Top
logo

'ఇన్నోసెంట్‌'గా మోసం చేశారు

ఇన్నోసెంట్‌గా మోసం చేశారు
X
Highlights

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందితే అంతే వేగంగా నేరాలూ ముంచుకొస్తున్నాయి. బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానం అయిన సిమ్‌ను స్వాప్‌ చేసి సొమ్మును కాజేస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందితే అంతే వేగంగా నేరాలూ ముంచుకొస్తున్నాయి. బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానం అయిన సిమ్‌ను స్వాప్‌ చేసి సొమ్మును కాజేస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. మూడేళ్లలో కోట్లు కొల్లగొట్టిన ఆరుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం ఇంటర్‌ పోల్‌ సాయం కోరారు.

సిమ్‌ స్వాప్‌ ఇదో కొత్త తరహా సైబర్‌ మోసం. మన సిమ్‌ మనదగ్గరే ఉంటుంది. కానీ అదే నెంబర్‌ సిమ్‌ను సంపాదించిన కేటుగాళ్లు మన ఖాతా నుంచి డబ్బులు దొంగలిస్తున్నారు. అంతా ఆన్‌లైన్‌లోనే జరిగే ఈ ఘరానా మోసంలో మనకు తెలియకుండానే మన అకౌంట్‌ నుంచి సొమ్ములు మాయం అవుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆరుగురు దుండగులు నైజీరియాకు చెందిన ఎబిగ్‌ బో ఇన్నోసెంట్‌ అలియాస్ జేమ్స్‌ అనే వ్యక్తి కింద పనిచేస్తున్నారు. జేమ్స్‌ తొలుత కోల్‌కతాలోని ఓ ఫుట్‌బాల్‌ ఆటగాడైన తన ఫ్రెండ్‌ ఒడాఫే హెన్నీ సాయంతో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్‌ బెనర్జీ, అంకన్‌ సాహా, రజత్‌ కుందూ, చందన్‌ వర్మ, సంజీబ్‌ దాస్‌తో ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. ఈ ముఠా మూడేళ్లుగా సిమ్‌కార్డుల్ని స్వాప్‌ చేస్తూ ఓటీపీల సాయంతో బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతుంది.

హైదరాబాద్‌కు చెందిన ఎలిమ్‌ కెమికల్స్‌, శాలమ్‌ కెమికల్స్‌ ఎండీ అయిన పంతం వెంకటకృష్ణ తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత శనివారం రాత్రి తన సిమ్‌ బ్లాక్‌ అయ్యిందని ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఆపరేటర్‌ ఆఫీస్‌కు వెళ్తే.. తన ప్రమేయం లేకుండానే సిమ్‌ను స్వాప్‌ చేసి కొత్త సిమ్‌ కార్డు తీసుకున్నట్లు గుర్తించాడు. అనుమానంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా తన అకౌంట్‌ నుంచి ఏకంగా 9 లక్షలు మాయం అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కంప్లైంట్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్లలో ఈ ముఠా కోట్లాది రూపాయలను దోచుకున్నారని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు.

బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉన్న సిమ్‌కార్డులను స్వాప్‌ చేయడమే లక్ష్యంగా వీరంతా పనిచేస్తారని పోలీసులు వెల్లడించారు. మొదట జేమ్స్‌ డార్క్‌నెట్‌లో వివిద దేశాలకు చెందిన ఖాతాదారుల వివరాలు సేకరించి వాటిని కొనుగోలు చేస్తారు. ఆయా ఖాతాదారులకు బ్యాంకు పేర్లతో ఈమెయిల్స్‌ పంపుతాడు. దీంతో దాన్ని క్లిక్‌ చేసిన వారి కంప్యూటర్‌లోకి స్పైవేర్‌ చొరబడుతుంది. బ్రౌజర్‌ హిస్టరీ, ఇతర మార్గాల ద్వారా ఈ-బ్యాంకింగ్‌ యూజర్‌ వివరాలను, ట్రాన్సాక్షన్‌ పాస్‌వర్డ్‌లను సేకరిస్తారు.

ఇక బ్యాంకు ఖాతా వివరాలు ఇండియాలో ఉన్న హెన్నీకి పంపుతాడు. అతడు తన ముఠా సభ్యులను ఖాతాదారులుండే నగరాలకు పంపుతాడు. వారి ఇంటి, కార్యాలయాల చిరునామాల ఆధారంగా మొబైల్‌ సంస్థలకు నకిలీ లెటర్‌హెడ్స్‌పై డూప్లికేట్‌ సిమ్‌ కోసం లేఖలు పంపుతారు. కొత్త సిమ్‌కార్డులు తీసుకుంటారు. ఆ వెంటనే బాధితుల సిమ్‌కార్డు బ్లాక్‌ అవుతుంది. ఈ పనులను చాలా వరకు శనివారం సాయంత్రం సమయంలో చేస్తుంటారు. వెంటనే కోల్‌కతాలో ఉండే హెన్నీ బాధితుల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఖాతాల్లో లాగిన్‌ అయ్యి డబ్బును కొల్లగొడతాడు. ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ దాటితే బంగారం కొంటారు. అలా దోచుకున్న డబ్బును కొత్తదారిలో నైజీరియాకు పంపుతారు. భారత్‌లో స్టాక్‌ కొనుగోళ్లకు వచ్చే నైజీరియాకు చెందిన వ్యాపారులకు.. ఆ డబ్బును ఇస్తారు. వారు నైజీరియా వెళ్లాక అదే మొత్తానికి నైజీరియా కరెన్సీని జేమ్స్‌కు అందజేస్తారు. ఇక బాధితులు సోమవారం మొబైల్‌ ఫోన్‌ ఆపరేటర్‌ ఔట్‌లెట్లకు వెళ్లే సరికి వారి బ్యాంకు నుంచి డబ్బులు మాయమైనట్లు తెలుసుకుని లబోదిబోమంటారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story