చంద్రబాబు డ్రామా బాగుంది

చంద్రబాబు డ్రామా బాగుంది
x
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఏపీకి నిధులు రాలేవ‌ని సీఎం చంద్రబాబు తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట అని వైసీపీ అధినేత జగన్‌ ఎద్దేవా చేశారు....

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఏపీకి నిధులు రాలేవ‌ని సీఎం చంద్రబాబు తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట అని వైసీపీ అధినేత జగన్‌ ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు చేస్తోన్న డ్రామాలు చూస్తోంటే ఆశ్చ‌ర్యం అనిపించిందని అన్నారు. బడ్జెట్‌ తర్వాత చంద్ర‌బాబు మంత్రుల‌తో, ఎంపీల‌తో చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ట అని జగన్ చుర‌క‌లంటించారు. బీజేపీ ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిందని, గ‌తంలో ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్ గురించి ఏనాడూ ఇంత‌గా బాధ‌ప‌డ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం తీవ్రంగా బాధ‌ప‌డిపోతున్నార‌ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేది కేవ‌లం మోడీ కాదని, టీడీపీ నేతలు కేంద్ర మంత్రులుగా, ఎంపీలుగా ఉన్నారని, వీరంతా ఆమోదం తెలిపిన తరువాతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని జగన్‌ చెప్పారు.

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేది మోదీ కాద‌ని, ఎన్డీఏ ప్ర‌భుత్వ‌మ‌ని జగన్ అన్నారు. చంద్రబాబుకు తెలియకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారా? అని ప్ర‌శ్నించారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తోన్న‌ జ‌గ‌న్ మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు బీజేపీ, నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు విమర్శించలేదు, ప్రశ్నించలేదని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, మోదీ అన్యాయం చేసిందని అంటున్నారని చెప్పారు.

ప్రత్యేక హోదాని ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేద‌ని జగన్ అడిగారు. మొన్నటి వరకు చంద్ర‌బాబు ఒక‌లా మాట్లాడారని, సంవ‌త్స‌రంలో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని మ‌రోలా మాట్లాడ‌తార‌ని చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి ఇటువంటి నాటకాలు ఆడుతున్నారని, రాష్ట్రం వెనకపడిపోయిందన్న విషయాన్ని మోదీపై నెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరుని చూసి బాధపడిపోతున్నట్లు న‌టిస్తున్నార‌ని అన్నారు. గ‌త‌ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కావాలన్నారని, ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేకహోదా సంజీవా అంటూ ప్రశ్నించారని, సొంత మామనే మోసం చేసిన వ్యక్తికి ప్రజలు, మోదీ ఒక లెక్కా అని నిలదీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories