శ్రీనివాసరావు గురించి నిజాలు బయటపెట్టిన అతని కుటుంబ సభ్యులు

x
Highlights

ఠాణే లంక...తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఊరు అంటే.. పెద్దగా తెలియక పోవచ్చు...కానీ...వైఎస్‌ జగన్ పై కత్తి దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు...

ఠాణే లంక...తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఊరు అంటే.. పెద్దగా తెలియక పోవచ్చు...కానీ...వైఎస్‌ జగన్ పై కత్తి దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు ఊరంటే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అవును...ఒక్క ఘటనతో ఠాణే లంక పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. జగన్‌పై కత్తితో దాడి చేసిన జనుపల్లె శ్రీనివాసరావుది ఈ ఠాణే లంక గ్రామమే. శ్రీనివాసరావుది నిరుపేద కుటుంబం. తల్లితండ్రులు ఉపాది పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. అతని అన్నదమ్ములు కూడా కూలీనాలీ చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. శ్రీనివాస రావు గత ఐదేళ్లలో గ్రామంలో ఎక్కువ రోజులు ఉన్నది లేదు. ఉద్యోగం కోసం దుబాయి వెళ్లి అక్కడ ఉండలేక తిరిగిన వచ్చి చివరికి విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటిన్ లో చేరాడు. అయితే శ్రీనివాస రావు జగన్ పై దాడి చేశాడన్న వార్త తలుచుకుని కుటుంబ సభ్యులు షాక్‌కు గురవుతున్నారు. జగన్‌ని అమితంగా అభిమానించే శ్రీనివాస రావు అమాయకుడని అంటున్నారు.

శ్రీనివాస రావు గురించి కొన్ని ఛానల్స్‌ లో వస్తున్న వార్తలు చూసి అతని కుటుంబ సభ్యులు అవాక్కవుతున్నారు. శ్రీనివాసరావు ఇటీవల భారీ ఖర్చుతో పార్టీ ఇచ్చాడని.. పొలం కొనుగోలుకు కోటి రూపాయలతో బేరమాడాడని వస్తున్న కథనాలు చూసి బిత్తరపోతున్నారు. ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేయడానికి కూడా డబ్బుల్లేని తమపై అబద్ధదపు ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు. గ్రామంలో ఎవరో చేసుకున్న ఫంక్షన్‌ను తాము చేసుకున్నట్లు కట్టు కథలు అల్లుతున్నారని చెబుతున్నారు.

జగన్‌పై దాడి ఘటనతో ఠాణే లంక వాసులు తీవ్రంగా కలత చెందుతున్నారు. దాడి తర్వాతి పరిణామాలతో ఠాణే లంకకు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నాయకుల కారణంగా తమ ఊరి పెరు చెప్పాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీనివాసరావు భద్రత గురించి కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించటం ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయంలో తనకు ప్రాణహాని ఉందని చెప్పడం చూసిన బంధువులు ఆందోళన చెందుతున్నారు. హైప్రొఫైల్ కేసులో నిందితుడు కావటంతో ఏం జరుగుతుందోననే అనుమానం వారిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిష్ఫక్షపాతంగా విచారణ చేయిస్తే తప్పక నిజాలు వెలుగు చూస్తాయని శ్రీనివాసరావు కుటుంబసభ్యులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories