వైసీపీ నేతల్లో మనీ టెన్షన్..వణికిపోతున్న నేతలు

వైసీపీ నేతల్లో మనీ టెన్షన్..వణికిపోతున్న నేతలు
x
Highlights

ప్రత్యేక హోదా పోరాటం వల్ల పార్టీకి వస్తున్న మైలేజ్‌తో ఆనందం ఓవైపు.. వరుస కార్యక్రమాలతో ఆర్థిక సమస్యలు మరోవైపు.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను సతమతం...

ప్రత్యేక హోదా పోరాటం వల్ల పార్టీకి వస్తున్న మైలేజ్‌తో ఆనందం ఓవైపు.. వరుస కార్యక్రమాలతో ఆర్థిక సమస్యలు మరోవైపు.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను సతమతం చేస్తున్నాయి. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉండటంతో వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీలోని సీనియర్ నేతలు వణికిపోతున్నారు.

వైసీపీ నేతలకు ఇప్పుడు ఒకటే భయం పట్టుకుంది. పార్టీ హైకమాండ్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ఆ కార్యక్రమాల్లో జోష్‌గా పాల్గొనాల్సి వస్తుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు వణికిపోతున్నారు. వైసీపీలో ఇప్పటివరకు ఉన్న 44 మంది ఎమ్మెల్యేలతోపాటు మిగిలిన సీనియర్ నేతలకు పార్టీ కార్యక్రమాలకు పెడుతున్న ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి.

జగన్ యువభేరి నుంచి మొదలైన కార్యక్రమాలు ఇటీవల ఎంపీల దీక్ష, తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్ వరకూ అన్నీ డబ్బుతో కూడుకున్నవి కావడంతో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్‌ గెలుపు కోసం అప్పులు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక జగన్ పాదయాత్ర ముగిసే వరకూ ఆయా జిల్లాల నేతలకు గుండె గుబేల్ మంటోంది. పాదయాత్ర తమ నియోజకవర్గం పొలిమేర దాటేలోగా దాదాపు 20 నుంచి 25లక్షల దాకా ఖర్చు అవుతోందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చే నిధులు గత నాలుగేళ్లుగా నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమానికి 5నుంచి 10లక్షల దాకా ఖర్చవుతోంది. దీంతో ఈ ఆర్ధిక ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు వైసీపీ నేతలు.

అయితే, ఎంత ఖర్చు చేసినా.. వైసీపీ అధినేత జగన్ తమకే సీటు ఇస్తారా..? లేదా..? అన్న భయంతో ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. మరి జగన్ నాయకుల భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories