Top
logo

ఆడ బిడ్డ అని పసికందును వడ్ల గింజలతో చంపేశాడు!

ఆడ బిడ్డ అని పసికందును వడ్ల గింజలతో చంపేశాడు!
X
Highlights

కొన్ని సంఘటనలు చూస్తే, మనం ఏ యుగంలో ఉన్నామో అని అనుమానం వస్తుంది. ఆడపిల్లలు ప్రపంచాన్ని ఏలుతున్న రోజులు వచ్చేసినా.. ఆడపిల్ల అనగానే చిన్నచూపు చూసే వ్యక్తులు ఇంకా ఉండడం రోత పుట్టిస్తోంది. ఆడపిల్లగా పుట్టడమే పాపంగా చిన్నారిని కర్కశంగా చంపెశాడో దుర్మార్గపు తాత. సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్న ఈ సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.

దుర్మార్గం.. కర్కశత్వం.. ఇలాంటి పదాలు ఎన్నున్నా సరిపోవా ముసలోడి కిరాతకాన్ని వర్ణించడానికి. రాక్షసుడు.. కిరాతకుడు.. వంటి ఉపమానాలు ఆ తాత నిర్వాకానికి ఎ మాత్రం సాటిరావు. మానవత్వాన్ని మంట గలిపిన ఆతగాడి కర్కశత్వానికి సభ్యసమాజం ముక్కున వేలేసుకుంటోంది.

వరంగల్ జిల్లలో ఈ విషపు మనిషి ఉన్నాడు. ఇతగాడికి మనవరాలిగా పుట్టినందుకు ఆ పసిదాన్ని పుట్టిన వారంలోపే వడ్లగింజలతో వధించేశాడు.. గుట్టుచప్పుడు కాకుండా పాతి పెట్టేశాడు. బాలల సంరక్షణ అధికారులు జోక్యం చేసుకోవడంతో ఆలస్యంగా ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది

వివరాలిలా ఉన్నాయి..

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కేశవపురం శివారు ఎరగట్టు తండాకు చెందిన భూక్యా మమత, తిరుపతి దంపతులకు ఈ నెల 4న చక్కని ఆడబిడ్డ జన్మించింది. అయితే అప్పటికే ఆమెకు సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న ఆడపిల్ల ఉంది. ఇక రెండో పాప కూడా 2.5 కిలోలతో బరువుతో ఆరోగ్యంగా జన్మించింది. దీంతో సెప్టెంబర్ 5న తల్లీబిడ్డలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, మళ్లీ రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో ఆ చిన్నారి తాత అయిన భిక్యూ ఆగ్రహానికి గురయ్యాడు. మానవత్వాన్ని మరిచిపోయిన ఆ దుర్మార్గుడు పసికందు అని కూడా చూడకుండా గొంతులో వడ్ల గింజలు వేసి దారుణంగా హతమార్చాడు.

అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి దగ్గర్లోని స్థలంలో ఖననం చేశాడు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి చైల్డ్ లైన్ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. దీంతో వరంగల్ రూరల్ జిల్లా సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి సోమవారం తండాకు వచ్చి, ఘటనపై విచారణ చేపట్టారు. రెండోపాప గురించి ఆరా తీశారు. రెండురోజుల క్రితం జ్వరం రావడంతో పాప మరణించిందని అధికారులకు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆరోగ్యంగా పుట్టిన పాప అకస్మాత్తుగా ఎలా మరణించిందటూ అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కుటుంబ సభ్యులే చంపేసి ఉంటారని భావించారు. వారికి అందిన సమాచారం మేరకు ఆ చిన్నారి తాత.. బిడ్డ గొంతులో వడ్లగింజలు వేసి, హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Next Story