Madhya Pradesh : వీళ్లు స్టూడెంట్స్ కాదు..రాక్షసులు..ప్రిన్సిపల్‎కు చెప్పాడన్న కోపంతో 45 సెకన్లలో 31 బెల్టు దెబ్బలు

Madhya Pradesh : వీళ్లు స్టూడెంట్స్ కాదు..రాక్షసులు..ప్రిన్సిపల్‎కు చెప్పాడన్న కోపంతో 45 సెకన్లలో 31 బెల్టు దెబ్బలు
x
Highlights

వీళ్లు స్టూడెంట్స్ కాదు..రాక్షసులు..ప్రిన్సిపల్‎కు చెప్పాడన్న కోపంతో 45 సెకన్లలో 31 బెల్టు దెబ్బలు

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో విద్యా వ్యవస్థ, క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తోంది. నివాస్ చౌకీ పరిధిలోని ఒక పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న జ్ఞానేష్ విశ్వకర్మ అనే విద్యార్థిపై అతని సహచరులే దాడికి తెగబడ్డారు. గత కొంతకాలంగా కొంతమంది విద్యార్థులు జ్ఞానేష్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక జ్ఞానేష్ జనవరి 26న ధైర్యం చేసి స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రిన్సిపాల్ సదరు విద్యార్థులను పిలిచి గట్టిగా మందలించారు. అయితే, తమపై ఫిర్యాదు చేస్తావా అన్న కక్షతో ఆ విద్యార్థులు రగిలిపోయారు.

గత మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జ్ఞానేష్ ఒంటరిగా వెళ్తుండగా ఆ ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. నడిరోడ్డుపై అతడిని కింద పడేసి, చుట్టుముట్టి జంతువుల కంటే హీనంగా కొట్టారు. చేతులతో గుద్దడమే కాకుండా, ప్యాంటు బెల్టులు తీసి విచక్షణారహితంగా బాదారు. జ్ఞానేష్ ప్రాధేయపడుతున్నా వదలకుండా కాళ్లతో తలపై, ఛాతిపై తొక్కారు. ఈ అమానుష దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కేవలం మూడు రోజుల క్రితమే కాన్వెంట్ చౌరస్తాలో 10వ తరగతి విద్యార్థిపై ఇలాగే సామూహిక దాడి జరిగిన ఘటన మరువక ముందే, ఇప్పుడు మరో విద్యార్థిపై దాడి జరగడం జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు, విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో కౌన్సెలింగ్ లేకపోవడం, సినిమాల ప్రభావం, సోషల్ మీడియా క్రేజ్ విద్యార్థులను హింసా మార్గం వైపు నడిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బాధిత విద్యార్థి జ్ఞానేష్ ఫిర్యాదు మేరకు నివాస్ చౌకీ పోలీసులు ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చౌకీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక సింగ్ తెలిపారు. ఒకవేళ ఇప్పుడైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ హింస రేపు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకునే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల వద్ద పోలీసు నిఘా పెంచాలని, హింసకు పాల్పడే విద్యార్థులను స్కూల్ నుండి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories