ప్రాణాలు తీసిన అతివేగం..

ప్రాణాలు తీసిన అతివేగం..
x
Highlights

అతివేగం ఎలా ప్రాణాలు తీస్తుందో కోదాడ దగ్గర నిన్న జరిగిన ఘోర ప్రమాదం రుజువు చేస్తోంది. అతి వేగం ఆపై కారు టైర్ పేలటం ఆ తర్వాత కారు డివైడర్‌ను ఢీకొని వ్యతిరేక దిశలో వస్తున్న వాహనాలపై పడడం ముగ్గురు ప్రాణాలు తీసింది.

అతివేగం ఎలా ప్రాణాలు తీస్తుందో కోదాడ దగ్గర నిన్న జరిగిన ఘోర ప్రమాదం రుజువు చేస్తోంది. అతి వేగం ఆపై కారు టైర్ పేలటం ఆ తర్వాత కారు డివైడర్‌ను ఢీకొని వ్యతిరేక దిశలో వస్తున్న వాహనాలపై పడడం ముగ్గురు ప్రాణాలు తీసింది. అనేక మందిని ఆస్పత్రి పాలుచేసింది. ఈ ఘోర ప్రమాదానికి కారణం విజువల్స్ లో కనిపిస్తున్న ఎర్ర రంగు డస్టర్‌ కారు. ఆ కారు నడుపుతన్న హైదరాబాద్‌ చర్లపల్లి నివాసి రావి వెంకట మురళీకృష్ణ చేసిన తప్పు ఆయనతోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాల్ని బలిగొంది. పండగపూట ఆనందంగా గడిపిన కొద్ది గంటల్లోనే అతి వేగం కారణంగా ముగ్గురు తుదిశ్వాస విడిచారు.

నూజివీడు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రావి వెంకటమురళీకృష్ణ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. వీరు స్వగ్రామంలో సంక్రాంతి పండుగ జరుపుకొని నిన్న హైదరాబాద్‌ ప్రయాణమయ్యారు. కారును మురళీకృష్ణే నడుపుతున్నారు. అయితే 160 కిలోమీటర్ల వేగంతో కారు నడపడంతో కోదాడ మండలం కొమరబండ బైపాస్‌ రోడ్డు సమీపానికి రాగానే అదుపు తప్పింది. జాతీయ రహదారి బైపాస్‌ దాటుతుండగా మలుపులో ఉన్న డివైడర్‌ను కుడివైపు ఉన్న టైరు ఢీకొట్టింది. అంతే వెంటనే కారు టైరు పేలిపోయింది. టైర్ పేలిన తర్వాత ఆ కారు డివైడర్‌ మీదుగా 50 మీటర్లు ప్రయాణించి కుడివైపు రహదారిలోకి ప్రదేశించింది. అంతేకాదు మరో రెండు వాహనాల్ని వేగంగా ఢీకొట్టింది. కారు డివైడర్‌ను ఢీ కొట్టింది మొదలు మరో రెండు వాహనాలను కూడా ఢీకొనడం అంతా రెప్పపాటులో జరిగి పోయింది.

మురళీ కృష్ణ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న ఇన్నోవాపైనా హోండాసిటీ కారుపై పడి పైభాగాన్ని చీల్చుకుంటూ రహదారి పక్కన ఉన్న కల్వర్టు గోడను ఢీ కొట్టి ఆగిపోయింది. కారు వేగానికి అందులో ఉన్న మురళీ కృష్ణ భార్య, కుమార్తె రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి ఎగిరిపడ్డారు. వారి శరీరభాగాలు చిందరవందరగా పడ్డాయి. మురళీకృష్ణ సీటు బెల్టు పెట్టుకొని ఉండటంతో కారులోనే ప్రాణాలు వదిలారు. ఆయన కుమారుడు యువనీత కృష్ణ చేయి విరిగింది. ఇక ఇన్నోవా, హోండా సిటీ కార్లలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో అయిదుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

కోదాడ దగ్గర ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణం అతి వేగం. గమ్యానికి త్వరగా చేరాలన్న ఆత్రత ఏమీ కాదనే ధీమా వల్లే ఈ ప్రమాదం జరిగింది. చిన్నపాటి తొందరపాటు మనతో పాటు ఎదుటివారి ప్రాణాలపైకి తెస్తోందనే విషయం ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. పైగా కుటుంబం మొత్తం వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు చేస్తున్న తప్పులు ఆ కుటుంబం మొత్తం మృత్యువాత పడేటట్లు చేస్తోంది. సో పండుగ తిరుగు ప్రయాణాల్లో అందరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని "హెచ్ఎంటీవీ" సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories