Top
logo

శ్రావణి కేసు విచారిస్తుండగా.. మనీషా హత్య బయటపడింది.. మరి కల్పనా?

శ్రావణి కేసు విచారిస్తుండగా.. మనీషా హత్య బయటపడింది.. మరి కల్పనా?
X
Highlights

మాదకద్రవ్యాలకు బానిసలైన నలుగురు స్నేహితులు ఒంటరిగా కనిపించే అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపేస్తారు.. ఆ...

మాదకద్రవ్యాలకు బానిసలైన నలుగురు స్నేహితులు ఒంటరిగా కనిపించే అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపేస్తారు.. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మృతుదేహాన్ని పూడ్చి పెడతారు. ఇది ఓ సినిమాలోని కథ. కొంతకాలంగా అచ్చం ఇలాంటి కధలే నిజజీవితాల్లో కూడా జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణే తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసిన ఘటనలు. బొమ్మలరామారం మండలం హజీపూర్ కు చెందిన శ్రావణి..ప్రతిరోజు ఉదయం బస్సులో స్కూలుకు వెళ్లి..తిరిగి వచ్చేటప్పుడు మండల కేంద్రానికి ఆటోలో వచ్చేది. అక్కడ్నుంచి తెలిసినవారి సాయంతో హజీపూర్ కు చేరుకునేది.

ఈ నెల 25న స్కూలు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. స్నేహితురాళ్లతో కలిసి షేరింగ్ ఆటోలో బొమ్మలరామారం చేరుకున్న శ్రావణిని దుండగులు నమ్మించి తీసుకెళ్లి ఆమెపై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిపి ఆమెను క్రూరంగా హత్యచేసి బావిలో పడేశారు. దీంతో కేసును చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని అయితే కనిపెట్టగలిగారు కానీ.. నిందితులను మాత్రం పూర్తి స్థాయిలో గుర్తించలేదు. ఈ క్రమంలో శ్రావణి హత్యకేసు దర్యాప్తు జరుపుతుండగా హాజీపుర్‌ శివార్లలోని అదే పాడుపట్ట బావిలో మరో యువతి మృతదేహం బయటపడింది. ఆమె రెండు నెలల కిందట మిస్ అయిన మనీషాగా పోలీసులు గుర్తించారు.

తుర్కపల్లి మండలం గోపాలపురానికి చెందిన మల్లేశం ఉపాధి కోసం వలస వచ్చాడు. నలుగురు కూతుళ్లలో మనీషా రెండో అమ్మాయి. రెండు నెలల క్రితం కాలేజీకి వెళ్లి కనిపించకుండా పోయింది. ప్రేమ వ్యవహారంతో వెళ్లిపోయి ఉంటుందని కుటుంబసభ్యులు అనుకున్నారు. అయితే.. శ్రావణి హత్య కేసును విచారణ చేస్తున్న సమయంలో అదే బావిలో మనీషా మృతదేహం బయటపడింది. ఆమెను కూడా అదే గ్యాంగ్ రేప్ చేసి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మొన్న శ్రావణి మృతదేహం.. ఇవాళ మనీషా డెడ్‌బాడీ.. రేపు ఇంకెవరిది? అన్న భయం గ్రామస్థులను వెంటాడుతోంది.

దీనికి తోడు రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన కల్పన వ్యవహారం ఈ ఉదంతంతో తెరపైకి వచ్చింది. మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మామిడికాయల ఎల్లయ్యకు ముగ్గురు కూతుర్లు.. అందులో చిన్న కూతురు కల్పన ఆరో తరగతి చదువుతోంది. 2016 నవంబర్‌లో ఇప్పుడు శ్రావణి తప్పిపోయిన ప్రదేశంలోనే ఆ బాలిక మిస్‌ అయ్యింది. ఆమె కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇప్పటికీ కల్పన ఆచూకీ దొరకలేదు.. ఇప్పుడు శ్రావణి హత్యపై విచారణను పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.

దీంతో తమ కూతురు కల్పన ఆచూకీ కూడా తెలుసుకోవాలని మరోసారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. శ్రావణి హత్య విషయం తెలిశాక.. కల్పన తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో అదే బావిలో మనీషా డెడ్‌బాడీ దొరకడంతో కల్పన కూడా కిరాతక హత్యకు గురై ఉంటుందా అని కల్పనా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఇలా ఒకే బావిలో రెండు మృతదేహాలు దొరకడం, ఒక బాలిక మిస్ అవ్వడం వంటి పరిణామాలతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత క్రూరంగా ఎవరు చేస్తున్నారు. పైగా ఇది ఒకరిద్దరి పని కాకపోవచ్చు తప్పకుండా గ్యాంగ్ ఉంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి తమ భయం పోగొట్టాలని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

Next Story