమార్ ముగ్గరూ గత ఆదివారం గుప్తనిధుల కోసం అడవి లోకి వెళ్లారు. వారిలో కృష్ణ నాయక్ ఒక్కరే బ్రతికి బట్టకట్టారు.

రుద్రాక్షల కోసం వెళ్తున్నామంటూ బాబాయి హనుమంత్‌ నాయక్‌, బ్యాంకు ఉద్యోగి శివకుమార్‌లు తనను మభ్య పెట్టడం తోనే వారితో వెళ్లానని కృష్ణ నాయక్ చెప్పాడు. దారిలో వారు గుప్తనిధుల కోసం ఆరా తీస్తుంటే అసలు విషయం తెలిసిందన్నారు. పురాతన కట్టడాలు, విగ్రాహాలు ఉండే ప్రాంతాల ఫోటోలు తీసుకుని గుప్తనిధులు ఉండే ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తుపట్టడం కోసం ప్రణాళికలు వేసుకున్నామని వివరించారు. అయితే, తాము వెళ్ళేటపుడు కూడా కేవలం 15 మజ్జిగ ప్యాకెట్లు, ఒక నీటి బాటిల్ మాత్రమే కూడా తీసుకువళ్ళామన్నారు. వెలుగొండ అటవీ ప్రాంతంలో పెద్ద లోయలు దాటుకుంటూ చాలాదూరం వెళ్లాం. తీవ్ర దాహంతో వెంట తీసుళ్లిన మజ్జిగ, నీళ్లు అయిపోయాయి. అప్పటికే మిట్ట మధ్యాహ్నం కావడంతో గొంతు ఎండిపోయి నీరసం ఆవహించింది. అడుగు తీసి అడుగు వేయడం గగనమైంది. వెనుదిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం. ముగ్గురం తిరుగు ప్రయాణమయ్యాం. తీక్షణ ఎండ కారణంగా జనావాస ప్రాంతానికి చేరడం కష్టమని, కనీసం ఒక్కరైనా చేరుకోగలిగితే మిగిలిన ఇద్దరిని రక్షించే వీలుంటుందని బాబాయి హనుమంత్‌ నాయక్‌ నన్ను తొందరగా వెళ్లమన్నాడు.దీంతో తానూ వేగంగా నడిచాననీ.. ఈ క్రమంలో దాహాన్ని తట్టుకోవడానికి దారిలో నాలుగు మార్లు మూత్రాన్ని తాగాననీ కృష్ణ నాయక్ చెప్పారు. చివరకు సోమవారం మధ్యాహ్నం అటవీప్రాంతానికి ఆనుకుని రోడ్డు పక్కనే స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడే ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి వచ్చి ముఖంపై నీళ్లు చల్లి కొంత ప్రసాదం ఇచ్చారనీ దానితో ప్రాణాలు దక్కాయనీ పోలీసు కస్టడీలో ఉన్న కృష్ణనాయక్‌ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories