
ఘజియాబాద్‌లో పెను విషాదం..ఆన్‌లైన్ గేమ్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు బలి
Tragedy:ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల ఆత్మహత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న చేతన్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ముగ్గురు కుమార్తెలు.. నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) మంగళవారం అర్ధరాత్రి 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసుల కోసం చేతికి వచ్చిన మొబైల్ ఫోన్, వారిని మెల్లగా కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలుగా మార్చేసింది. ఆ వ్యసనం చివరకు వారి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకుని.. ఫోన్లతోనే సహవాసం
గత రెండున్నరేళ్లుగా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు పూర్తిగా ఆన్‌లైన్ గేమ్‌ల మాయలో పడిపోయారు. ఎంతలా అంటే.. చదువును పక్కనపెట్టడమే కాకుండా, బడికి వెళ్లడం కూడా మానేశారు. ఎప్పుడూ ఒకే గదిలో గడియ పెట్టుకుని, ఫోన్లలో మునిగిపోయేవారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, కనీసం తల్లిదండ్రులతో కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదు. వారి ప్రవర్తన చూసి ఆందోళన చెందిన తండ్రి చేతన్ కుమార్, పిల్లలను మందలించి ఫోన్లను లాక్కున్నారు. ఫోన్ అందుబాటులో లేకపోవడాన్ని తట్టుకోలేకపోయిన ఆ బాలికలు, తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి గదిలో గడియ పెట్టుకున్న వారు, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒకరి తర్వాత ఒకరు బాల్కనీలో నుంచి కిందకు దూకేశారు.
సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
పోలీసులకు ఆ బాలికల గదిలో ఒక డైరీ దొరికింది, అదే వారి సూసైడ్ నోట్. అందులో "నాన్నా.. మమ్మల్ని క్షమించు, ఈ డైరీలో ఉన్నదంతా నిజం, ఇప్పుడే చదవండి" అని రాసి ఉంది. ముగ్గురు బాలికలు కొరియన్ సంస్కృతిని అమితంగా ప్రేమించేవారని, ఆ గేమ్‌లకు బానిసలయ్యారని ఏసీపీ అతుల్ కుమార్ వెల్లడించారు. తాము ఎలాగైనా కొరియా వెళ్లాలని వారు తరచూ ఇంట్లో చెప్పేవారట. అయితే, అది కేవలం వ్యసనమేనా లేక ఏదైనా బ్లూ వేల్ లాంటి ప్రాణాలు తీసే టాస్క్ గేమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమార్తెలు ఆడే గేమ్‌లో ఇలాంటి ప్రాణాలు తీసే టాస్క్ ఉందన్న విషయం తనకు తెలియదని ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.
తల్లిదండ్రులారా.. తస్మాత్ జాగ్రత్త
ప్రస్తుత సమాజంలో స్మార్ట్‌ఫోన్ వ్యసనం యువతను చీకటిలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్‌లలో వచ్చే సవాళ్లు పిల్లల మెదడును నియంత్రిస్తున్నాయి. ఫోన్ ఇవ్వకపోతే తీవ్రమైన కోపం రావడం, ఒంటరిగా గడపడం, చదువుపై శ్రద్ధ తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలి. ఘజియాబాద్ ఘటన ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక లాంటిది. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేటప్పుడు వారు ఏం చూస్తున్నారు, ఏం ఆడుతున్నారు అనే దానిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




